నం.10, నం.11 సెంచరీలు

41సార్లు ఛాంపియన్‌ ముంబయి రంజీ ట్రోఫీ ఎలీట్‌ డివిజన్లో సెమీస్‌ చేరింది. బరోడాతో క్వార్టర్‌ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు ముందంజ వేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 379/9తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబయి..

Published : 28 Feb 2024 02:04 IST

తనుష్‌, తుషార్‌ సంచలనం
రంజీ సెమీస్‌లో ముంబయి
ముంబయి

41సార్లు ఛాంపియన్‌ ముంబయి రంజీ ట్రోఫీ ఎలీట్‌ డివిజన్లో సెమీస్‌ చేరింది. బరోడాతో క్వార్టర్‌ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు ముందంజ వేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 379/9తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబయి.. 569 పరుగులకు ఆలౌటైంది. 10, 11 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన తనుష్‌ కొటియన్‌ (120 నాటౌట్‌; 129 బంతుల్లో 10×4, 4×6), తుషార్‌ దేశ్‌పాండే (123;   129 బంతుల్లో 10×4, 8×6) సెంచరీలతో సంచలనం సృష్టించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో గత 78 ఏళ్లలో ఘనత సాధించిన జోడీ వీరిదే. 1946లో సర్రేతో టూర్‌ మ్యాచ్‌లో భారత్‌ తరఫున సీటీ సర్వాటే (124), ఎస్‌ఎన్‌ బెనర్జీ (121) తొలిసారి ఈ రికార్డు సాధించారు. తనుష్‌, తుషార్‌ పదో వికెట్‌కు 232 పరుగులు జోడించారు. 606 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా.. ఆట ముగిసే సమయానికి 121/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబయికే సెమీస్‌ బెర్తు దక్కింది. మొదట ముంబయి 384 పరుగులు చేయగా.. బరోడా 348 పరుగలకు ఆలౌటైంది.

విదర్భ ఘనవిజయం: మరో క్వార్టర్స్‌లో విదర్భ 127 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించి సెమీస్‌ చేరింది. 371 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక.. రెండో ఇన్నింగ్స్‌లో హర్ష్‌ దూబె (4/65), ఆదిత్య సర్వాటే (4/78)ల ధాటికి 243 పరుగులకే ఆలౌటైంది. టాప్‌-3 బ్యాటర్లు రవికుమార్‌ సమర్థ్‌ (40), మయాంక్‌ అగర్వాల్‌ (70), అనీష్‌ (40) జట్టుకు మంచి ఆరంభాన్నే ఇచ్చినా.. వీళ్లు వెనుదిరిగాక కర్ణాటక ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 460 పరుగులు సాధించగా.. కర్ణాటక 286కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 196 పరుగులు చేసింది. మార్చి 2న మొదలయ్యే సెమీస్‌లో మధ్యప్రదేశ్‌ను విదర్భ, తమిళనాడును ముంబయి ఢీకొంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని