పటీదార్‌కు పరీక్ష

ప్రతిభ పరంగా ఢోకా లేదు. నైపుణ్యాలనూ సందేహించే అవసరం లేదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో మెరుగైన గణాంకాలు.

Updated : 03 Mar 2024 06:54 IST

ఈనాడు క్రీడావిభాగం

ప్రతిభ పరంగా ఢోకా లేదు. నైపుణ్యాలనూ సందేహించే అవసరం లేదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో మెరుగైన గణాంకాలు. కానీ అరంగేట్ర టెస్టు సిరీస్‌లో మాత్రం వరుస వైఫల్యాలు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేక.. కీలక పరుగులు చేయలేక.. మంచి అవకాశాలను వృథా చేసుకుంటున్నాడనే వ్యాఖ్యలు. జట్టులో చోటు దొరకడమే కష్టమవుతున్న నేపథ్యంలో.. తిరిగి పుంజుకోకుంటే వేటు తప్పదనే సంకేతాలు! ఈ ఉపోద్ఘాతమంతా టీమ్‌ఇండియా ఆటగాడు రజత్‌ పటీదార్‌ గురించే. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అంచనాల మేర రాణించలేకపోయిన అతనికి.. చివరి టెస్టు కఠిన పరీక్షగా మారనుంది.

ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా 3-1తో సొంతం చేసుకుంది. ఇక నామమాత్రమైన చివరి టెస్టు మాత్రమే మిగిలింది. గురువారం ధర్మశాలలో ఆ మ్యాచ్‌ ఆరంభం కానుంది. సిరీస్‌ ఫలితాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్‌కు అధిక ప్రాధాన్యత లేనట్లే. కానీ రజత్‌ పటీదార్‌కు మాత్రం ఈ పోరు ఎంతో ముఖ్యమైంది. ఇది టీమ్‌ఇండియాలో తన చోటును నిర్ణయించే కీలక మ్యాచ్‌ అని చెప్పొచ్చు. 32, 9, 5, 0, 17, 0.. వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో రజత్‌ చేసిన పరుగులివి. తన అరంగేట్ర సిరీస్‌లో ఇప్పటివరకూ 10.5 సగటుతో 63 పరుగులు మాత్రమే చేశాడు. రజత్‌ నుంచి ఏ మాత్రం ఆశించని ప్రదర్శన ఇది. అతని ప్రతిభకు తగ్గ ఆటతీరు ఇది కానే కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవకాశం అందుకోలేక..: మొదట కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరమవగానే.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రజత్‌ను జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీల్లో పరుగుల వేటలో సాగుతున్న సీనియర్‌ బ్యాటర్‌ పుజారాను కాదని, టన్నుల కొద్దీ పరుగులు చేసిన యువ ఆటగాడు సర్ఫరాజ్‌ను కాదని రజత్‌ను ఎంపిక చేశారు. ఇందుకు కారణం గత కొద్దికాలంగా దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్‌, భారత్‌- ఎ తరపున అతని నిలకడైన ప్రదర్శనే. శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌ ఉండటంతో తొలి టెస్టులో అవకాశం రాలేదు. కానీ గాయంతో రాహుల్‌ దూరమవడంతో విశాఖలో జరిగిన రెండో టెస్టుతో రజత్‌ టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాడు. మూడో టెస్టుతో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ ఆకట్టుకున్నారు. పటీదార్‌ను మాత్రం వైఫల్యాలు వెంబడిస్తున్నాయి. షార్ట్‌ పిచ్‌ బంతులు ఆడటంలో బలహీనత, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటు అతణ్ని దెబ్బతీస్తోంది. అతనిలో నైపుణ్యాలు లేవా? ప్రతిభ లేదా అంటే కాదు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 58 మ్యాచ్‌ల్లో 43.68 సగటుతో 4063 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో అనధికారి టెస్టు సిరీస్‌లో భారత్‌- ఎ తరపున సత్తాచాటాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనూ ఇప్పటివరకూ షాట్లపై నియంత్రణ పరంగా కనీసం 100 బంతులాడిన వాళ్లలో శుభ్‌మన్‌ గిల్‌, ధ్రువ్‌ జురెల్‌, అక్షర్‌ పటేల్‌ మాత్రమే పటీదార్‌ (89.02 శాతం) కంటే మెరుగ్గా ఉన్నారు. అలాగే తప్పుడు షాట్ల విషయానికి వస్తే తక్కువగా ఆడింది కూడా అతనే. 18 షాట్లు మాత్రమే ఇలాంటివి. కానీ ఆరు సార్లు ఔటయ్యాడు. అతనికి అదృష్టమూ కలిసి రాలేదనే చెప్పాలి. క్రీజులో ఆత్మవిశ్వాసంతో కాసేపు నిలబడగలిగితే రజత్‌ పరుగులు సాధిస్తాడు. అతనికి ఆ సమయం రావాలి.  

పడిక్కల్‌ వస్తాడా?: ఇప్పటికే సిరీస్‌ గెలిచిన నేపథ్యంలో నామమాత్రమైన ఈ చివరి టెస్టులో రజత్‌ స్థానానికి దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు. పడిక్కల్‌ టెస్టు అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. అతను 31 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 44.54 సగటుతో 2227 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌- ఎ క్రికెట్లో కలిపి గత 14 ఇన్నింగ్స్‌ల్లో దేవ్‌దత్‌ ఆరు సెంచరీలు చేశాడు. ఓ ఇన్నింగ్స్‌లో అజేయంగా 93 పరుగులు చేశాడు. ఒకవేళ రజత్‌ను పక్కనపెట్టే ఆస్కారముంటే.. విదర్భతో మధ్యప్రదేశ్‌ రంజీ సెమీస్‌ నేపథ్యంలో చివరి టెస్టుకు ముందు బీసీసీఐ అతణ్ని జట్టు నుంచి విడుదల చేసేదనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. అలా చేయలేదంటే అతనిపై నమ్మకముంచిన టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జట్టులో చోటు కోసం తీవ్రమైన పోటీ ఉంది. అవకాశం దొరకడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా మూడు టెస్టుల్లోనూ వైఫల్యం అంటే ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ నేపథ్యంలో చివరి టెస్టులో పటీదార్‌ పరుగులు సాధించకపోతే మాత్రం అతను తిరిగి జట్టులోకి రావడం కష్టమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని