David Warner: ఎవరి అభిప్రాయాలు వాళ్లవి
జాన్సన్ వ్యాసంపై వార్నర్
మెల్‌బోర్న్: ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయని, ముందుకు సాగడమే తన పని అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. సిడ్నీలో చివరి టెస్టు ఆడాలని ఉందని బహిరంగంగా వార్నర్ చెప్పడంపై ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తేదీ ప్రకటించుకునేంత గొప్ప ఫామ్‌లో వార్నర్ ఉన్నాడా అని ప్రశ్నిస్తూ, బాల్ టాంపరింగ్‌లో అతని పాత్రను గుర్తుచేస్తూ ఓ వ్యాసంలో జాన్సన్ మండిపడ్డాడు. దీనిపై శుక్రవారం స్పందించిన వార్నర్.. ‘‘శీర్షిక లేకుండా వేసవి క్రికెట్ ఉంటుందా? ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అవి అలాగే ఉంటాయి. ముందుకు సాగుతూనే ఉండాలి. పాకిస్థాన్‌తో టెస్టుల కోసం ఎదురుచూస్తున్నాం. విమర్శలు ఎలా ఎదుర్కోవాలో తల్లిదండ్రులు నాకు నేర్పారు. ప్రతి రోజు పోరాడాలని, కష్టపడాలని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఆడుతున్నప్పుడు విమర్శలు వస్తాయి. అలాగే ఎంతో సానుకూలత కూడా ఉంటుంది’’ అని వివరించాడు. పాకిస్థాన్‌తో మూడు టెస్టు సిరీస్‌లో భాగంగా ఈ నెల 14న ఆరంభమయ్యే తొలి మ్యాచ్‌కు ప్రకటించిన జట్టులో వార్నర్ చోటు దక్కించుకున్నాడు. సిడ్నీలో వచ్చే నెల 3న ఆడబోయే మూడో టెస్టుతో అతను సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికే అవకాశముంది. మరోవైపు బయటి వ్యక్తుల దాడుల నుంచి ఆటగాళ్లను కాపాడుకుంటామని ఆసీస్ కెప్టెన్ కమిన్స్ స్పష్టం చేశాడు. ‘‘జట్టులో ఒకరిని మరొకరం కాపాడుకుంటాం. వార్నర్ లేదా స్మిత్ లాంటి ఆటగాళ్లతో ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం. ఈ ఏడాది ఇప్పటికే మాకు అద్భుతంగా గడిచింది. ఇదే ఉత్తేజంతో వేసవికి సిద్ధమయ్యాం. ఆస్ట్రేలియా క్రికెట్లో ఎన్నో సానుకూల విషయాలున్నాయి. దానిపై దృష్టి సారిస్తే మేలు’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.
వాళ్లు తటస్థ అథ్లెట్లుగా: ఐవోసీ
జెనీవా: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కొంతమంది రష్యా క్రీడాకారులను తటస్థ అథ్లెట్లుగా అనుమతించబోతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) వెల్లడించింది. ఈ అథ్లెట్లు తమ దేశం పేరు, జెండా ఉపయోగించకుండా ఐవోసీ జెండాతో బరిలో దిగాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టాక ఐవోసీ రష్యా, బెలారస్ అథ్లెట్లపై నిషేధాన్ని విధించింది. అయితే 2024 ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు దేశాల అథ్లెట్లను కొన్ని నిబంధనలతో ఒలింపిక్స్‌కు అనుమతించేలా నిర్ణయం తీసుకుంది. యుద్ధానికి మద్దతు ఇవ్వని అథ్లెట్లను పోటీలకు పంపే విషయాన్ని క్రీడా సంఘాలకు వదిలేసింది. ఇప్పటిదాకా ఎనిమిదిమంది రష్యా, ముగ్గురు బెలారస్ అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు ఐవోసీ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌కు రష్యా 335 మంది అథ్లెట్లను పంపింది. పారిస్ ఒలింపిక్స్‌లో చాలా తక్కువ సంఖ్యలో ఆ దేశం నుంచి క్రీడాకారులు పోటీపడే అవకాశాలున్నాయి.
కొరియాపై భారత్ గెలుపు
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఇప్పటికే నాకౌట్‌కు దూరమైన భారత జట్టు 9-12 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో 3-1తో కొరియాను ఓడించింది. ఈ పోరులో మొదట్లో కొరియానే బోణీ కొట్టింది. జియున్ (19వ) బంతిని లక్ష్యానికి చేర్చడంతో ఆ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాసేపటికే రూప్నీ కుమారి (23వ) గోల్ చేసి స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి భారత్.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. వరుస దాడులతో అవకాశాలు సృష్టించుకున్న భారత్.. ముంతాజ్‌ఖాన్ (44వ), అన్ను (46వ) గోల్స్‌తో 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాచుకుని ఘన విజయం సాధించింది. తొమ్మిదో స్థానాన్ని ఖరారు చేసుకోవాలంటే శనివారం తన చివరి వర్గీకరణ మ్యాచ్‌లో చిలీ లేక అమెరికాను భారత్ ఓడించాల్సి ఉంది.
షమి లాంటి బౌలర్‌ను తయారుచేయలేం: పారస్
దిల్లీ: మహ్మద్ షమి వంటి కళాత్మక పేసర్‌ను ప్రపంచంలో ఏ కోచ్ తయారు చేయలేడని భారత జట్టు బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రె అన్నాడు. ప్రతిసారి మంచి సీమ్‌తో బంతిని సంధించగలిగే అరుదైన సామర్థ్యం షమి సొంతమని పారస్ కితాబిచ్చాడు. ‘‘షమి లాంటి బౌలర్‌ను కోచ్‌లు తయారు చేయగలరని నేనంటే అబద్ధం చెబుతున్నట్లే. ప్రతిసారి మంచి సీమ్‌తో బంతిని సంధించగల బౌలర్ ప్రపంచంలో షమి ఒక్కడే. అతను ఎంతో కష్టపడి సంపాదించిన నైపుణ్యం అది. తనను తాను మేటి పేసర్‌గా తయారు చేసుకున్నాడు. పదునైన సీమ్‌తో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం అరుదైన నైపుణ్యం. చాలామంది సీమ్‌తో సంధించినా బంతి నేరుగా వెళ్తుంది’’ అని పారస్ తెలిపాడు.
భారత్ 22 మందితో.. 5 దేశాల హాకీ టోర్నీ
దిల్లీ: స్పెయిన్‌లో జరిగే అయిదు దేశాల మహిళల హాకీ టోర్నీ కోసం 22 మంది సభ్యుల భారత జట్టును హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు సవిత పునియా సారథ్యం వహించనుంది. డిసెంబర్ 15న ఆరంభం కానున్న ఈ టోర్నీలో భారత్‌తో పాటు స్పెయిన్, ఐర్లాండ్, జర్మనీ, బెల్జియం పోటీపడుతున్నాయి. జనవరి 13న రాంచిలో మొదలయ్యే ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అయిదు దేశాల టోర్నీని సన్నాహకంగా నిర్వహిస్తున్నారు. 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న వందన కటారియా భారత జట్టుకు వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనుంది. షర్మిలా దేవి, గుర్జీత్ కౌర్, నవ్‌నీత్ కౌర్ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. ‘‘భారత్ జట్టు సమతూకంగా బలంగా ఉంది. ఒలింపిక్ క్వాలిఫయర్స్ ముందు సత్తా చాటేందుకు అయిదు దేశాల టోర్నీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టాప్ ఐరోపా దేశాలతో తలపడడం వల్ల ఆటలో లోపాలు తెలుస్తాయి’’ అని భారత కోచ్ స్కోప్‌మ్యాన్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


