Mohammed Siraj: సిరాజసం!

శ్రీలంకతో ఫైనల్లో అసాధారణ ప్రదర్శన చేసిన సిరాజ్‌ను తిట్టుకున్న అభిమానులూ లేకపోలేదు! అదేంటీ.. సంచలన బౌలింగ్‌తో జట్టుకు ఆసియా కప్‌ను అందించిన సిరాజ్‌ను తిట్టుకోవడం ఏమిటీ? అనుకుంటున్నారా! ఆదివారం రోజు చక్కగా ఈ తుదిపోరును ఆస్వాదిద్దామని, మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు ఆశించారు.

Updated : 18 Sep 2023 08:46 IST

శ్రీలంకతో ఫైనల్లో అసాధారణ ప్రదర్శన చేసిన సిరాజ్‌ను తిట్టుకున్న అభిమానులూ లేకపోలేదు! అదేంటీ.. సంచలన బౌలింగ్‌తో జట్టుకు ఆసియా కప్‌ను అందించిన సిరాజ్‌ను తిట్టుకోవడం ఏమిటీ? అనుకుంటున్నారా! ఆదివారం రోజు చక్కగా ఈ తుదిపోరును ఆస్వాదిద్దామని, మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతుందని అభిమానులు ఆశించారు. కానీ సిరాజ్‌ మాత్రం టపటపా వికెట్లు పడగొట్టి.. ప్రణాళికలను మార్చేశాడు. మ్యాచ్‌ ఏకపక్షమైనందుకు సిరాజ్‌ను తిట్టుకున్నా.. అతడి ప్రదర్శనకు అబ్బురపడని అభిమాని లేడు. పరుగులు ఇచ్చేస్తున్నాడు.. వికెట్లు తీయడం లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఇప్పుడు జట్టులో కీలక పేసర్‌గా సిరాజ్‌ ఎదిగిన తీరు అసాధారణం.

ఈనాడు క్రీడావిభాగం

హమ్మద్‌ సిరాజ్‌.. ప్రతిభ, నైపుణ్యాలకు కొదవలేని పేసర్‌. మంచి పేస్‌, సీమ్‌, స్వింగ్‌ రాబట్టగల బౌలర్‌. అతణ్ని సరైన విధంగా వాడుకుంటే ఎలాంటి సంచలనాలు సృష్టించగలడో శ్రీలంకతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్‌ చూపించాడు. ఆటో డ్రైవర్‌ తనయుడిగా మొదలై.. గల్లీల్లో క్రికెట్‌ ఆడి.. ఇప్పుడు టీమ్‌ఇండియాలో ప్రధాన పేసర్లలో ఒకడిగా అతను ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. అతనిలోని నైపుణ్యాలను జాగ్రత్తగా సానబెడుతూ సరైన దిశగా ఉపయోగించుకుంటున్న టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌నూ ఈ విషయంలో అభినందించాల్సిందే. నాణ్యమైన ముడి సరుకు సిరాజ్‌ లోపల చాలానే ఉంది. ఆరంభంలో దీన్ని బయటకు తేలేక, నియంత్రణ లేక బౌలింగ్‌లో అతను తడబడ్డాడు. 2017 ఐపీఎల్‌ అరంగేట్రంలోనే సిరాజ్‌ సన్‌రైజర్స్‌ తరపున 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో సత్తాచాటాడు. కానీ ఆ తర్వాత నిలకడ కోల్పోయాడు. టీమ్‌ఇండియాలో అడుగుపెట్టిన కొత్తలోనూ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ మెరుగుపడాలనే ప్రయత్నాన్ని వదల్లేదు. పట్టుదలగా ముందుకు సాగాడు. ఈ విషయంలో కోహ్లి.. సిరాజ్‌కు అండగా నిలిచాడు. అటు ఐపీఎల్‌లో 2018 నుంచి ఆర్సీబీ తరపున, ఇటు టీమ్‌ఇండియా తరపున సిరాజ్‌ను కోహ్లి ప్రోత్సహిస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు కీలక బౌలర్‌గా సిరాజ్‌ మారాడు.

ఈ ఏడాది జోరు..: ఈ ఏడాదిలో సిరాజ్‌ జోరు మామూలుగా లేదు. 2023 ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 19 వికెట్లతో అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతున్నాడు. 2019లో వన్డేల్లో అడుగుపెట్టిన అతను.. ఈ ఏడాది ఇప్పటివరకూ 13 వన్డేల్లో 12.86 సగటుతో 29 వికెట్లు పడగొట్టడం విశేషం. ఓవరాల్‌గా 29 వన్డేల్లో 19.11 సగటుతో 53 వికెట్లు సాధించాడు. బంతుల పరంగా అత్యధిక వేగంగా వన్డేలో 50 వికెట్లు తీసిన తొలి పేసర్‌ సిరాజే. సీనియర్‌ పేసర్‌ షమిని కాదని ప్రపంచకప్‌ నేపథ్యంలో సిరాజ్‌కే ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ గణాంకాలే రుజువు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని వేస్తూ బయటకు, లోపలికి స్వింగ్‌ చేయడంలో సిరాజ్‌ పట్టు సాధించాడు. బ్యాటర్ల కాళ్ల కదలికలను పసిగడుతూ స్టంప్స్‌కు గురిపెడుతూ వికెట్ల వేటలో సాగుతున్నాడు. ఇప్పుడు వన్డేల్లో శ్రీలంకపై అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు. తండ్రి మరణాన్ని విని తన్నుకొస్తున్న దుఃఖాన్ని తట్టుకుని ఆస్ట్రేలియాలో బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌లో జట్టు బౌలింగ్‌ దాడిని కొనసాగించిన అతని ఆత్మస్థైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడదే ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో రాణించి జట్టును విజేతగా నిలపాలనే లక్ష్యంతో సాగుతున్నాడు.

శ్రీలంకతో మ్యాచ్‌లో బౌలింగ్‌లో చెలరేగిన సిరాజ్‌.. ఆట ముగిశాక గొప్ప మనసు చాటుకున్నాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కింద వచ్చిన రూ.4.15 లక్షలను గ్రౌండ్స్‌మెన్‌కు ఇచ్చేశాడు.


1

అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఓవర్లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌ సిరాజ్‌. వన్డేల్లో వాస్‌ (2003), సమి (2003), ఆదిల్‌ రషీద్‌ (2019)ల తర్వాత ఘనత సాధించింది సిరాజే.


6/21

శ్రీలంకపై సిరాజ్‌ గణాంకాలు. అతనికిదే అత్యుత్తమ ప్రదర్శన. ఇది వన్డేల్లో భారత్‌ తరపున నాలుగో అత్యుత్తమ ప్రదర్శన.


129

ఫైనల్లో పడ్డ బంతులు. తక్కువ బంతుల్లో ముగిసిన మూడో పూర్తి స్థాయి వన్డే ఇది. మిగిలిన బంతుల (263) పరంగా వన్డేల్లో భారత్‌కిదే అతిపెద్ద విజయం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని