IND vs AUS: ముగింపు అదిరింది

ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్‌పై మొదట భారత్‌ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది.

Updated : 04 Dec 2023 07:23 IST

160 పరుగులను కాపాడుకున్న భారత్‌
4-1తో సిరీస్‌ భారత్‌ వశం
మెరిసిన అక్షర్‌, ముకేశ్‌, అర్ష్‌దీప్‌
ఆఖరి టీ20లో ఆసీస్‌ ఓటమి

టీమ్‌ఇండియా అదుర్స్‌.ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ కంగారూలతో పొట్టి పోరును ఘనంగా ముగించింది. తక్కువ స్కోరే చేసినా, బౌలర్లు సమష్టిగా రాణించిన వేళ.. ఆసక్తికర ఆఖరి మ్యాచ్‌లో గెలిచి భారత్‌ 4-1తో టీ20 సిరీస్‌ను చేజిక్కించుకుంది. బ్యాటుతో శ్రేయస్‌ రాణిస్తే.. అక్షర్‌, బిష్ణోయ్‌, ముకేశ్‌, అర్ష్‌దీప్‌ గొప్పగా బౌలింగ్‌ చేశారు. ఆఖరి ఓవర్లో పది పరుగులు చేయాల్సిన ఆస్ట్రేలియాను అర్ష్‌దీప్‌ అడ్డుకున్న తీరు అద్భుతం.

బెంగళూరు : ఆస్ట్రేలియాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ఆదివారం అయిదో మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మందకొడి పిచ్‌పై మొదట భారత్‌ 8 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. శ్రేయస్‌ అయ్యర్‌ (53; 37 బంతుల్లో 5×4, 2×6) టాప్‌ స్కోరర్‌. అక్షర్‌ పటేల్‌ (31; 21 బంతుల్లో 2×4, 1×6) రాణించాడు. డ్వార్షిస్‌ (2/30), బెరెండార్ఫ్‌ (2/38), తన్వీర్‌ సంఘా (1/26) భారత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో ఆస్ట్రేలియా 8 వికెట్లకు 154 పరుగులే చేయగలిగింది. మెక్‌డెర్మట్‌ (54; 36 బంతుల్లో 5×6) టాప్‌ స్కోరర్‌. ముకేశ్‌ కుమార్‌ (3/32), రవి బిష్ణోయ్‌ (2/29), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/40), అక్షర్‌ పటేల్‌ (1/14) చక్కని బౌలింగ్‌తో ఆసీస్‌ను దెబ్బతీశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అక్షర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. బిష్ణోయ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

బౌలర్లు సమష్టిగా..: నిర్దేశించిన లక్ష్యం చిన్నదే అయినా.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో టీమ్‌ఇండియా పైచేయి సాధించింది. స్పిన్నర్లు మరోసారి అద్భుతంగా రాణించగా.. పేసర్లూ ఆకట్టుకున్నారు. అయితే ఛేదన ఆరంభంలో ఆసీస్‌ బాగానే ఉంది. ఫిలిప్‌ (4)ను బౌల్డ్‌ చేయడం ద్వారా ఆసీస్‌ పతనాన్ని ముకేశ్‌ త్వరగానే ఆరంభించినా..  మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (28; 18 బంతుల్లో 5×4, 1×6) అలవాటైన రీతిలో ధాటిగా ఆడడంతో ఆసీస్‌ అయిదో ఓవర్లో 47/1తో నిలిచింది. కానీ బిష్ణోయ్‌ వరుస ఓవర్లలో హెడ్‌, హార్డీ (6)లను ఔట్‌ చేసి భారత్‌లో ఉత్సాహం నింపాడు. ఆ దశలో మెక్‌డెర్మట్‌ నిలబడి ఆసీస్‌ను నడిపించాడు. కానీ బ్యాట్‌ ఝుళిపించలేకపోయాడు. అక్షర్‌, బిష్ణోయ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు అంత తేలిగ్గా రాలేదు. టిమ్‌ డేవిడ్‌ (17) కూడా ధాటిగా ఆడలేకపోయాడు. 8 నుంచి 10 ఓవర్ల మధ్య ఆసీస్‌కు 15 పరుగులే వచ్చాయి. కానీ ఆ తర్వాత బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మెక్‌డెర్మట్‌ ఒక్కో సిక్స్‌ దంచాడు. అయితే ఎట్టకేలకు ఓ సిక్స్‌తో గాడినపడ్డట్లు కనిపించిన డేవిడ్‌ను 14వ ఓవర్లో అక్షర్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 102. చివరి ఆరు ఓవర్లలో ఆసీస్‌కు 57 పరుగులు అవసరమయ్యాయి. 15వ ఓవర్లో అర్ష్‌దీప్‌ 12 పరుగులిచ్చినా.. మెక్‌డెర్మట్‌ను ఔట్‌ చేశాడు.

ఆ మలుపు.. ఆ ఓవర్‌..: 24 బంతుల్లో 37 పరుగులు.. 17వ ఓవర్‌ ఆరంభానికి ముందు ఆసీస్‌ లక్ష్యమిది. క్రీజులో వేడ్‌, షార్ట్‌ (16) ఉన్నారు. ఇంకో 5 వికెట్లు ఉండటంతో ఆసీస్‌ సులభంగానే గెలుస్తుందనిపించింది. అయితే.. ముకేశ్‌ వరుస బంతుల్లో షార్ట్‌, డ్వార్షిస్‌ను ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. 18వ ఓవర్లో అవేశ్‌ ఖాన్‌ 15 పరుగులు సమర్పించుకున్నా.. మరోసారి ముకేశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 19వ ఓవర్లో 7 పరుగులే ఇచ్చి ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు. ఇక ఆఖరి ఓవర్లో ఆసీస్‌కు 10 పరుగులు అవసరమయ్యాయి. వేడ్‌ (22) క్రీజులో ఉండడంతో ఆ జట్టుకు మంచి అవకాశాలే ఉన్నాయి. కానీ అర్ష్‌దీప్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కంగారూలను కట్టిపడేశాడు. తొలి రెండు బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వని అతడు.. మూడో బంతికి వేడ్‌ను ఔట్‌ చేసి భారత శిబిరాన్ని సంతోషంలో ముంచెత్తాడు. మిగతా మూడు బంతుల్లో మరో మూడు సింగిల్సే ఇచ్చి ఆసీస్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.

రాణించిన శ్రేయస్‌: అంతకుముందు టీమ్‌ఇండియా బ్యాటుతో తడబడింది. ఏ దశలోనూ ఇన్నింగ్స్‌ పెద్దగా జోరందుకోలేదు. భారత్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్‌ నిలబడడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మందకొడి పిచ్‌పై  స్పిన్నర్‌ తన్వీర్‌ సంఘా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. పేసర్‌ హార్డీ కూడా బ్యాటర్లను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి ఆరంభం దక్కలేదు. రుతురాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన యశస్వి జైస్వాల్‌ (21) బ్యాట్‌ ఝుళిపించడానికి కొంత సమయం తీసుకున్నాడు. మూడో ఓవర్లో హార్డీ బౌలింగ్‌లో సిక్స్‌తో గేర్‌ మార్చిన అతడు.. బెరెండార్ఫ్‌ బౌలింగ్‌లో మరో సిక్స్‌ కొట్టాడు. కానీ అతడి జోరు ఎంతోసేపు సాగలేదు. బెరెండార్ఫ్‌ బౌలింగ్‌లోనే ఎలిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 33. ఆ తర్వాత భారత్‌ చకచకా మరో మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. డ్వార్షిస్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ (10).. బెరెండార్ఫ్‌కు చిక్కాడు. సూర్య (5) వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల డ్వార్షిస్‌ షార్ట్‌ లెంగ్త్‌ బంతిని నేరుగా పాయింట్లో మెక్‌డెర్మట్‌ చేతుల్లోకి కట్‌ చేశాడు. ఫామ్‌లో ఉన్న రింకు సింగ్‌ (6) కూడా త్వరగా పెవిలియన్‌ బాట పట్టాడు. అతడు పదో ఓవర్లో సంఘా బౌలింగ్‌లో డేవిడ్‌కు తేలికైన క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌ 55/4తో నిలిచింది. కానీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (24; 16 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్‌ ఝుళిపించాడు. శ్రేయస్‌ కూడా డ్వార్షిస్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదడంతో స్కోరు వేగం పెరిగింది. 13 ఓవర్లలో 97/4తో నిలిచింది భారత్‌. కానీ ఊపు మీదున్న దశలో జితేశ్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షర్‌తో కలిసి శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కానీ 14 నుంచి 17 ఓవర్ల మధ్య 18 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఎలిస్‌ బౌలింగ్‌లో ఓ ఫోర్‌, బెరెండార్ఫ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి అక్షర్‌ ఔటయ్యాడు. అతడు శ్రేయస్‌తో ఆరో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో శ్రేయస్‌ ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టి నిష్క్రమించాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) ఎలిస్‌ (బి) బెరెండార్ఫ్‌ 21; రుతురాజ్‌ (సి) బెరెండార్ఫ్‌ (బి) డ్వార్షిస్‌ 10; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) ఎలిస్‌ 53; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) మెక్‌డెర్మట్‌ (బి) డ్వార్షిస్‌ 5; రింకు సింగ్‌ (సి) డేవిడ్‌ (బి) సంఘా 6; జితేశ్‌ శర్మ (సి) షార్ట్‌ (బి) హార్డీ 24; అక్షర్‌ పటేల్‌ (సి) హార్డీ (భి) బెరెండార్ఫ్‌ 31; రవి బిష్ణోయ్‌ రనౌట్‌ 2; అర్ష్‌దీప్‌ సింగ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 160; వికెట్ల పతనం: 1-33, 2-33, 3-46, 4-55, 5-97, 6-143, 7-156, 8-160; బౌలింగ్‌: హార్డీ 4-0-21-1; బెరెండార్ఫ్‌ 4-0-38-2; డ్వార్షిస్‌ 4-0-30-2; నాథన్‌ ఎలిస్‌ 4-0-42-1; తన్వీర్‌ సంఘా 4-0-26-1

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: ట్రావిస్‌ హెడ్‌ (బి) బిష్ణోయ్‌ 28; ఫిలిప్‌ (బి) ముకేశ్‌ 4; మెక్‌డెర్మట్‌ (సి) రింకు (భి) అర్ష్‌దీప్‌ 54; హార్డీ (సి) శ్రేయస్‌ (బి) బిష్ణోయ్‌ 6; టిమ్‌ డేవిడ్‌ (సి) అవేష్‌ (బి) అక్షర్‌ 17; షార్ట్‌ (సి) రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 16; వేడ్‌ (సి) శ్రేయస్‌ (బి) అర్ష్‌దీప్‌ 22; డ్వార్షిస్‌ (బి) ముకేశ్‌ 0; ఎలిస్‌ నాటౌట్‌ 4; బెరెండార్ఫ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154; వికెట్ల పతనం: 1-22, 2-47, 3-55, 4-102, 5-116, 6-129, 7-129, 8-151; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-40-2; అవేష్‌ ఖాన్‌ 4-0-39-0; ముకేశ్‌ కుమార్‌ 4-0-32-3; రవి బిష్ణోయ్‌ 4-0-29-2; అక్షర్‌ పటేల్‌ 4-0-14-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు