Hardik Pandya: హార్దిక్‌ సవాళ్ల ప్రయాణం..

ముంబయి ఇండియన్స్‌ నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్‌ పాండ్య.

Updated : 29 Mar 2024 07:28 IST

దిల్లీ: ముంబయి ఇండియన్స్‌ నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్‌ పాండ్య. ఈ సీజన్‌కు ముందు సారథిగా ముంబయికి తిరిగొచ్చాడు. కానీ ముంబయిని నడిపించడం సవాళ్లతో కూడిన ప్రయాణమని ఇప్పటికే పాండ్యకు తెలిసొచ్చే ఉంటుంది. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబయి ఓడింది. రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌ చేయడంపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మైదానంలో హార్దిక్‌ వ్యూహాలపైనా విమర్శలు వస్తున్నాయి. గుజరాత్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోచ్‌ ఆశిష్‌ నెహ్రా రూపంలో ఓ శక్తి హార్దిక్‌ను నడిపించింది. నెహ్రా వ్యూహాలను హార్దిక్‌ అమలు చేసేవాడు. బౌండరీ అవతల నిలబడి ఫుట్‌బాల్‌ మేనేజర్‌లా కెప్టెన్‌, ఆటగాళ్లకు నెహ్రా సూచనలిస్తుండటం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ముంబయి జట్టులో అలా లేదు. ‘‘నెహ్రా రూపొందించే ప్రణాళికలను హార్దిక్‌ అమలు చేసేవాడనదే బహిరంగ రహస్యమే. సలహాలు, సూచనలతో నెహ్రా బౌండరీ లైన్‌ బయట తిరుగుతూనే ఉంటాడు’’ అని ఓ భారత మాజీ ఆటగాడు చెప్పాడు. ఇప్పుడు చిన్న దాని నుంచి పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి వచ్చినట్లు హార్దిక్‌ పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇక్కడ సలహాలు ఇచ్చేందుకు చాలా మంది ఉన్నారు. అలాగే డిమాండ్లు, పరిస్థితులకు తగ్గట్లుగా సర్దుకుపోవాల్సి ఉంటుంది. మరోవైపు బ్యాటింగ్‌ పరంగానూ హార్దిక్‌ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడే హార్దిక్‌ కెప్టెన్సీకి వచ్చిన ప్రమాదం ఏం లేదు. కానీ అతను పుంజుకోకుంటే మాత్రం ఇబ్బంది తప్పదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని