Rohit Sharma: మేమూ తప్పులు చేయొచ్చు

వన్డే ప్రపంచకప్‌ అంటే ఒత్తిడి తప్పక ఉంటుంది. సొంతగడ్డపై అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే తాను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటానని అంటున్నాడు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.

Updated : 29 Aug 2023 09:54 IST

వన్డే ప్రపంచకప్‌ అంటే ఒత్తిడి తప్పక ఉంటుంది. సొంతగడ్డపై అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే తాను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటానని అంటున్నాడు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. బెంగళూరులో ఆసియాకప్‌ శిబిరంలో చేరడానికి ముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి, జట్టు గురించి, ప్రపంచకప్‌ గురించి రోహిత్‌ ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

బెంగళూరు: అనుకూలమైనవైనా, ప్రతికూలమైనవైనా.. బయటి అంశాలు పోషించే పాత్ర గురించి ఆలోచించకోకుండా నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవడం నాకు ముఖ్యం. వాటిని పూర్తిగా విస్మరించాలనుకుంటున్నా. 2019 ప్రపంచకప్‌కు ముందు ఉన్న దశలోకి వెళ్లాలనుకుంటున్నా. ఆ టోర్నీ (అయిదు శతకాల సహాయంతో 648 చేశాడు) సమయంలో నేను మానసికంగా గొప్ప స్థితిలో ఉన్నా. బాగా సన్నద్ధమయ్యా. ఇప్పుడూ అలాంటి స్థితిలోనే ఉండాలనుకుంటున్నా. అందుకు నాకు తగినంత సమయం ఉంది. 2019 ప్రపంచకప్‌కు ముందు క్రికెటర్‌గా, వ్యక్తిగా నేను చేసిన సరైన పనులేంటో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.

వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తా..: అత్యుత్తమ కూర్పును ఎంచుకునే సమయంలో వివిధ కారణాల వల్ల కొందరు జట్టులో చోటు కోల్పోతారు. రాహుల్‌ భాయ్‌ (ద్రవిడ్‌), నేను వాళ్లెందుకు జట్టులో లేరో వివరించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. ప్రతి సెలక్షన్‌ తర్వాత, తుది జట్టును ప్రకటించాక మేం ఆటగాళ్లతో మాట్లాడతాం. ఒక్కొక్కరితో ముఖాముఖితో మాట్లాడి, వాళ్లనెందుకు తీసుకోలేదో చెబుతాం. కొన్నిసార్లు నేను వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తా. 2011 ప్రపంచకప్‌కు ఎంపిక కానప్పుడు నా గుండె బద్ధలైంది. ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించాక ఇంకేం మిగిలుంది అనిపించింది. నేను, కోచ్‌లు, సెలక్టర్లు కలిసి.. ప్రత్యర్థి, పిచ్‌లు, మా బలాలు, వాళ్ల బలహీనతలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక ఉమ్మడి అభిప్రాయానికి వస్తాం. అయితే మా నిర్ణయాలు తప్పయ్యే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఏదేమైనా కొందరు వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి. మనుషులన్నాక తప్పులు చేస్తారు. మేం అన్నిసార్లూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. నా వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా ఆటగాళ్లను తీసుకోకపోవడం, తీసుకోవడమనేది ఉండదు. ఎవరికైనా అవకాశం రాలేదంటే దానికి కారణం ఉంటుంది.

అప్పుడు యువీ ఓదార్చాడు: 2011 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించాక నేను నా గదిలో విచారంగా కూర్చుని ఉన్నా. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు యువరాజ్‌ నన్ను తన గదికి పిలిచాడు. డిన్నర్‌కు తీసుకెళ్లాడు. జట్టుకు ఎంపిక కానప్పుడు ఎంత బాధగా ఉంటుందో చెప్పాడు. ‘‘నువ్వు ఇంకా చాలా ఏళ్లు క్రికెట్‌ ఆడగలవు. బాగా కష్టపడు. నైపుణ్యాలను పెంచుకుని తిరిగి జట్టులోకి రా. నువ్వు మళ్లీ భారత్‌కు ఆడకుండా ఉండే అవకాశం లేదు. నీకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం తప్పక వస్తుంది’’ అని చెప్పాడు. ఓసారి ప్రపంచకప్‌ జట్టులో స్థానం కోల్పోయిన నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని