Aryan Dutt: విరాట్‌ భుజాలపై సచిన్‌ను చూసి..

అది 2011 వన్డే ప్రపంచకప్‌.. శ్రీలంక, భారత్‌ ఫైనల్‌. దిల్లీలోని ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఆ ఎనిమిదేళ్ల బాలుడు మ్యాచ్‌ చూస్తున్నాడు.

Published : 19 Oct 2023 08:02 IST

ధర్మశాల

ది 2011 వన్డే ప్రపంచకప్‌.. శ్రీలంక, భారత్‌ ఫైనల్‌. దిల్లీలోని ఇంట్లో టీవీ ముందు కూర్చుని ఆ ఎనిమిదేళ్ల బాలుడు మ్యాచ్‌ చూస్తున్నాడు. ధోని సిక్సర్‌తో జట్టు గెలవడంతో ఆనందంలో మునిగిపోయిన అతను.. క్రికెట్‌ ఆడతానని తండ్రితో చెప్పాడు. అనంతరం విరాట్‌ కోహ్లి భుజాల మీద సచిన్‌ ఊరేగుతుంటే చూసిన ఆ బాలుడు.. వెంటనే బ్యాట్‌ కొనివ్వమని తండ్రిని కోరాడు. ధోని సిక్సర్‌, కోహ్లి భుజాలపై సచిన్‌ను చూసి క్రికెట్‌పై ప్రేమ పెంచుకున్న ఆ బాలుడు ఎవరో కాదు.. ఇప్పుడు నెదర్లాండ్స్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న ఆర్యన్‌ దత్‌.

20 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడు ప్రపంచకప్‌లో ఆడతుండటమే కాకుండా దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ సంచలన విజయంలో తనదైన పాత్ర పోషించాడు. దిల్లీలో క్రికెట్‌ ప్రయాణం మొదలెట్టినా.. వలస వెళ్లిన నెదర్లాండ్స్‌లో అది కొనసాగించడం ఆర్యన్‌కు కష్టంగా మారింది. అతని కుటుంబం ఉండే డెన్‌ హాగ్‌లో క్రికెట్‌కు ఆదరణే లేదు. అందుకే దగ్గరలోని బాస్కెట్‌బాల్‌ కోర్టులో తండ్రి బంతులు విసురుతుంటే ఆర్యన్‌ బ్యాటింగ్‌ చేసేవాడు. కానీ ఒకరోజు మాజీ క్రికెటర్‌ టిమ్‌ డీ లీడ్‌ (బాస్‌ డీ లీడ్‌ తండ్రి) ఆర్యన్‌ను చూసి వూర్‌బర్గ్‌ క్రికెట్‌ క్లబ్‌ అకాడమీకి తీసుకురమ్మని చెప్పాడు. కానీ ఆ దేశంలో మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకే క్రికెట్‌ సీజన్‌ ఉండేది.

దీంతో విక్రమ్‌జీత్‌ (మరో నెదర్లాండ్స్‌ ఆటగాడు)తో కలిసి 2015 నుంచి 2019-20 వరకు ప్రతి ఏడాది ఆరు నెలల పాటు శిక్షణ కోసం ఆర్యన్‌ చండీగఢ్‌కు వచ్చేవాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎత్తు పెరగడంతో ఆర్యన్‌ కోసం కొత్త బూట్లు కొనడం కష్టమయ్యేది. పాత బూట్లతోనే ఆడుతుంటే సరిగ్గా పరుగెత్తలేకపోయాడు. దీంతో తక్కువ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఆఫ్‌స్పిన్‌ వేయడం మొదలెట్టాడు. హర్భజన్‌, అశ్విన్‌, లైయన్‌ వీడియోలు చూసి స్పిన్‌ బౌలింగ్‌ మెరుగుపర్చుకున్నాడు. ధోని, సీఎస్కే జట్టుకు ఆర్యన్‌ వీరాభిమాని. మరోవైపు ఆర్యన్‌కు బౌలింగ్‌ కోచ్‌ తండ్రి రాకేష్‌ కావడం విశేషం. మంచి హిట్టర్‌ కూడా అయిన ఆర్యన్‌.. రబాడ, ఎంగిడి, కోయెట్జీ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టాడు.

కిర్‌స్టన్‌ బాటలో: దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ విజయం వెనుక మైదానంలోని ఆటగాళ్ల కష్టం ఎంత ఉందో బయట కోచ్‌ కృషి కూడా అంతే ఉంది. టీమ్‌ఇండియాకు 2011లో ప్రపంచకప్‌ అందించిన కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ బాటలో సాగుతూ నెదర్లాండ్స్‌ను సంచలన విజయాల దిశగా నడిపిస్తున్నాడు ర్యాన్‌ కుక్‌. 2022లో ర్యాన్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లాండ్‌ దాదాపు 500 (498/4) పరుగులు చేసింది. కానీ ఆ దెబ్బ నుంచి కోలుకుని, కిర్‌స్టన్‌ లాగే వ్యూహాలను అమలు చేస్తూ నెదర్లాండ్స్‌ను బలంగా మారుస్తున్నాడు. నిరుడు టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే, దక్షిణాఫ్రికాలపై విజయాలు, అనంతరం వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో ఉత్కంఠ మ్యాచ్‌లో విండీస్‌పై గెలుపు, ఇప్పుడు ప్రపంచకప్‌లో సఫారీ సేనపై పైచేయి. ర్యాన్‌ 2013లో దక్షిణాఫ్రికా అండర్‌-19 కోచ్‌గా భారత్‌కు వచ్చాడు. అప్పుడు ఇక్కడి పరిస్థితులపై అవగాహన కోసం కిర్‌స్టన్‌ సాయం తీసుకున్నాడు. కేప్‌టౌన్‌లోని కిర్‌స్టన్‌ అకాడమీలో అతనితో కలిసి ర్యాన్‌ పనిచేశాడు. ఇప్పుడు జట్టులోని ఆటగాళ్లను సానబెడుతూ అత్యుత్తమ ప్రదర్శన రాబడుతున్నాడు. నెదర్లాండ్స్‌ జట్టును అందరూ పసికూన అంటున్నారని, కానీ పెద్ద జట్లతో తలపడే క్రికెట్‌ దేశంగా భావిస్తూ ఈ ప్రపంచకప్‌లో మూణ్నాలుగు విజయాలు సాధించడమే తమ లక్ష్యమని ర్యాన్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని