ODI WC 2023: తేల్చుకోవాలిక..

వన్డే ప్రపంచకప్‌కు ఇంకో రెండు వారాలే సమయం ఉంది. ఇంకా ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుపై కచ్చితంగా ఓ అంచనాకు రాలేని పరిస్థితి! సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న రోహిత్‌ సేన..

Updated : 20 Sep 2023 09:34 IST

క్రికెట్‌ ప్రపంచకప్‌ మరో 15 రోజుల్లో

వన్డే ప్రపంచకప్‌కు ఇంకో రెండు వారాలే సమయం ఉంది. ఇంకా ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుపై కచ్చితంగా ఓ అంచనాకు రాలేని పరిస్థితి! సొంతగడ్డపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న రోహిత్‌ సేన.. వీలైనంత త్వరగా జట్టుపై తేల్చుకోకుంటే అది టోర్నీలో మన అవకాశాలనే దెబ్బ తీసే ప్రమాదముంది.

ఈనాడు క్రీడావిభాగం

ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీల్లో విజేతగా నిలవాలంటే ముందు సరైన జట్టును ఎంచుకోవడం కీలకం. టోర్నీకి కొన్ని నెలల ముందే ప్రపంచకప్‌ ఆడే ఆటగాళ్లపై ఒక అంచనాతో ఉండటం.. కనీసం నెల ముందే జట్టును ప్రకటించి ఆ ఆటగాళ్లతోనే ముందుకు సాగడం అవసరం. అయితే టీమ్‌ఇండియా మాత్రం సొంతగడ్డపై జరిగే మెగా టోర్నీకి జట్టును ఎంపిక చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతూనే వచ్చింది. నెల ముందు జట్టునైతే ప్రకటించారు కానీ.. రెండు స్థానాల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గాయాల నుంచి కోలుకుని ఆసియా కప్‌ జట్టులోకి ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ల విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. వీరిలో కేఎల్‌ రాహల్‌ సూపర్‌-4 దశ నుంచి జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్‌ పరంగా అతడికి ఏ ఇబ్బందులూ కనిపించలేదు. ఫామ్‌ కూడా చాటుకున్నాడు. రాహుల్‌ విషయంలో ఆందోళన తీరిపోయింది.
కానీ టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో తర్వాత సందిగ్ధత తప్పలేదు. వెన్నునొప్పి తిరగబెట్టడంతో అతను టోర్నీలో తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు అతను జట్టులో చోటు సంపాదించినప్పటికీ.. ఫిట్‌నెస్‌ సాధిస్తాడా, తుది జట్టులో ఉంటాడా అన్నది అనుమానంగానే ఉంది. శ్రేయస్‌ ఫామ్‌ చాటుకుని తుది జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకుంటాడని అనుకుంటే.. రెండు మ్యాచ్‌లకే బెంచ్‌ మీదికి వెళ్లిపోవడం అనూహ్యం. ప్రపంచకప్‌కు రెండు వారాల ముందు ఈ స్థితిలో ఉన్న ఆటగాడు ఆ టోర్నీలో ఆడి జట్టుకు ఉపయోగపడతాడని ఎలా ఆశించగలం? శ్రేయస్‌ విషయంలో సందిగ్ధత కొనసాగుతుండగానే.. అక్షర్‌ పటేల్‌ గాయపడ్డాడు. అతను మూడు రకాల గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అవేవీ తీవ్రమైనవి కాకపోయినా.. ప్రపంచకప్‌ ముంగిట అక్షర్‌ ఇలా జట్టుకు దూరం కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో అశ్విన్‌, సుందర్‌ జట్టులోకి వచ్చారు. ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటైన జట్టు ఇంకా జట్టు విషయంలో ఇలా అయోమయంలో ఉండటం శుభ సూచకం కాదు. కనీసం ఆస్ట్రేలియా సిరీస్‌ ముగిసే సమయానికైనా.. మిగతా రెండు స్థానాల విషయంలో స్పష్టత వస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. శ్రేయస్‌, అక్షర్‌ల విషయంలో వీలైనంత త్వరగా స్పష్టత తెచ్చుకుంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తిలక్‌ వర్మ, అశ్విన్‌, సుందర్‌ల ప్రదర్శనను బట్టి వారిలో ఇద్దరికి ప్రపంచకప్‌ జట్టులో అవకాశం కల్పించొచ్చు. ఏదైనా వీలైనంత త్వరగా టీమ్‌ఇండియా ఈ విషయాన్ని తేల్చేయాల్సిన అవసరముంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని