హార్దిక్‌కు అండగా అశ్విన్‌

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యను హేళన చేస్తున్న అభిమానులపై సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ మండిపడ్డాడు. ఆటగాళ్లు ఏ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారో గుర్తుంచుకోవాలని చెప్పాడు. రోహిత్‌ స్థానంలో హార్దిక్‌కు ముంబయి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Published : 31 Mar 2024 02:18 IST

దిల్లీ: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యను హేళన చేస్తున్న అభిమానులపై సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ మండిపడ్డాడు. ఆటగాళ్లు ఏ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారో గుర్తుంచుకోవాలని చెప్పాడు. రోహిత్‌ స్థానంలో హార్దిక్‌కు ముంబయి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ముంబయి మ్యాచ్‌లాడిన చోట హార్దిక్‌ను లక్ష్యంగా చేసుకుని హేళన చేస్తున్నారు. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లోనూ అదే జరిగింది. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ అభిమాని.. ‘‘ఇది పేలవమైన మార్పిడి (హార్దిక్‌ను గుజరాత్‌ నుంచి ముంబయికి) అని ముంబయి ఇండియన్స్‌ ప్రకటించేందుకు ఇదే సమయమా?’’ అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అశ్విన్‌ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఈ విషయంలో ఫ్రాంఛైజీ లేదా ఆటగాడిది ఎలాంటి పాత్ర లేదు. ఆ బాధ్యత అభిమానులపై ఉంది. చాలా సార్లు చెప్పా ఇది క్రికెట్‌. ఇందులో సినిమా సంస్కృతి సరికాదు. హీరోలను ఆరాధించడం వేరు. అభిమానుల మధ్య పోరు ఇలాంటి వికారమైన మార్గంలో వెళ్లకూడదు. ఈ ఆటగాళ్లు మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాంటప్పుడు ఓ ఆటగాడిని హేళన చేసే హక్కు ఎక్కడిది? ఓ ఆటగాడిని గేలి చేస్తుంటే జట్టు ఎందుకు స్పష్టతనివ్వాలి? ఇతర దేశాల్లో ఇలా జరగడం చూశారా? రూట్‌, క్రాలీ.. స్మిత్‌, కమిన్స్‌ అభిమానులు ఎప్పుడైనా గొడవపడ్డారా? గతంలో సచిన్‌, గంగూలీ ఒకరి సారథ్యంలో మరొకరు ఆడారు. ఈ ఇద్దరూ ద్రవిడ్‌ కెప్టెన్సీలో ఆడారు. ఈ ముగ్గురికి కుంబ్లే సారథిగా ఉన్నాడు. వీళ్లంతా కలిసి ధోని నాయకత్వంలో ఆడారు. అప్పుడు వీళ్లందరూ దిగ్గజాలే. ధోని కూడా కోహ్లి సారథ్యంలో ప్రాతినిథ్యం వహించాడు. ఇంట్లో కూర్చుని ఒకరి గురించి చెడుగా మాట్లాడమంటే అందరికీ సంతోషమే. ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలి. మీ ఆరాధ్య ఆటగాడిపై ఇష్టాన్ని ఆస్వాదించండి. కానీ ఇతర ఆటగాళ్లను కించపర్చవద్దు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌ సోమవారం సొంత మైదానం వాంఖడేలో రాజస్థాన్‌తో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని