IND vs ENG: ఆపద్బాంధవుడు

నాలుగో టెస్టులో ఓటమి ప్రమాదం నుంచి బయటపడ్డ టీమ్‌ఇండియా.. విజయం దిశగా సాగడంలో అశ్విన్‌, కుల్‌దీప్‌ కంటే కూడా ధ్రువ్‌ జురెల్‌కు ఎక్కువ ఘనత దక్కాల్సిందే. రాజ్‌కోట్‌లో గత టెస్టుతో అరంగేట్రం చేసి.. కేవలం రెండోసారి మాత్రమే బ్యాటింగ్‌కు వచ్చిన  ఈ 23 ఏళ్ల వికెట్‌ కీపర్‌ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

Updated : 26 Feb 2024 10:58 IST

నాలుగో టెస్టులో ఓటమి ప్రమాదం నుంచి బయటపడ్డ టీమ్‌ఇండియా.. విజయం దిశగా సాగడంలో అశ్విన్‌, కుల్‌దీప్‌ కంటే కూడా ధ్రువ్‌ జురెల్‌కు ఎక్కువ ఘనత దక్కాల్సిందే. రాజ్‌కోట్‌లో గత టెస్టుతో అరంగేట్రం చేసి.. కేవలం రెండోసారి మాత్రమే బ్యాటింగ్‌కు వచ్చిన  ఈ 23 ఏళ్ల వికెట్‌ కీపర్‌ నైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంగ్లాండ్‌ స్పిన్నర్ల ధాటికి నిలబడలేక ప్రధాన బ్యాటర్లు పెవిలియన్‌ చేరిన వేళ.. ధ్రువ్‌ పట్టుదలతో ఎదురు నిలిచాడు. 177/7తో ఉన్న జట్టును 307 పరుగులకు చేర్చాడు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన 90 పరుగులు సాధించాడు. అతను శతకానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయి ఉండొచ్చు కానీ అతని ఇన్నింగ్స్‌ సెంచరీ కంటే ఎంతో విలువైందే. 50 కంటే తక్కువ ఆధిక్యమే జట్టు కోల్పోయింది కాబట్టి మన స్పిన్నర్లు రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా బౌలింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ను కుప్పకూల్చారు. అదే ఆధిక్యం 100 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఒత్తిడి ఉండేది. పరిస్థితులు మరింత కఠినంగా మారేవి. కానీ టెయిలెండర్లతో కలిసి 130 పరుగులు జత చేసిన ధ్రువ్‌ ఆ ఇబ్బంది లేకుండా చేశాడు. ఈ వయసులోనే గొప్ప పరిణతి ప్రదర్శించాడు. ఓపికతో ఆడటమే కాదు అలవోకగా బౌండరీలూ సాధించాడు. 211 నిమిషాలు క్రీజులో నిలబడి 149 బంతులాడాడు. అర్ధశతకం తర్వాత కార్గిల్‌ యుద్ధ వీరుడైన తండ్రి నీమ్‌ చంద్‌ కోసం ధ్రువ్‌ సెల్యూట్‌ చేశాడు. తండ్రి యుద్ధ వీరుడైతే.. తనయుడు మైదానంలో అదే పోరాట స్ఫూర్తితో యోధుడిగా నిలుస్తున్నాడు. అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్‌లోనూ జట్టు 331/7తో ఉన్న దశలో 46 పరుగులతో ఆదుకున్నాడు.

వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యాలతోనూ ఆకట్టుకున్నాడు. తాజాగా అండర్సన్‌ క్యాచ్‌ను అందుకున్న తీరు గురించి చెప్పుకోవాలి. రివర్స్‌ స్వీప్‌ ఆడేందుకు అండర్సన్‌ ప్రయత్నించగా.. తొడకు, బ్యాట్‌కు తాకి వచ్చిన బంతిని మెరుపు వేగంతో స్పందించి ధ్రువ్‌ ఒంటిచేత్తో పట్టుకున్నాడు. 2022 డిసెంబర్‌ చివర్లో రోడ్డు ప్రమాదంతో పంత్‌ జట్టుకు దూరమైనప్పటి నుంచి టెస్టుల్లో వికెట్‌కీపర్‌ కోసం జట్టు వెతుకుతోంది. కేఎస్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌లను ఆడించి చూసింది. ఇప్పుడు పంత్‌ పునరాగమనానికి సిద్ధమవుతున్న సమయంలో అతడికి దీటైన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా ధ్రువ్‌ కనిపిస్తున్నాడు. ఈ టెస్టు సిరీస్‌కు ముందు రోజుకు 140 ఓవర్ల పాటు ధ్రువ్‌ బ్యాటింగ్‌ సాధన చేశాడు. వేర్వేరు స్పిన్‌ పిచ్‌లపై నాలుగు గంటలు ప్రాక్టీస్‌ కొనసాగించాడు. ఇప్పుడు ధ్రువ్‌ పేరు మార్మోగుతోంది కానీ అసలు ఈ సిరీస్‌లో ఆడతానని అతను కూడా ఊహించి ఉండడు. ఎందుకంటే టెస్టు జట్టులో వికెట్‌కీపర్‌గా కేఎస్‌ భరత్‌ ఉన్నాడు. ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ కిషన్‌ ఉన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇషాన్‌ను పక్కన పెట్టి ధ్రువ్‌ను జట్టుకు ఎంపిక చేశారు. కానీ తొలి రెండు టెస్టుల్లో భరత్‌ ఆడాడు. అతను విఫలమవడంతో మూడో టెస్టులో ధ్రువ్‌కు అవకాశం వచ్చింది. అతను మరో ధోనీగా ఎదుగుతాడంటూ క్రికెట్‌ దిగ్గజం గావస్కర్‌ కితాబివ్వడం విశేషం. ‘‘అవును.. ధ్రువ్‌ గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. కానీ వికెట్ల వెనకాల అతని పనితనం కూడా  గొప్పగా ఉంది. ఆటపై అతని అవగాహన చూస్తుంటే మరో ధోనీలా ఎదుగుతాడనిపిస్తోంది. మరో ధోని రాడని తెలుసు. కానీ ధోనీలాగే ధ్రువ్‌ ఆలోచనా విధానం ఉంది’’ అని గావస్కర్‌ చెప్పాడు.

ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని