366 రోజుల్లో మరో ప్రపంచంలోకి!

వివిధ క్రీడల్లో ప్రపంచకప్‌లు ఉండొచ్చు.. విభిన్న క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తుండొచ్చు.. వేర్వేరు దేశాల్లో ప్రతిష్ఠాత్మక లీగ్‌లు జరుగుతుండొచ్చు.. కానీ ఏ అథ్లెటైనా కలగనేది ఆ పతకం కోసమే. ఒక్కసారి ఆ మెగా క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించి.. పోడియంపై నిలబడే క్షణం కోసం.. అహర్నిశలు కష్టపడతారు.

Published : 26 Jul 2023 02:05 IST

ఈనాడు క్రీడావిభాగం

వివిధ క్రీడల్లో ప్రపంచకప్‌లు ఉండొచ్చు.. విభిన్న క్రీడాంశాల్లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తుండొచ్చు.. వేర్వేరు దేశాల్లో ప్రతిష్ఠాత్మక లీగ్‌లు జరుగుతుండొచ్చు.. కానీ ఏ అథ్లెటైనా కలగనేది ఆ పతకం కోసమే. ఒక్కసారి ఆ మెగా క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించి.. పోడియంపై నిలబడే క్షణం కోసం.. అహర్నిశలు కష్టపడతారు. ఇందులో పసిడిని ముద్దాడితే చాలు.. కెరీర్‌ పరిపూర్ణమైనట్లు జీవితకాల అనుభూతిని పొందుతారు. అథ్లెట్లను దేశ హీరోలుగా మార్చే ఆ క్రీడలే.. ఒలింపిక్స్‌. ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న ఒలింపిక్స్‌ మళ్లీ వచ్చేస్తున్నాయి. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇంకో ఏడాది మాత్రమే ఉంది. వచ్చే ఏడాది జులై 26న ఈ మెగా వెంట్‌ ఆరంభమవుతోంది. ఈ నేపథ్యంలో క్రీడలకు సంబంధించి.. కొన్ని విశేషాలు చూసేద్దాం పదండి!


మూడుసార్లు.. రెండో నగరం

ఒలింపిక్స్‌కు మూడుసార్లు ఆతిథ్యమిచ్చిన రెండో నగరంగా పారిస్‌ రికార్డుల్లోకెక్కనుంది. లండన్‌ (1908, 1948, 2012) మొదటి నగరం. పారిస్‌లో తొలిసారి 1900లో ఒలింపిక్స్‌ జరిగాయి. మొదటిసారి మహిళా అథ్లెట్లు పోటీపడ్డ ఒలింపిక్స్‌ ఇవే. ఆ తర్వాత 1924లో ఈ మెగా క్రీడలకు పారిస్‌ వేదికగా నిలిచింది. ఇప్పుడు సరిగ్గా వందేళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఇక్కడ ఒలింపిక్స్‌ నిర్వహించనున్నారు.


జ్యోతి ఇలా..

ఒలింపిక్స్‌కు ఏడాది కౌంట్‌డౌన్‌ మొదలైన సందర్భంగా ఈ మెగా ఈవెంట్‌ నిర్వాహకులు జ్యోతిని ఆవిష్కరించారు. వెండి రంగులో గొట్టం తరహాలో ఉన్న ఈ జ్యోతి.. మధ్యలో వెడల్పుగా ఉండి రెండు చివర్లలో చిన్నగా కనిపిస్తోంది. రెండు ముక్కల్ని అతికించినట్లుగా మధ్య నుంచి పైన ఒకలా, కింద ఒకలా కనిపిస్తోంది. సెన్‌ నదిలో కనిపించే ఈఫిల్‌ టవర్‌ ప్రతిబింబాన్ని సూచించేలా ఈ జ్యోతిని రూపొందించారు. పునర్వినియోగం చేసిన ఉక్కుతో దీన్ని తయారుచేశారు. ఫ్రెంచ్‌ డిజైనర్‌ మాథ్యూ  లెహన్యూర్‌ జ్యోతి రూపకర్త. ప్రస్తుతం పారిస్‌లో అల్లర్ల నేపథ్యంలో ‘శాంతి’ ఇతివృత్తంతో ఈ జ్యోతిని రూపొందించారు. నిర్వాహకులు ఇలాంటి జ్యోతులు 2 వేల దాకా తయారు చేస్తున్నారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే జ్యోతి పరిమాణం తక్కువ. దీని పొడవు 70 సెంటీమీటర్లు, బరువు 1.5 కేజీలు. గ్రీస్‌లో జ్యోతిని వెలిగించి పడవ ద్వారా మార్సియెలీకి తీసుకెళ్తారు. వచ్చే ఏడాది మే 8 నుంచి పదివేల మందితో జ్యోతి యాత్ర మొదలవుతుంది. జులై 26న ఒలింపిక్స్‌ ఆరంభం కానున్నాయి.


నదిలో వేడుకలు

ఒలింపిక్స్‌ ఆరంభ, ముగింపు వేడుకలు అంటే ప్రధాన స్టేడియంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారని తెలుసు. కానీ పారిస్‌ ఒలింపిక్స్‌ వేడుకలు మాత్రం స్టేడియంలో జరగడం లేదు. మరి ఎక్కడ నిర్వహిస్తారని అనుకుంటున్నారా? ఆ నగరంలో ప్రవహించే ప్రముఖ నది సెన్‌..  ఈ వేడుకలకు వేదికగా నిలవనుంది. ఈ నదిలో ఆరు కిలోమీటర్ల దూరం పాటు ఈ ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహిస్తారని సమాచారం. ఈ నదికి రెండు వైపులా ఒడ్డుపై ఉండి కనీసం 6 లక్షల మంది ప్రేక్షకులు ఈ వేడుకలను వీక్షించే అవకాశముంది. తొలిసారి స్టేడియం బయట జరిగే ఒలింపిక్స్‌ ఆరంభ, ముగింపు వేడుకలు ఇవే.


డ్యాన్స్‌ చేసేయ్‌.. పతకం పట్టేయ్‌

అవును.. మీరు చదివింది నిజమే. సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తే చాలు ఒలింపిక్స్‌ పతకం పట్టేయొచ్చు. ఎందుకంటే ఈ పారిస్‌లోనే బ్రేక్‌ డ్యాన్సింగ్‌ పోటీ ఒలింపిక్స్‌ అరంగేట్రం చేస్తుంది. ఇందులో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పతక పోటీలుంటాయి. ఒక్కొక్కరుగానే ఈ డ్యాన్స్‌ పోటీలో తలపడాల్సి ఉంటుంది. డీజే పెట్టే సంగీతానికి అనుగుణంగా డ్యాన్సర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో అలరించనున్నారు. 2018 యూత్‌ ఒలింపిక్స్‌లో బ్రేక్‌ డ్యాన్సింగ్‌ను తొలిసారి నిర్వహించారు. అలాగే   పారిస్‌లో తొలిసారిగా ప్రజల కోసం ఓపెన్‌ మారథాన్‌ నిర్వహించనున్నారు. ఇక అతిపెద్ద ఫ్రాన్స్‌ విదేశీ ద్వీపమైన తహితిలో సర్ఫింగ్‌ పోటీలు జరుగుతాయి. దీంతో ఆతిథ్య నగరం నుంచి అత్యంత దూరంలో ఒలింపిక్‌ క్రీడాంశాన్ని నిర్వహించే ప్రదేశంగా ఇది రికార్డులకెక్కనుంది. పారిస్‌ నుంచి పసిఫిక్‌ సముద్రంలోని ఈ ద్వీపం 15,706 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పారిస్‌ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్లలో పతక పోటీలు జరుగుతాయి.


రెండింటికీ అదే గుర్తు

ఎప్పుడైనా ఒలింపిక్స్‌, ఆ తర్వాత జరిగే పారాలింపిక్స్‌కు వేర్వేరు గుర్తు (లోగో)లు ప్రదర్శిస్తారు. కానీ ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌కూ ఒకే గుర్తును వాడుతుండడం పారిస్‌ క్రీడల్లోనే తొలిసారి జరగబోతోంది. స్వర్ణ పతకం, ఒలింపిక్‌ జ్యోతి, మరియానె (ఫ్రాన్స్‌ ప్రజలు, విప్లవానికి చిహ్నం)తో ఈ గుర్తు ఉంది. మరోవైపు క్రీడల నిర్వహణ ఖర్చును తగ్గించడంతో పాటు పర్యావరణ హితంపైనా ఈ ఒలింపిక్స్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రీడల కోసం శాశ్వతంగా నిలిచిపోయే కొత్త స్టేడియాలు నిర్మిస్తే ఖర్చుతో పాటు కర్బన ఉద్గారాల సమస్య ఉంటుందని వీళ్లు భావించారు. అందుకే ఇప్పటికే ఉన్న వేదికలను ఉపయోగించడంతో పాటు కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇవే దాదాపు 95 శాతం ఉండనున్నాయి. ఈ ఒలింపిక్స్‌ అంచనా వ్యయం 7.3 బిలియన్‌ యూరోలు (రూ.66146 కోట్లు). టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల ఖర్చు 15.4 బిలియన్‌ డాలర్ల (రూ.1.25 లక్షల కోట్లు)తో పోలిస్తే ఇది సగం కావడం గమనార్హం.


ఒలింపిక్స్‌ భద్రమేనా?

ఒలింపిక్స్‌కు ఏడాదే సమయం ఉండగా.. ఈ మెగా ఈవెంట్‌ను ఫ్రాన్స్‌ ఎలా నిర్వహిస్తుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుక్కారణం ఆ దేశంలో నెలకొన్న అశాంతే. జూన్‌లో పోలీసుల కాల్పుల్లో ఓ కుర్రాడు హతమయ్యాక పారిస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన అల్లర్లు నెలలు గడుస్తున్నా పూర్తిగా సద్దుమణగలేదు. ఒక దశలో పరిస్థితి పోలీసుల చేయి దాటిపోయింది. తర్వాత కొంచెం నియంత్రణ సాధించినప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేమవుతుందో అన్న ఆందోళన పారిస్‌ వాసుల్లో ఉంది. మరి ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు, కోచ్‌లు పాల్గొనే ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఎలాంటి భద్రత కల్పిస్తారు.. ఒలింపిక్స్‌ సమయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ఆందోళనకారులు ఏదైనా చేస్తే ఎలా నియంత్రిస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని