కొత్త కుర్రాడు.. కట్టిపడేశాడు

200 పరుగుల లక్ష్యమంటే తేలిక కాదు. కానీ పంజాబ్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, బెయిర్‌స్టో చెలరేగిపోయారు. 11 ఓవర్లకు 101/0తో పంజాబ్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ జట్టు విజయం లాంఛనమే అనుకున్నారంతా.

Updated : 31 Mar 2024 07:20 IST

అరంగేట్రంలో మయాంక్‌ అదుర్స్‌
ఐపీఎల్‌-17లో లఖ్‌నవూ బోణీ
పంజాబ్‌కు తప్పని ఓటమి
లఖ్‌నవూ

200 పరుగుల లక్ష్యమంటే తేలిక కాదు. కానీ పంజాబ్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, బెయిర్‌స్టో చెలరేగిపోయారు. 11 ఓవర్లకు 101/0తో పంజాబ్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ జట్టు విజయం లాంఛనమే అనుకున్నారంతా. అయితే అనుభవజ్ఞులైన బౌలర్లు తేలిపోతున్న సమయంలో అరంగేట్ర బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ బంతి అందుకుని సంచలన ప్రదర్శనతో పంజాబ్‌కు చెక్‌ పెట్టాడు. మెరుపు వేగంతో బంతులేసిన అతను.. పరుగులు కట్టడి చేయడమే కాక, మూడు కీలక వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను ఓటమి బాట పట్టించాడు. చివర్లో మిగతా బౌలర్లూ రాణించడంతో విజయం లఖ్‌నవూ సొంతమైంది.

పీఎల్‌-17లో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ చేతిలో ఓడిన ఆ జట్టు.. శనివారం 21 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. నిర్ణీత ఓవర్లలో 178/5కు పరిమితమైంది. శిఖర్‌ ధావన్‌ (70; 50 బంతుల్లో 7×4, 3×6), బెయిర్‌స్టో (42; 29 బంతుల్లో 3×4, 3×6) జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చినా.. వీరు వెనుదిరిగాక ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. అరంగేట్ర బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ (3/27), మోసిన్‌ ఖాన్‌ (2/34) పంజాబ్‌ను దెబ్బ తీశారు. మొదట డికాక్‌ (54; 38 బంతుల్లో 5×4, 2×6), పూరన్‌ (42; 21 బంతుల్లో 3×4, 3×6), కృనాల్‌ పాండ్య (43 నాటౌట్‌; 22 బంతుల్లో 4×4, 2×6) మెరుపులతో లఖ్‌నవూ 8 వికెట్లకు 199 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ (3/28), అర్ష్‌దీప్‌ (2/30) రాణించారు.

అతడి రాకతో..: పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సగం వరకు చూసిన వాళ్లెవ్వరూ ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఓటమి వైపు నిలుస్తుందని అనుకుని ఉండరు. కెప్టెన్‌ ధావన్‌ సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన బెయిర్‌స్టో ఈసారి ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. ఇద్దరూ స్వేచ్ఛగా షాట్లు ఆడడంతో లఖ్‌నవూ బౌలర్లకు దిక్కుతోచలేదు. పవర్‌ప్లేలో 61 పరుగులు రాబట్టిన పంజాబ్‌.. 11వ ఓవర్లోనే వందకు చేరుకుంది. ఆరుగురు బౌలర్లు దిగినా ఎవ్వరూ వికెట్‌ సాధించలేకపోయారు. ఓపెనర్లు జోరుమీదుండగా.. ఇంకా ప్రభ్‌సిమ్రన్‌, లివింగ్‌స్టన్‌, సామ్‌ కరన్‌, జితేశ్‌ శర్మ రావాల్సి ఉండడంతో పంజాబ్‌ అలవోకగా మ్యాచ్‌ గెలిచేస్తుందనిపించింది. కానీ అప్పటికే ఒక ఓవర్‌ వేసి పరుగులు కట్టడి చేసిన కొత్త బౌలర్‌ మయాంక్‌.. 12వ ఓవర్లో బెయిర్‌స్టోను ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌ (19) ధాటిగా ఆడి లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేస్తుంటే.. తన తర్వాతి ఓవర్లో అతణ్నీ ఔట్‌ చేశాడు మయాంక్‌. తన చివరి ఓవర్లో జితేశ్‌ శర్మ (6)ను సైతం అతనే ఔట్‌ చేశాడు. మయాంక్‌ పొదుపుగానూ బౌలింగ్‌ చేయడంతో సాధించాల్సిన రన్‌రేట్‌, పంజాబ్‌పై ఒత్తిడీ పెరిగిపోయాయి. మోసిన్‌ ఖాన్‌ 17వ ఓవర్లో వరుస బంతుల్లో ధావన్‌, సామ్‌ కరన్‌ (0)లను ఔట్‌ చేసి కింగ్స్‌ కష్టాలను రెట్టింపు చేశాడు. లివింగ్‌స్టన్‌ (28 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4, 2×6) క్రీజులో ఉన్నా.. ధాటిగా ఆడలేకపోవడంతో పంజాబ్‌ ఓటమి ముందే ఖరారైపోయింది. చివరి ఓవర్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో అతను 6, 4, 6 బాది ఓటమి అంతరాన్ని కొంత తగ్గించాడు.

లఖ్‌నవూ.. దంచుడే దంచుడు: మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ సొంతగడ్డపై రెచ్చిపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా ఆ జట్టు జోరు తగ్గలేదు. కెప్టెన్సీని పూరన్‌కు అప్పగించి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిన కేఎల్‌ రాహుల్‌ (15) రెండు షాట్లు ఆడి వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ డికాక్‌ చెలరేగి ఆడుతూ స్కోరింగ్‌ రేట్‌ తగ్గకుండా చూసుకున్నాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (9) వైఫల్యాన్ని కొనసాగించినా.. స్టాయినిస్‌ (19) కాసేపు నిలిచాడు. అతడి సహకారంతో డికాక్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది ప్రమాదకరంగా కనిపించినా.. అతను తర్వాతి బంతికే బౌల్డయ్యాడు. ఆపై డికాక్‌కు పూరన్‌ తోడవడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. పూరన్‌ ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 13 ఓవర్లకు 125/3తో లఖ్‌నవూ తిరుగులేని  స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో తక్కువ వ్యవధిలో డికాక్‌, పూరన్‌ వెనుదిరగడంతో ఎల్‌ఎస్‌జీ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమవుతుందనిపించింది. కానీ కృనాల్‌ చెలరేగడంతో చివరి 5 ఓవర్లలో 53 పరుగులు రాబట్టిన లఖ్‌నవూ ప్రత్యర్థికి 200 లక్ష్యాన్ని నిర్దేశించింది.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) జితేశ్‌ (బి) అర్ష్‌దీప్‌ 54; రాహుల్‌ (సి) బెయిర్‌స్టో (బి) అర్ష్‌దీప్‌ 15; దేవ్‌దత్‌ (సి) ధావన్‌ (బి) కరన్‌ 9; స్టాయినిస్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 19; పూరన్‌ (బి) రబాడ 42; బదోని (సి) బెయిర్‌స్టో (బి) కరన్‌ 8; కృనాల్‌ నాటౌట్‌ 43; బిష్ణోయ్‌ (సి) త్యాగరాజన్‌ (బి) కరన్‌ 0; మోసిన్‌ రనౌట్‌ 2; నవీనుల్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 199; వికెట్ల పతనం: 1-35, 2-45, 3-78, 4-125, 5-146, 6-189, 7-189; బౌలింగ్‌: సామ్‌ కరన్‌ 4-0-28-3; అర్ష్‌దీప్‌ 3-0-30-2; రబాడ 4-0-38-1; రాహుల్‌ చాహర్‌ 3-0-42-1; హర్‌ప్రీత్‌ 2-0-14-0; హర్షల్‌ 4-0-45-0
పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) డికాక్‌ (బి) మోసిన్‌ 70; బెయిర్‌స్టో (సి) స్టాయినిస్‌ (బి) మయాంక్‌ యాదవ్‌ 42; ప్రభ్‌ సిమ్రన్‌ (సి) నవీనుల్‌ (బి) మయాంక్‌ యాదవ్‌ 19; జితేశ్‌ (సి) నవీనుల్‌ (బి) మయాంక్‌ యాదవ్‌ 6; లివింగ్‌స్టన్‌ నాటౌట్‌ 28; సామ్‌ కరన్‌ (సి) పూరన్‌ (బి) మోసిన్‌ 0; శశాంక్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-102, 2-128, 3-139, 4-141, 5-141; బౌలింగ్‌: సిద్ధార్థ్‌ 2-0-21-0; నవీనుల్‌ 4-0-43-0; మోసిన్‌ 4-0-34-2; కృనాల్‌ 3-0-26-0; బిష్ణోయ్‌ 3-0-25-0; మయాంక్‌ యాదవ్‌ 4-0-27-3మయాంక్‌ @ 155.8 కి.మీ

తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌. 21 ఏళ్ల ఈ దిల్లీ కుర్రాడు.. లఖ్‌నవూ తరఫున శనివారమే ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు. ఛేదనలో చెలరేగిపోతున్న పంజాబ్‌ బ్యాటర్లకు కళ్లెం వేసింది అతనే. ఆ జట్టు కోల్పోయిన తొలి మూడు వికెట్లూ మయాంక్‌ ఖాతాలోనే చేరాయి. తన వేగానికి.. ధాటిగా ఆడుతున్న బెయిర్‌స్టో, ధావన్‌ సైతం ఇబ్బంది పడ్డారు. బెయిర్‌స్టోతో పాటు ప్రభ్‌సిమ్రన్‌, జితేశ్‌ శర్మ అతడికి వికెట్లు సమర్పించుకున్నారు. నిలకడగా 145 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులేసిన మయాంక్‌.. ఒక  దశలో 155.8 కి.మీ వేగాన్నందుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతి అతడిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని