SRH vs RCB: ఉప్పల్‌లో విరాట్‌ మోత

విరామమే లేదు, దంచుడే దంచుడు! తొలి బంతి నుంచి క్రీజులో ఉన్నంతవరకు బౌలర్లకు చుక్కలే..! ఒకవైపు కింగ్‌ కోహ్లి మరోవైపు డుప్లెసిస్‌.. భారీ స్కోరు చేసి గెలుపుపై ఆశలు పెట్టుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊపిరాడకుండా చేశారు.

Updated : 19 May 2023 07:44 IST

63 బంతుల్లో 100
చెలరేగిన డుప్లెసిస్‌
ఏడో విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం
సన్‌రైజర్స్‌ చిత్తు
క్లాసెన్‌ శతక పోరాటం వృథా
ఈనాడు - హైదరాబాద్‌

విరామమే లేదు, దంచుడే దంచుడు! తొలి బంతి నుంచి క్రీజులో ఉన్నంతవరకు బౌలర్లకు చుక్కలే..! ఒకవైపు కింగ్‌ కోహ్లి మరోవైపు డుప్లెసిస్‌.. భారీ స్కోరు చేసి గెలుపుపై ఆశలు పెట్టుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊపిరాడకుండా చేశారు. పోటీపడి బంతిని బౌండరీకి పరుగెత్తించారు. ఇంకేముంది  లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. అభిమానులను ఉర్రూతలూగిస్తూ విధ్వంసక విన్యాసాలతో మ్యాచ్‌ను విరాట్‌ ఏకపక్షంగా మార్చేశాడు. ఐపీఎల్‌లో ఆరో శతకంతో గేల్‌ అత్యధిక శతకాల రికార్డును కోహ్లి సమం చేసిన వేళ.. ఉప్పల్‌ మోతెక్కిపోయింది. ఏడో విజయంతో ఐపీఎల్‌-16లో బెంగళూరు ప్లేఆఫ్స్‌ అవకాశాలను నిలబెట్టుకోగా.. ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌కు  సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు.

బెంగళూరు దుమ్ములేపింది. ఛాంపియన్‌ ఆటతీరు అదరగొట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో వెనుకబడి.. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో సత్తాచాటింది. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించిన బెంగళూరు.. హైదరాబాద్‌ గడ్డపై సన్‌రైజర్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (104; 51 బంతుల్లో 8×4, 6×6) ఐపీఎల్‌ కెరీర్‌లో మొదటి సెంచరీతో రాణించిన వేళ.. మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు రాబట్టింది. కోహ్లి (100; 63 బంతుల్లో 12×4, 4×6) మెరుపు సెంచరీకి డుప్లెసిస్‌ (71; 47 బంతుల్లో 7×4, 2×6) విధ్వంసక ఆట తోడవడంతో లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండు జట్ల తరఫున సెంచరీలు నమోదవడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్‌-4లోకి దూసుకెళ్లింది. 14 పాయింట్లు.. మెరుగైన రన్‌రేట్‌తో ముంబయి ఇండియన్స్‌ (14)ను వెనక్కి నెట్టి నాలుగో స్థానం సంపాదించింది. ఆదివారం తన చివరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలిస్తే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఖాయమే!

దంచేశారు..: బెంగళూరు టాప్‌-3 బ్యాటర్లున్న ఫామ్‌ ముందు 187 పరుగుల లక్ష్యం చిన్నగానే అనిపించింది. అందుకు తగ్గట్లే బెంగుళూరు బ్యాటింగ్‌ సాగింది. మొదటి బంతి నుంచి ఆఖరి పరుగు వరకు బ్యాటు జోరు తగ్గలేదు. ఓవర్‌కు 10 రన్‌రేటుతో సాగిన ఇన్నింగ్స్‌లో పరుగుల వరద ఆగలేదు. డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లి పోటీపడి పరుగులు సాధించగా.. ఛేదన నల్లేరుపై నడకలా సాగింది. సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పేసర్‌ భువనేశ్వర్‌కు కోహ్లి రెండు బౌండరీలతో స్వాగతం పలికాడు. అనంతరం అభిషేక్‌శర్మ ఓవర్లో కోహ్లి సైతం రెండు ఫోర్లతో జోరందుకున్నాడు. అలా మొదలైన పరుగుల తుఫాన్‌ కొనసాగుతూనే ఉంది. కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో డుప్లెసిస్‌ వరుసగా మూడు, కోహ్లి ఒక బౌండరీతో 18 పరుగులు రాబట్టారు. భువి తన రెండో ఓవర్లో డుప్లెసిస్‌కు దొరికిపోయాడు. డుప్లెసిస్‌ సిక్సర్‌, బౌండరీ సహా ఆ ఓవర్లో 14 పరుగులు సాధించాడు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి బెంగళూరు 64/0తో పటిష్ట స్థితికి చేరుకుంది. తొమ్మిదో ఓవర్లో నితీశ్‌కుమార్‌రెడ్డి తొలి బంతినే కోహ్లి సంప్రదాయ ఆన్‌డ్రైవ్‌తో సిక్సర్‌గా మలిచాడు. అయితే తన కెరీర్‌లో మొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న నితీశ్‌.. ఇద్దరు హేమాహేమీ బ్యాటర్లను సమర్థంగా అడ్డుకున్నాడు. వైవిధ్యమైన బంతులతో షాట్లు ఆడనివ్వలేదు.

అప్పటికే ఓ బౌన్సర్‌తో కోహ్లీని ఇబ్బంది పెట్టిన నితీశ్‌.. షార్ట్‌ పిచ్‌ బంతితో డుప్లెసిస్‌ను బోల్తాకొట్టించాడు. డుప్లెసిస్‌ పుల్‌ షాట్‌ ఆడగా.. డీప్‌ మిడ్‌ వికెట్‌లో మయాంక్‌ దాగర్‌ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్‌ అందుకున్నాడు. అయితే డుప్లెసిస్‌ సమీక్షకు వెళ్లడంతో బంతిని రెండో బౌన్సర్‌గా పరిగణించిన మూడో అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో నితీశ్‌కు వికెట్‌ దక్కినట్లే దక్కి చేజారింది. మరోవైపు బెంగళూరు స్కోరు 11.1 ఓవర్లలో 100 పరుగులకు చేరుకోగా.. డుప్లెసిస్‌ అర్ధ సెంచరీ (34 బంతుల్లో) కూడా పూర్తయింది. ఫిలిప్స్‌ బౌలింగ్‌లో బౌండరీతో అర్ధ సెంచరీ (35 బంతుల్లో) పూర్తి చేసుకున్న కోహ్లి.. మయాంక్‌ దాగర్‌ ఓవర్లో మిడ్‌ వికెట్‌ మీదుగా స్లాగ్‌ స్వీప్‌ సిక్సర్‌తో అలరించాడు. 42 బంతుల్లో 70 పరుగులు కావాల్సిన సమయంలో కోహ్లి, డుప్లెసిస్‌ దూకుడు పెంచారు. అభిషేక్‌ ఓవర్లో డుప్లెసిస్‌ ఒక బౌండరీ, మరో సిక్సర్‌తో 15 పరుగులు పిండుకున్నాడు. భువి తర్వాతి ఓవర్లో కోహ్లి నాలుగు అద్భుతమైన బౌండరీలతో హోరెత్తించాడు. దీంతో లక్ష్యం ఒక్కసారిగా కరిగిపోయింది. 30 బంతుల్లో 37 పరుగులుగా సమీకరణం మారిపోయింది. నటరాజన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో 90కి చేరుకున్న కోహ్లి.. భువి ఓవర్లో డీప్‌ మిడ్‌ వికెట్‌లో మరో భారీ సిక్సర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాతి బంతికే మరో భారీషాట్‌ ప్రయత్నంలో కోహ్లి ఔటవగా.. నటరాజన్‌ ఓవర్లో డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. 10 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉండగా.. మ్యాక్స్‌వెల్‌  (5 నాటౌట్‌), బ్రేస్‌వెల్‌ (4 నాటౌట్‌) పని పూర్తిచేశారు.

క్లాసెస్‌ దంచెన్‌: సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో క్లాసెన్‌ ఆటే హైలైట్‌. అతడి శతకమే సన్‌రైజర్స్‌కు మెరుగైన స్కోరు సాధించింది. అయితే క్లాసెన్‌కు జతగా మరో విధ్వంసక ఇన్నింగ్స్‌ లేకపోవడంతో సన్‌రైజర్స్‌ ఆశించిన స్థాయిలో స్కోరు రాబట్టలేకపోయింది. 17 ఓవర్లప్పుడు 200 స్కోరు సునాయాసంగా కనిపించినా.. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా పుంజుకుని సన్‌రైజర్స్‌ను కట్టడి చేశారు. హైదరాబాద్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. 4 ఓవర్లకు స్కోరు 27 పరుగులే. అయిదో ఓవర్లో ఓపెనర్లు అభిషేక్‌శర్మ (11; 14 బంతుల్లో 2×4), రాహుల్‌ త్రిపాఠి (15; 12 బంతుల్లో 2×4, 1×6)లను బ్రేస్‌వెల్‌ ఔట్‌ చేశాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డా క్లాసెన్‌ అదరగొట్టాడు. ఆరో ఓవర్లో షాబాజ్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదిన అతడు.. పవర్‌ ప్లే తర్వాత కూడా జోరు కొనసాగించాడు. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (18; 20 బంతుల్లో) బంతికో పరుగుతో సింగిల్స్‌కే పరిమితమైనా.. క్లాసెన్‌ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా స్పిన్నర్లు షాబాజ్‌, కర్ణ్‌శర్మలను లక్ష్యంగా చేసుకుని ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ దాటింది. అందులో సింహభాగం క్లాసెన్‌ పరుగులే. కర్ణ్‌శర్మ బౌలింగ్‌లో సిక్సర్‌తో అలరించిన క్లాసెన్‌.. సింగిల్‌తో కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

12వ ఓవర్లో సన్‌రైజర్స్‌ 100 పరుగులు పూర్తిచేసుకుంది. తన ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన మార్‌క్రమ్‌.. షాబాజ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మార్‌క్రమ్‌, క్లాసెన్‌ మూడో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. సీజన్‌లో ఒక సెంచరీ మినహా ఘోరంగా విఫలమై, జట్టులో స్థానం కోల్పోయి.. మళ్లీ వచ్చిన హ్యారీ బ్రూక్‌ (27 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 1×6) వస్తూనే బ్యాటు ఝుళిపించాడు. కర్ణ్‌శర్మ బౌలింగ్‌లో ఫోర్‌, సిక్స్‌తో సత్తాచాటాడు. అదే ఓవర్లో క్లాసెన్‌ మరో సిక్స్‌తో చెలరేగాడు. ఈ ఓవర్లో ఇద్దరూ కలిసి 21 పరుగులు పిండుకున్నారు. 17 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 160/3తో పటిష్టంగా ఉంది. ఆ సమయంలో 200 స్కోరు సాధ్యమే అనిపించింది. అయితే పార్నెల్‌ 18వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చాడు. హర్షల్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందుకొచ్చి బౌలర్‌ తల మీద నుంచి సిక్సర్‌తో క్లాసెన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి సెంచరీ (49 బంతుల్లో) సాధించాడు. సన్‌రైజర్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఇది రెండో శతకం. బ్రూక్‌ తొలి సెంచరీ చేశాడు. అయితే ఆ వెంటనే మరో భారీషాట్‌కు ప్రయత్నించిన క్లాసెన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆఖరి ఓవర్లో సిరాజ్‌ 4 పరుగులే ఇవ్వడంతో సన్‌రైజర్స్‌ అనుకున్నంత స్కోరు సాధించలేకపోయింది.


6

ఐపీఎల్‌లో విరాట్‌ శతకాల సంఖ్య. గేల్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.


100

ఈ స్టేడియంలో కోహ్లి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఇదే. 2014లో అతడు 64 పరుగులు సాధించాడు


172

ఉప్పల్‌ స్టేడియంలో బెంగళూరుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) లొమ్రార్‌ (బి) బ్రేస్‌వెల్‌ 11; త్రిపాఠి (సి) హర్షల్‌ పటేల్‌ (బి) బ్రేస్‌వెల్‌ 15; మార్‌క్రమ్‌ (బి) షాబాజ్‌ 18; క్లాసెన్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 104; బ్రూక్‌ నాటౌట్‌ 27; ఫిలిప్స్‌ (సి) పార్నెల్‌ (బి) సిరాజ్‌ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186; వికెట్ల పతనం: 1-27, 2-28, 3-104, 4-178, 5-186; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-17-1; పార్నెల్‌ 4-0-35-0; బ్రేస్‌వెల్‌ 2-0-13-2; షాబాజ్‌ అహ్మద్‌ 3-0-38-1; హర్షల్‌ పటేల్‌ 4-0-37-1; కర్ణ్‌శర్మ 3-0-45-0

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) ఫిలిప్స్‌ (బి) భువనేశ్వర్‌ 100; డుప్లెసిస్‌ (సి) త్రిపాఠి (బి) నటరాజన్‌ 71; మాక్స్‌వెల్‌ నాటౌట్‌ 5; బ్రాస్‌వెల్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (19.2 ఓవర్లలో 2 వికెట్లకు) 187; వికెట్ల పతనం: 1-172, 2-177; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-48-1; అభిషేక్‌ శర్మ 3-0-28-0; నటరాజన్‌ 4-0-34-1; కార్తీక్‌ త్యాగి 1.2-0-21-0; నితీశ్‌ కుమార్‌ రెడ్డి 2-0-19-0; మయాంక్‌ దాగర్‌ 4-0-25-0; గ్లెన్‌ ఫిలిప్స్‌ 1-0-10-0


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని