MS Dhoni: మహి అధ్యాయంలో మరో పేజీ?
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ అయిపోయింది. ఎక్కువమంది కోరుకున్నట్లే చెన్నై సూపర్‌కింగ్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ జరిగింది అహ్మదాబాద్‌లో అయినా.. స్టేడియంలో ఎటు చూసినా పసుపుమయం.
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ అయిపోయింది. ఎక్కువమంది కోరుకున్నట్లే చెన్నై సూపర్‌కింగ్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ జరిగింది అహ్మదాబాద్‌లో అయినా.. స్టేడియంలో ఎటు చూసినా పసుపుమయం. స్టేడియంలోని అభిమానులే కాదు.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది సంబరాల్లో మునిగిపోయారు. సోమవారం అర్ధరాత్రి 1.30 వరకు చెన్నై గెలుస్తుందా లేదా అన్నదే ఉత్కంఠ! ఆ ఉత్కంఠ తీరిపోగానే కొత్త సందిగ్ధత మొదలైంది. సీఎస్కేకు అయిదో ట్రోఫీ అందించిన మహేంద్రసింగ్ ధోని.. ఇంతటితో నిష్క్రమిస్తాడా.. ఇంకో సీజన్ ఆడతాడా.. అన్నదే ఆ సందిగ్ధత!
ఈనాడు క్రీడావిభాగం
ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై నాలుగేళ్లు కావస్తోంది. ఇంకో అయిదు వారాల్లో అతడికి 42 ఏళ్లు నిండుతాయి. మోకాలి గాయం బాగా ఇబ్బంది పెడుతోంది. ఈ వయసులో, ఇలాంటి ఇబ్బందితో.. ఏడాదిలో పది నెలలు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉంటూ ఫిట్‌నెస్, లయను కాపాడుకోవడం.. ప్రపంచ మేటి క్రికెటర్లు తలపడే ఐపీఎల్‌లో నెగ్గుకు రావడం అంటే మాటలు కాదు. అంతర్జాతీయ క్రికెట్ వదిలేశాక తర్వాతి ఐపీఎల్ సీజన్లోనే ధోని బ్యాటింగ్, ఫిట్‌నెస్ దెబ్బ తిన్నట్లుగా కనిపించడంతో అప్పట్నుంచే తన రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది. అయితే జాతీయ జట్టులో అయితే ప్రదర్శన బాగా లేకుంటే.. యువ ఆటగాళ్లకు అవకాశం రాకుండా అడ్డు పడుతున్నాడనే విమర్శలు వస్తాయి. ఫ్రాంఛైజీ క్రికెట్లో అలాంటి సమస్య లేదు. ధోనీతో సీఎస్కే యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో వయసు మళ్లినా.. ఒకప్పటితో పోలిస్తే ప్రదర్శన తగ్గినా.. ధోని లీగ్‌లో కొనసాగుతున్నాడు. ఇక అభిమానుల ఆదరణ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా చెన్నై వాసులు అతడినెలా ఆరాధిస్తారో తెలిసిందే. కరోనా కారణంగా మూడేళ్ల పాటు చెన్నైలో మ్యాచ్‌లు లేకపోవడంతో మళ్లీ అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఆడి కానీ రిటైర్ కానని ధోని గత సీజన్లోనే తేల్చి చెప్పేశాడు. ఈ సీజన్‌తో ఐపీఎల్ తిరిగి చెన్నైకి వచ్చింది. చెపాక్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లతో తమిళ అభిమానులను అలరించాడు ధోని. మహికి ఇదే చివరి సీజన్ కావచ్చన్న అంచనాతో.. అతను దేశంలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తారు. అతను బ్యాటు పట్టుకుని మైదానంలో అడుగు పెడితే చాలు స్టేడియాలు హోరెత్తిపోయాయి. బౌండరీ కొట్టినా.. క్యాచ్ పట్టినా.. స్టంపింగ్ చేసినా కేరింతలు మిన్నంటాయి. ధోని కనిపించిన ప్రతి క్షణాన్నీ అభిమానులు ఆస్వాదించారు. ధోని టాస్ కోసం వచ్చినపుడు, బహుమతి ప్రదానోత్సవంలో మైక్ అందుకున్నపుడు స్టేడియాల్లో అభిమానులు ఎంత హెచ్చు స్థాయిలో శబ్దాలు చేశారో ఫైనల్ సందర్భంగా ప్రసారదారు డెసిబల్స్‌లో కొలిచి మరీ చూపించడం తనకున్న క్రేజ్‌కు నిదర్శనం. ఇలా ఈ సీజన్ అంతా తన ఉనికితోనే అభిమానులను అలరిస్తూ వచ్చిన మహి.. మరోవైపు ఏమంత బలంగా కనిపించని సీఎస్కేను తన నాయకత్వ పటిమతో మరోమారు విజేతగా నిలిపి సంబరాలు మిన్నంటేలా చేశాడు. కెరీర్‌కు తెరదించాలనుకుంటే.. ధోనీకి ఇంతకంటే మంచి ముగింపు మళ్లీ దక్కకపోవచ్చేమో! కానీ ఫైనల్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటన చేయకుండా ఉత్కంఠను కొనసాగించాడు.
ఔనంటే కాదనిలే.. కాదంటే ఔననిలే..: ధోని రిటైర్మెంట్ గురించి ఈ సీజన్ అంతా చర్చ జరగడానికి అతను చేసిన వ్యాఖ్యలు కూడా ఓ కారణం. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఓ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు పసుపు జెర్సీలతో హాజరై తన నామస్మరణ చేయడం గురించి బహుమతి ప్రదానోత్సవంలో మాట్లాడుతూ.. బహుశా తనకు వీడ్కోలు పలకడానికి వచ్చారేమో అన్నాడు మహి. మరో సందర్భంలో తాను కెరీర్ చివరి దశలో ఉన్నట్లు చెప్పాడు. కానీ మరో మ్యాచ్ ఆరంభానికి ముందు ఇదే తన చివరి సీజన్ అన్నట్లుగా వ్యాఖ్యాత మోరిసన్ మాట్లాడితే.. ‘‘ఇదే చివరిదని మీరు నిర్ణయించేశారా’’ అంటూ నవ్వేశాడు. దీంతో మహి మరో సీజన్ ఆడతాడంటూ మోరిసన్ అభిమానుల కేరింతల మధ్య ప్రకటించాడు. ఇలా తన రిటైర్మెంట్‌పై సందిగ్ధతను కొనసాగిస్తూ వచ్చిన మహి.. ఫైనల్ మ్యాచ్ అయ్యాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు.. మరో సీజన్ ఆడటం ద్వారా బహుమతి ఇవ్వాలని ఉందని.. కానీ అది అంత తేలిక కాదని.. అందుకోసం తన వంతుగా చేయాల్సిందంతా చేస్తానని అన్నాడు కెప్టెన్ కూల్. ఇది అభిమానులకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ధోని ఇంకో సీజన్ కొనసాగుతాడనే ధీమాతో ఉన్నారిప్పుడు అభిమానులు. కానీ ధోని ఆలోచన తీరు అంచనాలకు అందనిది. అతను అవునంటే అవునని.. కాదంటే కాదని కాదు! రాబోయే రోజుల్లో అతడి నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం!
తన ఉనికే చాలు..: ఒక ఆటగాడు జట్టుకు భారం అయినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మరి ధోని ఆ స్థితిలో ఉన్నాడా అన్నది ప్రశ్న. నిజానికి మహి లాంటి ఆటగాళ్లు కొనసాగడానికి ఆటతీరుతో సంబంధమే లేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే సచిన్ తర్వాత కేవలం తన ఉనికితో అభిమానులను ఉర్రూతలూగించే అరుదైన ఆటగాడు ధోనీ! మహి బ్యాటింగ్ సత్తా తగ్గి ఉండొచ్చు కానీ.. ఆ విషయంలో చెన్నై ఇప్పుడు తనపై ఆధారపడట్లేదు. కెప్టెన్‌గా అతడిలో చేవ తగ్గలేదనడానికి తాజా టైటిల్ విజయం రుజువు. వికెట్ కీపింగ్‌లో మహి చురుకుదనానికి ఫైనల్లో శుభ్‌మన్ స్టంపింగే నిదర్శనం. ఇప్పటికీ ఒక ఆటగాడిగా చెన్నై జట్టులో కొనసాగడానికి మహికి ఎలాంటి ఇబ్బందీ లేదు. వీటన్నింటికీ మించి చెన్నై ఫ్రాంఛైజీకి ధోని తెచ్చి పెడుతున్న విలువ ఏ స్థాయిదో అందరికీ తెలుసు. సీఎస్కే ఆకర్షణ అంతా ధోనీతోనే ముడిపడి ఉంది. కేవలం ధోని ఉనికే లక్షల మందిని స్టేడియాలకు రప్పిస్తుంది. అంతకు వందల రెట్లలో టీవీల ముందు కూర్చోబెడుతుంది. అతను ఆడడంటే ఇక క్రికెట్టే చూడం, చెన్నై ఫ్రాంఛైజీని అనుసరించని అభిమానుల సంఖ్య పెద్దదే! ఇక ఫ్రాంఛైజీకి, స్పాన్సర్లకు, ఐపీఎల్‌కు అతను చేకూర్చే ఆర్థిక ప్రయోజనం గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ధోని నిష్క్రమణ ఎవ్వరికీ రుచించే విషయం కాదు. ధోని ఆడతానంటే చెన్నై ఫ్రాంఛైజీ ఎన్నేళ్లయినా అతణ్ని కొనసాగిస్తుంది. ఆటతీరుతో సంబంధం లేకుండా అభిమానులూ తనపై ఇంతే అభిమానం చూపిస్తారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మహి ఇంకొక్క సీజన్ కొనసాగితే 2024 ఐపీఎల్ కూడా కళకళలాడనున్నట్లే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి