Virender Sehwag: ఉమ్రాన్‌ వారితో గొడవ పడ్డాడేమో.. వీరేందర్‌ సెహ్వాగ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యంతో పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గొడవ పడి ఉండొచ్చని భారత జట్టు మాజీ ఆటగాడు వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

Updated : 20 May 2023 07:58 IST

దిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యంతో పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గొడవ పడి ఉండొచ్చని భారత జట్టు మాజీ ఆటగాడు వీరేందర్‌ సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. నిరుడు ఐపీఎల్‌లో 22 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఉమ్రాన్‌కు ఈసారి ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం లభించింది. ఉమ్రాన్‌ను ఎందుకు ఆడించట్లేదంటూ గురువారం బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ మార్‌క్రమ్‌ను అడగ్గా.. అతను విచిత్రంగా స్పందించాడు. ‘‘నిజాయతీగా చెప్పాలంటే ఎందుకన్నది నాకు కచ్చితంగా తెలియదు. ఉమ్రాన్‌ కీలక ఆటగాడు. 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తాడు. తెర వెనుక ఏం జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. కానీ అతనిలో ఫలితాల్ని రాబట్టగల నేర్పు ఉంది’’ అని మార్‌క్రమ్‌ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ‘‘తెర వెనుక అంటే ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదు. ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉమ్రాన్‌ గొడవ పడి ఉండొచ్చు. లేదా వాదన జరిగిందేమో. అది సరైనది కాదు. అవకాశం ఇచ్చినప్పుడు సత్తాచాటకపోతే మళ్లీ ఛాన్స్‌ వచ్చే వరకు ఎదురుచూడాలి. ప్రదర్శనతో నోరు మూయించాలి. గతంలో డేవిడ్‌ వార్నర్‌ కూడా ఇలాగే చెప్పాడని అనుకుంటున్నా. భాష అదే. మార్‌క్రమ్‌ కాస్త మెరుగ్గా చెప్పాడు’’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని