IND w Vs ENG w: సివర్‌, వ్యాట్‌ ధనాధన్‌

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

Updated : 07 Dec 2023 09:37 IST

తొలి టీ20 ఇంగ్లాండ్‌దే
భారత మహిళల పరాజయం

ముంబయి: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాట్‌ సివర్‌ (77; 53 బంతుల్లో 13×4), డానీ వ్యాట్‌ (75; 47 బంతుల్లో 8×4, 2×6) చెలరేగడంతో మొదట ఇంగ్లాండ్‌ 6 వికెట్లకు 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో తడబడ్డ భారత్‌ 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. షెఫాలి వర్మ (52; 42 బంతుల్లో 9×4) టాప్‌ స్కోరర్‌. సోఫీ ఎకిల్‌స్టోన్‌ (3/15) భారత్‌ను దెబ్బతీసింది.

షెఫాలి రాణించినా..: భారీ లక్ష్య ఛేదనలో భారత్‌ ఏ దశలో బలంగా ఉన్నట్లు కనపడలేదు. షెఫాలి నిలిచినా.. ఆమెకు మరోవైపు నుంచి పెద్దగా సహకారం లభించలేదు. స్మృతి మంధాన (6), జెమీమా (4) త్వరగానే ఔటైనా.. షెఫాలి మెరుపులతో భారత్‌ 6 ఓవర్లలో 53/2తో నిలిచింది. షెఫాలితో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ నిలవడంతో పది ఓవర్లకు స్కోరు 82/2. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగింది. హర్మన్‌ప్రీత్‌ ఔటైనా.. షెఫాలి, రిచా కాస్త బ్యాట్‌ ఝళిపించారు. కానీ లక్ష్యం పెద్దది కావడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ ఇంకా పెరిగిపోయింది. చివరి ఆరు ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కష్టమైన పనే. ఆ దశలో రిచాను సారా గ్లెన్‌, షెఫాలిని ఎకిల్‌స్టోన్‌ ఔట్‌ చేయడంతో భారత్‌కు చిన్న ఆశ కూడా లేకుండా పోయింది. చివరి మూడు ఓవర్లలో 58 పరుగులు చేయాల్సిన స్థితిలో ఓటమి ఖాయమైపోయింది. 17, 19వ ఓవర్లలో కలిపి సోఫీ 8 పరుగులే ఇచ్చింది.

దంచేసిన ఆ ఇద్దరు: ఇంగ్లాండ్‌ అంత భారీ స్కోరు చేయడం ఊహించనిదే. ఇన్నింగ్స్‌ను ఆ జట్టు అంత పేలవంగా ఆరంభించింది. 2/2... తొలి ఓవరైనా పూర్తి కాకముందే ఇంగ్లాండ్‌ పరిస్థితిది. కానీ ఆ జట్టును కట్టడి చేసే అద్భుత అవకాశాన్ని భారత్‌ చేజార్చుకుంది. వ్యాట్‌, సివర్‌ జంట విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌కు భారీ స్కోరును అందించింది. టాస్‌ గెలిచి భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. రేణుక తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్‌ను గట్టి దెబ్బతీసింది. వరుస బంతుల్లో డంక్లీ (1), క్యాప్సీ (0)లను బౌల్డ్‌ చేసి భారత్‌కు అదిరే ఆరంభాన్నిచ్చింది. కానీ సంబరాలు తాత్కాలికమే. ఓపెనర్‌ వ్యాట్‌కు తోడైన నాట్‌ సివర్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటర్లిద్దరూ అలవోకగా బౌండరీలు కొట్టారు. పది ఓవర్లలో ఇంగ్లాండ్‌ 89/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాత కూడా జోరు కొనసాగించిన సివర్‌.. రేణుక బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదింది. శ్రేయాంక బౌలింగ్‌లో ముందుకొచ్చి లాంగాఫ్‌లో సిక్స్‌ కొట్టిన వ్యాట్‌ అర్ధశతకం పూర్తి చేసుకుంది. తర్వాతి ఓవర్లో బౌండరీతో సివర్‌ అర్ధసెంచరీ సాధించింది. 15వ ఓవర్లలో ఇంగ్లాండ్‌ 140/2తో నిలిచింది. జోరుమీదున్న వ్యాట్‌ను తర్వాతి ఓవర్లో ఔట్‌ చేయడం ద్వారా 138 పరుగుల భాగస్వామ్యాన్ని ఇషాక్‌ విడదీసినా భారత్‌కు పెద్దగా ఉపశమనం లేకపోయింది. సివర్‌ ధాటైన బ్యాటింగ్‌ను కొనసాగించింది. వస్త్రాకర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టేసింది. ఆమె కన్నా ముందు నైట్‌ కూడా ఓ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. ఇంగ్లాండ్‌ చివరి మూడు ఓవర్లలో సివర్‌ వికెట్‌ సహా 3 వికెట్లు కోల్పోయి మరో 33 పరుగులు సాధించింది. అమీ జోన్స్‌ (23; 9 బంతుల్లో 3×4, 1×6) బ్యాట్‌ ఝళిపించింది.

ఇంగ్లాండ్‌ మహిళల ఇన్నింగ్స్‌: డంక్లీ (బి) రేణుక సింగ్‌ 1; డానీ వ్యాట్‌ (స్టంప్డ్‌) రిచా (బి) ఇషాక్‌ 75; క్యాప్సీ (బి) రేణుక సింగ్‌ 0; నాట్‌ సివర్‌ (సి) రిచా (బి) రేణుక సింగ్‌ 77; హెదర్‌ నైట్‌ (బి) శ్రేయాంక 6; అమీ జోన్స్‌ (సి) జెమీమా (బి) శ్రేయాంక 23; ఫ్రెయా కెంప్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 10

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 197;

వికెట్ల పతనం: 1-2, 2-2, 3-140, 4-165, 5-177, 6-197;

బౌలింగ్‌: రేణుక సింగ్‌ 4-0-27-3; పూజ వస్త్రాకర్‌ 4-0-44-0; సైకా ఇషాక్‌ 4-0-38-1; దీప్తి శర్మ 3-0-28-0; శ్రేయాంక పాటిల్‌ 4-0-44-2; కనిక ఆహుజా 1-0-12-0

భారత మహిళల ఇన్నింగ్స్‌: షెఫాలి వర్మ (సి) సారా గ్లెన్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 52; స్మృతి మంధాన (బి) నాట్‌ సివర్‌ 6; జెమీమా (సి) జోన్స్‌ (బి) ఫ్రెయా కెంప్‌ 4; హర్మన్‌ప్రీత్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 26; రిచా ఘోష్‌ (సి) క్యాప్సీ (బి) సారా గ్లెన్‌ 21; కనిక (సి) నాట్‌ సివర్‌ (బి) ఎకిల్‌స్టోన్‌ 15; పూజ వస్త్రాకర్‌ నాటౌట్‌ 11; దీప్తి శర్మ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 21

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159;

వికెట్ల పతనం: 1-20, 2-41, 3-82, 4-122, 5-134, 6-151;

బౌలింగ్‌: మహిక గౌర్‌ 2-0-18-0; లారెన్‌ బెల్‌ 4-0-35-0; నాట్‌ సివర్‌ 4-0-35-1; ఫ్రెయా కెంప్‌ 2-0-30-1; సోఫీ ఎకిల్‌స్టోన్‌ 4-0-15-3; సారా గ్లెన్‌ 4-0-25-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని