విశాఖలో ఐపీఎల్‌ కిక్కు.. నేడు చెన్నైతో దిల్లీ పోరు

విశాఖపట్నంలో మరోసారి ఐపీఎల్‌ మజా అభిమానులకు కిక్కు అందించనుంది. టీ20 సునామీ విశాఖను ముంచెత్తనుంది. అయిదేళ్ల విరామం తర్వాత ఇక్కడి వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తిరిగి ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగబోతోంది.

Updated : 31 Mar 2024 07:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నంలో మరోసారి ఐపీఎల్‌ మజా అభిమానులకు కిక్కు అందించనుంది. టీ20 సునామీ విశాఖను ముంచెత్తనుంది. అయిదేళ్ల విరామం తర్వాత ఇక్కడి వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో తిరిగి ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగబోతోంది. ఆదివారం రాత్రి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో దిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌ల కోసం విశాఖను దిల్లీ సొంత వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. మరో మ్యాచ్‌ బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడుతుంది. 2012, 2015, 2016, 2019 సీజన్లలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగాయి. చివరి మ్యాచ్‌ కూడా దిల్లీ, చెన్నై (2019లో రెండో క్వాలిఫయర్‌) మధ్యే జరగడం విశేషం. ఇప్పుడీ  రెండు జట్ల పోరులో సీఎస్కేనే ఫేవరెట్‌ అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు గెలవగా.. దిల్లీ రెండింట్లోనూ ఓడింది. పైగా సీఎస్కేతో ఆడిన గత నాలుగు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లోనూ దిల్లీ పరాజయం పాలైంది. చెన్నై అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో శివమ్‌ దూబె, రచిన్‌ రవీంద్ర నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌, దీపక్‌ చాహర్‌ సత్తాచాటుతున్నారు. ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ అయిన ధోని కోసం అభిమానులు స్టేడియానికి పోటెత్తే అవకాశముంది. మరోవైపు వరుస పరాజయాల నుంచి పుంజుకోవాలని దిల్లీ చూస్తోంది.  సుదీర్ఘ విరామం తర్వాత బరిలో దిగిన పంత్‌ ఇంకా లయ అందుకోలేదు. ఆ జట్టులో  ఆంధ్ర రంజీ కెప్టెన్‌ రికీ భుయ్‌ ఉన్నాడు.  కానీ పృథ్వీ షాను ఆడించాలనుకుంటే అతను పెవిలియన్‌కు పరిమితమవొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని