AFG vs AUS: కలయా మ్యాక్సీ మాయా

వాళ్లు అంతర్జాతీయ బౌలర్లా.. అప్పుడే ఆట మొదలెట్టిన స్కూల్‌ పిల్లలా! మ్యాక్స్‌వెల్‌ ఆకాశమే హద్దుగా.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుంటే కలిగిన భావాలివి!

Updated : 08 Nov 2023 06:57 IST

 అఫ్గానిస్థాన్‌పై ఆసీస్‌ అద్భుత విజయం
ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ప్రవేశం
మ్యాక్స్‌వెల్‌ అజేయ డబుల్‌ సెంచరీ

అది బ్యాటా.. మంత్ర దండమా!
అది బ్యాటింగా.. బంతిపై ఆజన్మ శత్రుత్వమా!

వాళ్లు అంతర్జాతీయ బౌలర్లా.. అప్పుడే ఆట మొదలెట్టిన స్కూల్‌ పిల్లలా!

మ్యాక్స్‌వెల్‌ ఆకాశమే హద్దుగా.. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుంటే కలిగిన భావాలివి! పరుగు తీయడం పక్కన పెడితే.. కనీసం క్రీజులో స్వేచ్ఛగా కదలడమే కష్టంగా ఉన్న స్థితిలో, బాధను పంటికింద బిగపడుతూ అతడు చేసిన విధ్వంసక విన్యాసాలు నభుతో. అఫ్గాన్‌ బౌలర్లపై కనీస కనికరం చూపని మ్యాక్స్‌వెల్‌.. ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఫీల్డర్లకు పనిలేకుండా చేశాడు. సిక్స్‌లే సిక్స్‌లు... ఫోర్లే ఫోర్లు. ఆహా.. ఆ ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి మాటలు చాలవు.

292 పరుగుల ఛేదనలో 91కే 7 వికెట్లు చేజారి, ఆసీస్‌ ఆటగాళ్లు కూడా ఆశలు వదులుకున్న వేళ.. ఆ జట్టు ఓటమి లాంఛనమేనని క్రికెట్‌ ప్రపంచం తీర్మానించిన తరుణాన మ్యాక్స్‌వెల్‌ నిజంగా అద్భుతమే చేశాడు. ఓ దశలో దాదాపు ఒంటికాలినే ఆసారాగా చేసుకుంటూ చెలరేగిపోయిన అతడు ఒంటిచేత్తో కంగారూలను ఓటమి అంచుల్లో నుంచి లాగేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. వన్డే క్రికెట్లో ఛేదనలో డబుల్‌ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్‌ రికార్డు సృష్టించడంతో అఫ్గాన్‌ను ఓడించి ఆసీస్‌.. ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

పాపం.. అఫ్గాన్‌! ఓ క్యాచ్‌ విలువెంత అంటే.. బహుశా ఇప్పుడు ఆ జట్టు కంటే మంచి సమాధానమిచ్చే జట్టు ఇంకోటుండదేమో! వ్యక్తిగత స్కోరు 31 పరుగుల మీదున్నప్పుడు మ్యాక్స్‌వెల్‌ లడ్డూలా చేతిలోకి ఇచ్చిన క్యాచ్‌ను ముజీబ్‌ నేలపాలు చేసినప్పుడు.అతడికి ఆయుధాన్నిచ్చి ఊచకోతకు ఉసికొల్పామని అఫ్గానిస్థాన్‌ ఊహించి ఉండదు!

ముంబయి

ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ప్రవేశించింది. అద్బుతంగా పోరాడిన మ్యాక్స్‌వెల్‌ క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయే డబుల్‌ సెంచరీ సాధించిన వేళ ఆసీస్‌ మంగళవారం 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్‌ (129 నాటౌట్‌; 143 బంతుల్లో 8×4, 3×6) సెంచరీ కొట్టడంతో మొదట అఫ్గానిస్థాన్‌ 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (201 నాటౌట్‌; 128 బంతుల్లో 21×4, 10×6) నిర్దాక్షిణ్యంగా చెలరేగడంతో లక్ష్యాన్ని ఆసీస్‌ 46.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 91కే ఏడు వికెట్లు పడగొట్టి అలవోకగా మ్యాచ్‌ గెలిచేలా కనిపించిన అఫ్గాన్‌కు తీవ్ర నిరాశ తప్పలేదు.

మ్యాక్స్‌ కోత: వారెవ్వా మ్యాక్స్‌వెల్‌. ఓటమి తథ్యం అన్న స్థితి నుంచి అతడు ఆస్ట్రేలియాను లాక్కొచ్చి, గెలిపించిన తీరు అద్భుతం, అపూర్వం. ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ అది. 292 పరుగుల ఛేదనలో 91కే 7 వికెట్లు కోల్పోయిన జట్టు విజయం సాధిస్తుందని ఎవరూ కలలో కూడా అనుకోరేమో. కానీ మ్యాక్సీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆస్ట్రేలియా ఛేదన ఆరంభమైన తీరు ఘోరం. అఫ్గాన్‌ పేస్‌ బౌలింగ్‌కు బెంబేలెత్తిపోయింది. నవీనుల్‌, అజ్మతుల్లా ధాటికి హెడ్‌ (0), మార్ష్‌ (24), వార్నర్‌ (18), ఇంగ్లిస్‌ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. 49కే నాలుగు. ఆపై లబుషేన్‌ (14) రనౌట్‌ కాగా.. స్టాయినిస్‌ (6), స్టార్క్‌ (3)లను రషీద్‌ ఖాన్‌ వెనక్కి పంపడంతో ఆసీస్‌ ఓటమి ముంగిట నిలిచింది. బౌలర్ల జోరుతో అఫ్గాన్‌ మరో సంచలనం సృష్టించడం లాంఛనమే అనుకున్నారంతా! మ్యాక్స్‌వెల్‌ మాయ చేయబోతున్నాడని ఒక్కరూ ఊహించలేదు. అదృష్టమూ అతడి పక్షాన నిలిచింది. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో ముజీబ్‌ తేలికైన క్యాచ్‌ను వదిలేయడంతో మ్యాక్స్‌వెల్‌ బతికిపోయాడు. లేదంటే ఎప్పుడో కంగారూల కథ ముగిసేదే. అవకాశాన్ని రెండు చేతులా అందింపుచుకున్న మ్యాక్స్‌వెల్‌.. ఒత్తిడిని అధిగమిస్తూ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. అడపాదడపా బౌండరీలు బాదుతూ 51 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు.. ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. మరో 25 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కమిన్స్‌ (12 నాటౌట్‌; 68 బంతుల్లో 1×4) క్రీజులో ఉంటే చాలన్నట్లుగా ఆడాడు. ఎప్పుడో ఒక సింగిల్‌ తీసినా.. మ్యాక్స్‌వెల్‌కు అతడిచ్చిన సహకారం అద్భుతం. అతడు పరుగులు చేయకపోయినా.. మ్యాక్స్‌వెల్‌ అదిరే విన్యాసాలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 35వ ఓవర్లో ఆసీస్‌ 200కు చేరుకుంది. ఓ వైపు కండరాలు పట్టేయడంతో ఇబ్బందిగా ఉన్నా మ్యాక్స్‌వెల్‌ జోరు మాత్రం తగ్గలేదు. మరింత నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆఫ్గాన్‌ బౌలింగ్‌ను బడి పిల్లల బౌలింగ్‌ను ఎదుర్కొన్నట్లు ఎదుర్కొన్నాడు. అలవోకగా సిక్స్‌లు, ఫోర్లు. 104 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. నొప్పితో విలవిల్లాడుతున్నా, అడుగేయడమే కష్టంగా ఉన్నా.. మ్యాక్స్‌వెల్‌ మరింతగా చెలరేగాడే తప్ప తగ్గలేదు. చాలా సార్లు సింగిల్స్‌ తీయలేదు కూడా. బంతులకు చుక్కలు చూపిస్తూ, ఆఫ్గాన్‌ ఆటగాళ్లను తీవ్ర నైరాశ్యంలో ముంచెత్తుతూ విధ్వంసాన్ని కొనసాగించాడు. సిక్స్‌లు, ఫోర్లు కొట్టడం ఇంత తేలికా అన్నట్లు ఆడాడతడు. చివరికి 47వ ఓవర్లో ముజీబ్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 4, 6తో క్రికెట్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చడమే కాదు..  డబుల్‌ సెంచరీ కూడా పూర్తి చేశాడు. కంగారూల సంబరాలకు అంతే లేదు. కమిన్స్‌ తాను ఎదుర్కొన్న చివరి 22 బంతుల్లో ఒక్క పరుగూ చేయకపోవడం గమనార్హం. అంటే 213 తర్వాత ఎక్స్‌ట్రాలు కాకుండా... ఆసీస్‌ పరుగులన్నీ మ్యాక్స్‌వెల్‌ బ్యాట్‌ నుంచి వచ్చినవే అన్నమాట. అతడు 150 నుంచి డబుల్‌ సెంచరీకి 24 బంతులే ఆడడం విశేషం.

ఇబ్రహీం అదుర్స్‌: మొదట అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ ఆటే అదుర్స్‌. ఆఖరి వరకు క్రీజులో ఉన్న అతడు విలువైన భాగస్వామ్యాలతో జట్టు మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్గాన్‌ ఎనిమిదో ఓవర్లో, జట్టు స్కోరు 38 వద్ద గుర్బాజ్‌ (21) ఔట్‌ కావడంతో తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన ఇబ్రహీం.. రహ్మత్‌ షా (30)తో రెండో వికెట్‌కు 83,  హష్మతుల్లా (26)తో మూడో వికెట్‌కు 52, అజ్మతుల్లా (22)తో నాలుగో వికెట్‌కు 37, నబి (12)తో అయిదో వికెట్‌కు 23 పరుగులు జోడించాడు. రషీద్‌ ఖాన్‌ (35 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 3×6) రావడంతో ఆఖర్లో పరుగుల వరద పారింది. చివరి నాలుగు ఓవర్లలో అఫ్గాన్‌ ఏకంగా 55 పరుగులు రాబట్టింది.
ఆఖరి బెర్తు ఎవరిదో?

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీస్‌ చేరడంతో మూడు నాకౌట్‌ బెర్తులు తేలిపోయాయి. చివరి బెర్తు కోసం న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ ముడూ జట్లూ 8 చొప్పున మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి. తమ చివరి మ్యాచ్‌లో ఫలితం,  నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా వీటిలో ఓ జట్టు ముందంజ వేస్తుంది.
అఫ్గానిస్థాన్‌: గుర్బాజ్‌ (సి) స్టార్క్‌ (బి) హేజిల్‌వుడ్‌ 21; ఇబ్రహీం జద్రాన్‌ నాటౌట్‌ 129; రహ్మత్‌ షా (సి) హేజిల్‌వుడ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 30; హష్మతుల్లా (బి) స్టార్క్‌ 26; అజ్మతుల్లా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) జంపా 22; నబి (బి) హేజిల్‌వుడ్‌ 12; రషీద్‌ ఖాన్‌ నాటౌట్‌ 35; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291; వికెట్ల పతనం: 1-38, 2-121, 3-173, 4-210, 5-233; బౌలింగ్‌: స్టార్క్‌ 9-0-70-1; హేజిల్‌వుడ్‌ 9-0-39-2; మ్యాక్స్‌వెల్‌ 10-0-55-1; కమిన్స్‌ 8-0-47-0; జంపా 10-0-58-1; హెడ్‌ 3-0-15-0; స్టాయినిస్‌ 1-0-2-0

ఆస్ట్రేలియా: వార్నర్‌ (బి) ఒమర్‌ 18; హెడ్‌ (సి) ఇక్రమ్‌ (బి) నవీనుల్‌ 0; మార్ష్‌ ఎల్బీ (బి) నవీనుల్‌ 24; లబుషేన్‌ రనౌట్‌ 14; ఇంగ్లిస్‌ (సి) ఇబ్రహీం (బి) ఒమర్‌ 0; మ్యాక్స్‌వెల్‌ నాటౌట్‌ 201; స్టాయినిస్‌ ఎల్బీ (బి) రషీద్‌ 6; స్టార్క్‌ (సి) ఇక్రమ్‌ (బి) రషీద్‌ 3; కమిన్స్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293; వికెట్ల పతనం: 1-4, 2-43, 3-49, 4-49, 5-69, 6-87, 7-91; బౌలింగ్‌: ముజీబ్‌ 8.5-1-72-0; నవీనుల్‌ 9-0-47-2; ఒమర్‌  7-1-52-2; రషీద్‌ 10-0-44-2; నూర్‌ 10-1-53-0; నబి 2-0-20-0


3

వన్డే ప్రపంచకప్‌లో ఇది మూడో ద్విశతకం. క్రిస్‌ గేల్‌ (215), మార్టిన్‌ గప్తిల్‌ (237 నాటౌట్‌) అతడికన్నా ముందున్నారు.


‘‘ఇది ఒక్క అవకాశం కూడా ఇవ్వని ఇన్నింగ్స్‌ అయి ఉంటే ఇంకా బాగుండేది. బ్యాటింగ్‌ చేసిన తీరు పట్ల గర్విస్తున్నా. ఈరోజు నాది. వికెట్లు పడినా కమిన్స్‌తో కలిసి చివరిదాకా పోరాడాలనుకుని ముందుకు సాగా. విపరీతమైన వేడి వాతావరణంలో సుదీర్ఘంగా క్రీజులో ఉండడంతో కాళ్లు పట్టేశాయి’’
 మ్యాక్స్‌వెల్‌


202

మ్యాక్స్‌వెల్‌-కమిన్స్‌ భాగస్వామ్యం. వన్డేల్లో ఎనిమిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.


201

మ్యాక్స్‌వెల్‌ స్కోరు. ప్రపంచకప్‌లో మాత్రమే కాదు వన్డే చరిత్రలోనే ఛేదనలో ఒక బ్యాటర్‌ చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఫకార్‌ జమాన్‌ (193; దక్షిణాఫ్రికాతో)ను అధిగమించాడు. వన్డేల్లో ఆరో నంబర్‌ బ్యాటర్‌కు ఇదే అత్యధిక స్కోరు. కపిల్‌దేవ్‌ (175) రికార్డు బద్దలైంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు