కిరణ్‌ విధ్వంసం

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించిన జట్టు ముంబయి ఇండియన్స్‌. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన జట్టు యూపీ వారియర్స్‌. ఈ రెండు జట్ల మధ్య పోరులో యూపీనే పైచేయి సాధించింది. బుధవారం ముంబయిపై 7 వికెట్ల తేడాతో నెగ్గిన యూపీ సీజన్లో బోణీ కొట్టింది.

Published : 29 Feb 2024 03:53 IST

డబ్ల్యూపీఎల్‌-2లో యూపీ బోణీ
ముంబయిపై ఘనవిజయం
బెంగళూరు

బ్ల్యూపీఎల్‌ రెండో సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించిన జట్టు ముంబయి ఇండియన్స్‌. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన జట్టు యూపీ వారియర్స్‌. ఈ రెండు జట్ల మధ్య పోరులో యూపీనే పైచేయి సాధించింది. బుధవారం ముంబయిపై 7 వికెట్ల తేడాతో నెగ్గిన యూపీ సీజన్లో బోణీ కొట్టింది. 162 పరుగుల పెద్ద లక్ష్యాన్ని ఆ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన ఓపెనర్‌ కిరణ్‌ నవ్‌గిరె (57; 31 బంతుల్లో 6×4, 4×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొదట ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (55; 47 బంతుల్లో 9×4, 1×6) మెరుపులతో ముంబయి 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న ముంబయి ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేయగా.. ఓపెనర్లు హేలీ మాథ్యూస్‌, యాస్తిక భాటియా (26; 22 బంతుల్లో 3×4, 1×6) అదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించాక యాస్తిక వెనుదిరిగినా.. నాట్‌ సీవర్‌ (19), అమేలియా (23)ల సహకారంతో హేలీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. హేలీ ఔటయ్యాక ఇన్నింగ్స్‌ నెమ్మదించినా.. చివర్లో పూజ వస్త్రాకర్‌ (18), ఇసీ వాంగ్‌ (15 నాటౌట్‌) ధాటిగా ఆడి స్కోరును 160 దాటించారు. ఈ సీజన్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమవుతుండగా.. ముంబయి మాత్రం పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించడం యూపీకి మరో ఓటమి తప్పదనిపించింది. కానీ ముంబయి బౌలర్లపై విరుచుకుపడిన కిరణ్‌.. ఛేదనను తేలికగా మార్చేసింది. పదో ఓవర్లో ఆమె ఔటయ్యే సమయానికే స్కోరు 94కు చేరుకుంది. కిరణ్‌ వెనుదిరిగాక.. ఇసీ వాంగ్‌ (2/30) ఒకే ఓవర్లో తాలియా (1), అలీసాలను ఔట్‌ చేసి యూపీని ఒత్తిడిలోకి నెట్టింది. కానీ గ్రేస్‌ హారిస్‌ (38 నాటౌట్‌; 17 బంతుల్లో 6×4, 1×6), దీప్తి శర్మ (27 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4) చెలరేగి ఆడడంతో 21 బంతులుండగానే యూపీ విజయాన్నందుకుంది. ఈ జోడీ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 65 పరుగులు జోడించింది.

సంక్షిప్త స్కోర్లు.. ముంబయి ఇండియన్స్‌: 161/6 (హేలీ మాథ్యూస్‌ 55, యాస్తిక 26, గ్రేస్‌ హారిస్‌ 1/20, సోఫీ ఎకిల్‌స్టోన్‌ 1/25)

యూపీ వారియర్స్‌: 163/3 (కిరణ్‌ నవ్‌గిరె 57, గ్రేస్‌ హారిస్‌ 38 నాటౌట్‌, అలీసా హీలీ 33, దీప్తి శర్మ 27 నాటౌట్‌; ఇసీ వాంగ్‌ 2/30)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని