Australia vs New Zealand: అద్భుతానికి.. 6 పరుగుల దూరంలో..

388.. వన్డేలో ఇంతటి స్కోరు సాధించిన ఏ జట్టుకైనా ఓటమి భయం పట్టుకుంటుందా? ఆస్ట్రేలియాకు ఆ పరిస్థితే ఎదురైంది. కొండంత స్కోరు చేసినా.. కంగారూ జట్టుకు కంగారు తప్పలేదు. అసాధ్యాన్ని అందుకునేందుకు..

Updated : 29 Oct 2023 08:41 IST

ఆస్ట్రేలియా 388
న్యూజిలాండ్‌ 383/9
పోరాడి ఓడిన న్యూజిలాండ్‌
హెడ్‌ సెంచరీ
రచిన్‌ శతకం వృథా

388.. వన్డేలో ఇంతటి స్కోరు సాధించిన ఏ జట్టుకైనా ఓటమి భయం పట్టుకుంటుందా? ఆస్ట్రేలియాకు ఆ పరిస్థితే ఎదురైంది. కొండంత స్కోరు చేసినా.. కంగారూ జట్టుకు కంగారు తప్పలేదు. అసాధ్యాన్ని అందుకునేందుకు.. అసామాన్య పట్టుదలతో పోరాడిన న్యూజిలాండ్‌ విజయానికి ఒక్క సిక్సర్‌ దూరంలో ఆగిపోయింది. సంచలనాలకు వేదికగా మారిన ప్రపంచకప్‌లో.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన రసవత్తర పోరులో చివరకు ఆసీస్‌దే పైచేయి. సెంచరీ వీరుడు రచిన్‌ రవీంద్రతో పాటు మిచెల్‌, నీషమ్‌ గొప్పగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. అంతకుముందు హెడ్‌, వార్నర్‌ మెరుపులతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది.

ధర్మశాల

ఆస్ట్రేలియా బతికిపోయింది. శనివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచింది. ప్రపంచకప్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ట్రావిస్‌ హెడ్‌ (109; 67 బంతుల్లో 10×4, 7×6)తో పాటు వార్నర్‌ (81; 65 బంతుల్లో 5×4, 6×6) రాణించడంతో మొదట ఆసీస్‌ భారీ స్కోరు చేసింది. 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ బౌలర్లలో ఫిలిప్స్‌ (3/37), బౌల్ట్‌ (3/77) రాణించారు. ఛేదనలో అద్భుతంగా పోరాడిన న్యూజిలాండ్‌ 9 వికెట్లకు 383 పరుగులు చేసింది. రచిన్‌ రవీంద్ర (116; 89 బంతుల్లో 9×4, 5×6) వీరోచిత శతకంతో కివీస్‌ను రేసులో నిలపగా.. ఆఖర్లో నీషమ్‌ (58; 39 బంతుల్లో 3×4, 3×6) ఆసీస్‌ను వణికించాడు. జంపా (3/74), కమిన్స్‌ (2/66), హేజిల్‌వుడ్‌ (2/70) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హెడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఆసీస్‌ వరుసగా నాలుగో విజయం సాధించగా.. కివీస్‌ వరుసగా రెండో మ్యాచ్‌ ఓడింది.

చేరువగా వచ్చి..: భారీ ఛేదనలో జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చిన ఓపెనర్లు కాన్వే (28), యంగ్‌ (32).. స్వల్ప వ్యవధిలో హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఈ దశలో మిచెల్‌ (54)తో కలిసి రచిన్‌ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. 14వ ఓవర్లో ఆ జట్టు వంద పరుగులను అందుకుంది. తొలి 29 బంతుల్లో 20 పరుగులే చేసిన రచిన్‌ క్రమంగా జోరందుకున్నాడు. కానీ డరైల్‌తో పాటు లేథమ్‌ (21)ను ఔట్‌ చేసి జంపా దెబ్బకొట్టాడు. మరో ఎండ్‌లో రచిన్‌ జోరు కొనసాగించాడు. 49 బంతుల్లో 50 పరుగులు చేసిన అతను.. మరో 28 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేరుకున్నాడు.  ఫిలిప్స్‌ (12) నిలబడలేకపోయినా.. రచిన్‌కు నీషమ్‌ జత కలవడంతో 40 ఓవర్లకు 292/5తో కివీస్‌ నిలిచింది. ఆ జట్టు విజయానికి చివరి 10 ఓవర్లలో 97 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ తర్వాతి ఓవర్లోనే ఓ స్లో ఆఫ్‌ కట్టర్‌తో రచిన్‌ను కమిన్స్‌ బోల్తా కొట్టించడంతో ఆసీస్‌ పైచేయి సాధించినట్లే కనిపించింది. అయితే నీషమ్‌ వదల్లేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత బ్యాటింగ్‌తో సాగాడు. కానీ మరో ఎండ్‌లో వికెట్లు పడటం దెబ్బతీసింది. శాంట్నర్‌ (17), హెన్రీ (9) ఔటైపోయారు. చివరి 3 ఓవర్లలో కివీస్‌కు 43 పరుగులు కావాల్సి వచ్చింది. స్టార్క్‌ బౌలింగ్‌లో నీషమ్‌, హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌ బౌల్ట్‌ (10 నాటౌట్‌) చెరో సిక్సర్‌ కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి మొత్తం 24 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమయ్యాయి. స్టార్క్‌ వేసిన రెండో బంతికి వైడ్‌, ఫోర్‌తో 5 పరుగులు రావడంతో సమీకరణం 5 బంతుల్లో 13గా మారింది. తర్వాతి 3 బంతుల్లో ఆరు పరుగులే వచ్చాయి. మ్యాక్స్‌వెల్‌, లబుషేన్‌ అద్భుత ఫీల్డింగ్‌తో బౌండరీలు ఆపారు. అయిదో బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించిన నీషమ్‌ రనౌట్‌ కావడంతో కివీస్‌ ఆశలు ఆవిరయ్యాయి.కివీస్‌ గెలవాలంటే చివరి బంతికి సిక్సర్‌ అవసరమవగా ఫెర్గూసన్‌ సింగిలూ తీయలేకపోయాడు.

ఓపెనర్లు అదుర్స్‌: టాస్‌ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కివీస్‌ చింతించేలా.. బౌండరీలతో మైదానం హోరెత్తేలా మొదట హెడ్‌, వార్నర్‌ జోడీ చెలరేగిపోయింది. తొలి వికెట్‌కు 19.1 ఓవర్లలోనే 175 పరుగులు జోడించింది. వీళ్ల దూకుడు చూస్తే ఆసీస్‌ 400 పైచిలుకు పరుగులు చేస్తుందనిపించింది. కానీ మిడిలార్డర్‌ తడబడింది. చివర్లో మళ్లీ మ్యాక్స్‌వెల్‌, ఇంగ్లిస్‌, కమిన్స్‌ మెరుపులతో జట్టు 400కు చేరువగా వెళ్లింది. గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన హెడ్‌ కసి తీరా కొట్టాడు. మార్ష్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చి.. వార్నర్‌తో కలిసి ఊచకోత కోశాడు. వార్నర్‌ కూడా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయాడు.మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన తర్వాత పిక్క గాయంతో ఫెర్గూసన్‌ మైదానం వీడడం కివీస్‌ను దెబ్బకొట్టింది. ఫీల్డింగ్‌లో ఆ జట్టు అయిదు క్యాచ్‌లు చేజార్చింది. ఓపెనర్ల జోరుతో 8.5 ఓవర్లలోనే ఆసీస్‌ 100 పరుగులు పూర్తిచేసుకుంది. వార్నర్‌ 28 బంతుల్లో, హెడ్‌ 25 బంతుల్లో అర్ధశతకాలు చేరుకున్నారు. వార్నర్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చిన ఫిలిప్స్‌ ఈ జోడీని విడగొట్టాడు.  శతకం అందుకున్నాక హెడ్‌నూ ఫిలిప్స్‌ ఔట్‌ చేశాడు. ఇక్కడి నుంచి ఆసీస్‌ తడబడింది. మార్ష్‌ (36) స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. స్మిత్‌ (18), లబుషేన్‌ (18) విఫలమయ్యారు. 74 పరుగుల వ్యవధిలో ఆసీస్‌ 4 వికెట్లు కోల్పోయింది. అయితే మ్యాక్స్‌వెల్‌ (41; 24 బంతుల్లో 5×4, 2×6), కమిన్స్‌ (37; 14 బంతుల్లో 2×4, 4×6), ఇంగ్లిస్‌ (38) చెలరేగి ఆడి స్కోరును 380 దాటించారు.

ఆస్ట్రేలియా: వార్నర్‌ (సి) అండ్‌ (బి) ఫిలిప్స్‌ 81; హెడ్‌ (బి) ఫిలిప్స్‌ 109; మార్ష్‌ (బి) శాంట్నర్‌ 36; స్మిత్‌ (సి) బౌల్ట్‌ (బి) ఫిలిప్స్‌ 18; లబుషేన్‌ (సి) రచిన్‌ (బి) శాంట్నర్‌ 18; మ్యాక్స్‌వెల్‌ (సి) బౌల్ట్‌ (బి) నీషమ్‌ 41; ఇంగ్లిస్‌ (సి) ఫిలిప్స్‌ (బి) బౌల్ట్‌ 38; కమిన్స్‌ ఎల్బీ (బి) బౌల్ట్‌ 37; స్టార్క్‌ (సి) నీషమ్‌ (బి) హెన్రీ 1; జంపా (బి) బౌల్ట్‌ 0; హేజిల్‌వుడ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (49.2 ఓవర్లలో ఆలౌట్‌) 388; వికెట్ల పతనం: 1-175, 2-200, 3-228, 4-264, 5-274, 6-325, 7-387, 8-388, 9-388; బౌలింగ్‌: హెన్రీ 6.2-0-67-1; బౌల్ట్‌ 10-0-77-3; ఫెర్గూసన్‌ 3-0-38-0; శాంట్నర్‌ 10-0-80-2; ఫిలిప్స్‌ 10-0-37-3; రచిన్‌ 8-0-56-0; నీషమ్‌ 2-0-32-1

న్యూజిలాండ్‌: కాన్వే (సి) స్టార్క్‌ (బి) హేజిల్‌వుడ్‌ 28; యంగ్‌ (సి) స్టార్క్‌ (బి) హేజిల్‌వుడ్‌ 32; రచిన్‌ (సి) లబుషేన్‌ (బి) కమిన్స్‌ 116; మిచెల్‌ (సి) స్టార్క్‌ (బి) జంపా 54; లేథమ్‌ (సి) హేజిల్‌వుడ్‌ (బి) జంపా 21; ఫిలిప్స్‌ (సి) లబుషేన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 12; నీషమ్‌ రనౌట్‌ 58; శాంట్నర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) జంపా 17; హెన్రీ (సి) హేజిల్‌వుడ్‌ (బి) కమిన్స్‌ 9; బౌల్ట్‌ నాటౌట్‌ 10; ఫెర్గూసన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 383; వికెట్ల పతనం: 1-61, 2-72, 3-168, 4-222, 5-265, 6-293, 7-320, 8-346, 9-383; బౌలింగ్‌: స్టార్క్‌ 9-0-89-0; హేజిల్‌వుడ్‌ 9-0-70-2; కమిన్స్‌ 10-0-66-2; మ్యాక్స్‌వెల్‌ 10-0-62-1; జంపా 10-0-74-3; మార్ష్‌ 2-0-18-0


59

హెడ్‌ సెంచరీకి తీసుకున్న బంతులు. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగంగా శతకం సాధించిన ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ (2023లో అఫ్గానిస్థాన్‌పై 63 బంతుల్లో) రికార్డును హెడ్‌ బద్దలుకొట్టాడు.


771

ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి చేసిన పరుగులు. ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే.


104 మీటర్లు

కివీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ కొట్టిన ఓ సిక్సర్‌ ప్రయాణించిన దూరం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఇదే భారీ సిక్సర్‌. శాంట్నర్‌ బౌలింగ్‌లో మ్యాక్సీ కొట్టిన సిక్సర్‌ స్టేడియం పైకప్పు మీద పడింది.


1

పురుషుల వన్డేల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 350కి పైగా పరుగులు చేసిన తొలి జట్టుగా ఆసీస్‌ నిలిచింది. పాకిస్థాన్‌పై 367 పరుగులు చేసిన ఆ జట్టు.. నెదర్లాండ్స్‌పై 399 స్కోరు సాధించింది.


2

ఓ వన్డేలో ఇద్దరు ఓపెనర్లు 30 బంతుల్లోపే అర్ధశతకాలు పూర్తి చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ 28, హెడ్‌ 25 బంతుల్లో 50 పరుగుల చొప్పున చేశారు. ఈ ఏడాది భారత్‌తో విశాఖ వన్డేలో హెడ్‌, మార్ష్‌ తొలిసారి ఈ ఘనత అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు