Praggnanandhaa: అమ్మ దిద్దిన ప్రజ్ఞ

అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చెస్‌ ప్రపంచకప్‌ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, ప్రతినిధులు, టోర్నీ నిర్వాహకులతో టోర్నీ ప్రాంగణం కళకళలాడుతోంది.

Updated : 24 Aug 2023 14:22 IST

అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో చెస్‌ ప్రపంచకప్‌ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, ప్రతినిధులు, టోర్నీ నిర్వాహకులతో టోర్నీ ప్రాంగణం కళకళలాడుతోంది. వీళ్లంతా సూట్లు, అధునాతన దుస్తులేసుకుని మెరిసిపోతుంటే.. చీర కట్టుకుని మన ఊర్లలో మహిళల్లా కనిపించేలా ఒక నడివయస్కురాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ అలాంటి ఆహార్యంలో ఒక మహిళ ఉండటం చూసే వారికి చాలా చిత్రంగా అనిపిస్తోంది. ప్రపంచకప్‌ సెమీస్‌ జరుగుతుండగా.. ఆమె ఒంటరిగా ఆ ప్రాంగణంలో తిరుగుతోంది. కాసేపటి తర్వాత ఆమె కుర్చీలో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుని చీర కొంగుతో తుడుచుకుంటూ కనిపించింది. కొన్ని నిమిషాలకు సెమీస్‌లో గెలిచిన క్రీడాకారుడు వచ్చి మైకు ముందు మాట్లాడుతుంటే తన పక్కనే ఆ మహిళ నిలబడింది. తన గేమ్‌ గురించి మాట్లాడ్డం అయిపోయాక ఆ మహిళను పట్టుకుని.. తన వెనుక ఉండి నడిపించేది ఆమే అని ఉద్వేగంతో చెప్పాడా క్రీడాకారుడు. కరువానా లాంటి మేటి చెస్‌ ప్లేయర్‌ను ఓడించి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన ఆ క్రీడాకారుడి తల్లి ఆమె. భారత చెస్‌ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేస్తున్న ప్రజ్ఞానంద ఛాంపియన్‌గా ఎదగడంలో ఆమె పాత్ర కీలకం. తన పేరు.. నాగలక్ష్మి.

ఈనాడు క్రీడావిభాగం

మాగ్నస్‌ కార్ల్‌సన్‌.. దశాబ్ద కాలంగా అప్రతిహత విజయాలతో ప్రపంచ చెస్‌ను ఏలుతున్న మహారాజు! అతడి ధాటికి విశ్వనాథన్‌ ఆనంద్‌ సహా ఎందరో దిగ్గజాలు నిలవలేకపోయారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా టైటిళ్లు గెలిచి గెలిచి మొహం మొత్తేసి.. ఇక ఆ టోర్నీ నేనాడను అంటూ పోటీ నుంచే వైదొలిగిన స్థాయి అతడిది. అలాంటి ఆటగాడిని ఏడాది వ్యవధిలో మూడుసార్లు ఓడించిన సంచలన క్రీడాకారుడు ప్రజ్ఞానంద(Praggnanandhaa). కేవలం 12 ఏళ్ల 10 నెలల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌ అయి భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలవడం మొదలు భారత చెస్‌లో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కుర్రాడిని చెస్‌లోకి తీసుకొచ్చింది, ఇప్పటికీ తన వెంటే ఉండి నడిపిస్తున్నది తల్లి నాగలక్ష్మినే. ప్రజ్ఞానంద తండ్రి రమేశ్‌ బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. ప్రజ్ఞానంద సోదరి వైశాలి ప్రస్తుతం మహిళల ఇంటర్నేషనల్‌ మాస్టర్‌. ఆమె టీవీతోనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తోందని తనకు చెస్‌ బోర్డు కొనిచ్చింది తల్లి. అదే సమయంలో ప్రజ్ఞానందకు కూడా ఈ ఆటపై ఆసక్తి కలిగింది. ఈ ఆటలోకి అడుగు పెట్టే సమయానికి తన వయసు నాలుగున్నరేళ్లే. అక్కతో కలిసి ఆడుతూ ఆటపై కాస్త పట్టు సాధించాక.. త్యాగరాజన్‌ అనే కోచ్‌ దగ్గర అతను శిక్షణకు చేరాడు. స్వీయ ప్రతిభకు శిక్షణ తోడవడంతో పిన్న వయసులోనే పెద్ద వాళ్ల మీద గెలుస్తూ ఆటలో ఎదిగాడు.

బాల మేధావిగా పేరు తెచ్చుకున్న ప్రజ్ఞానంద 10 ఏళ్ల 10 నెలలకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయి ప్రపంచ చెస్‌ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడయ్యాడు. ఇంకో రెండేళ్లకే గ్రాండ్‌మాస్టర్‌ ఘనతా సాధించాడు. ప్రజ్ఞానంద ప్రతిభకు ఆనంద్‌ సహా ఎందరో ముగ్ధులయ్యారు. ఏకంగా అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి.. ప్రత్యర్థులకు కొరక రాని కొయ్యలా మారిన కార్ల్‌సన్‌ను 16 ఏళ్ల వయసులోనే ఓడించి సంచలనం రేపడమే కాక ఏడాది వ్యవధిలో ఇంకో రెండుసార్లు అతడిపై పైచేయి సాధించడంతో చెస్‌ ప్రపంచంలో తన పేరు మార్మోగింది. ఇప్పుడు చెస్‌ ప్రపంచకప్‌లో కరువానా లాంటి మేటి ఆటగాడిని ఓడించి కార్ల్‌సన్‌తో ఫైనల్‌ పోరుకు అర్హత సాధించాడు. ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద ప్రదర్శన దిగ్గజ క్రీడాకారుడు కాస్పరోవ్‌ను సైతం మెప్పించింది. చిన్నతనం నుంచి స్థానిక టోర్నీలైనా.. అంతర్జాతీయ స్థాయిలో తలపడ్డా.. తన వెంట తల్లి నాగలక్ష్మి ఉండాల్సిందే. నాగలక్ష్మి లాంటి మధ్య తరగతి మహిళలు పిల్లల వెంట విదేశాలకు వెళ్లి టోర్నీల కోసం తిరగాలంటే కంగారు పడతారు. కానీ ఆమె మాత్రం కొడుకు వెంటే ఉండి అతడికి భరోసానివ్వడానికే చూస్తుంది. కాస్పరోవ్‌ అంతటి వాడు ప్రజ్ఞానంద ఆటను ప్రశంసిస్తూనే.. అతడికి తల్లి ఇస్తున్న ప్రోత్సాహాన్ని కొనియాడాడు.


డ్రాతో మొదలు.. కార్ల్‌సన్‌తో ఫైనల్‌

బాకు: ఫిడె చెస్‌ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన భారత యువ సంచలనం ప్రజ్ఞానంద.. ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో తుదిపోరును డ్రాతో ఆరంభించాడు. మంగళవారం ఫైనల్‌ తొలి రౌండ్లో వీళ్లిద్దరూ పాయింట్లు పంచుకున్నారు. ఇప్పటికే మూడుసార్లు కార్ల్‌సన్‌ను ఓడించడమే కాక.. సెమీస్‌లో కరువానా లాంటి మేటి క్రీడాకారుడిపై విజయం సాధించిన ప్రజ్ఞానంద.. తుది పోరులో ఉత్తమ ప్రదర్శన చేశాడు. కార్ల్‌సన్‌ను నిలువరించి 35 ఎత్తుల్లో గేమ్‌ను డ్రాగా ముగించాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానందకు కార్ల్‌సనేడ్రా ప్రతిపాదన చేయడం విశేషం. రెండో గేమ్‌ బుధవారం జరుగుతుంది. అది కూడా డ్రా అయితే విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ నిర్వహిస్తారు. ‘‘గేమ్‌లో నేనెక్కడా ఇబ్బంది పడలేదు. రెండో గేమ్‌లో కూడా హోరాహోరీగా ఉంటుందనుకుంటున్నా. నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఇప్పుడిక విశ్రాంతి తీసుకుని రెండో గేమ్‌కు తాజాగా వస్తా’’ అని తొలి గేమ్‌ అనంతరం ప్రజ్ఞానంద వ్యాఖ్యానించాడు. కలుషిత ఆహారం తన ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో తొలి గేమ్‌కు తాను ఉత్తమ స్థితిలో లేనని కార్ల్‌సన్‌ వెల్లడించాడు. ‘‘ప్రజ్ఞానంద ముందు రోజే టైబ్రేక్‌ ఆడాడు. నాకు తనకంటే ఒక రోజు ఎక్కువ విశ్రాంతి లభించడం కలిసొచ్చే విషయమే. కానీ అబసోవ్‌తో గేమ్‌ తర్వాత కలుషిత ఆహారం వల్ల ఇబ్బంది పడ్డా. రెండు రోజుల పాటు సరిగా తినలేదు. నాకు తగినంత శక్తి లేదు’’ అని అతనన్నాడు.


వాళ్లింట్లో తెలుగు

ప్రజ్ఞానంద కుటుంబంలో తెలుగు మూలాలుండటం విశేషం. అతడి తండ్రి రమేశ్‌ బాబు తెలుగువారే. వీరిది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. రమేశ్‌తో పాటు ఆయన భార్య నాగలక్ష్మి కూడా తెలుగు మాట్లాడుతుంది. ఇంట్లో పెద్ద వాళ్లు తెలుగులోనే సంభాషించుకుంటారట. అయితే ప్రజ్ఞానందకు, అతడి సోదరి వైశాలికి తెలుగు అర్థమవుతుంది కానీ.. మాట్లాడలేరట. ఒక ఇంటర్వ్యూలో నాగలక్ష్మే స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తమ  ఇంట్లో తెలుగు సినిమాలు కూడా చూస్తుంటామని ఆమె చెప్పింది.


‘‘ప్రజ్ఞానంద ఎదుగుదల తాలూకు ఘనతంతా నా భార్యకే కట్టబెడతా. ఆమె చిన్నతనం నుంచి అతడికి ఎంతగానో మద్దతుగా నిలుస్తోంది. తనే అతణ్ని టోర్నీలకు తీసుకెళ్తుంటుంది. ఇద్దరు పిల్లల్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దింది. టీవీ వీక్షణం నుంచి దృష్టి మళ్లించడానికి చెస్‌ నేర్పిస్తే ఇద్దరికీ ఆ ఆట బాగా నచ్చేసింది’’

రమేశ్‌ బాబు, ప్రజ్ఞానంద తండ్రి


‘‘ప్రజ్ఞానందతో పాటు ఆమె తల్లికి కూడా శుభాకాంక్షలు. ప్రతి టోర్నీలోనూ తన వెంటే ఉంటూ ప్రత్యేకమైన మద్దతునిచ్చే ఆమె ఇప్పుడు గర్విస్తూ ఉంటుంది. ఈ చెన్నై ఆటగాడు న్యూయార్క్‌ కౌబాయ్‌లను ఓడించాడు. ప్రతికూల పరిస్థితుల్లో అతను గొప్ప పట్టుదలను ప్రదర్శించాడు’’

కాస్పరోవ్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని