MS Dhoni: ధోని వచ్చాడు.. దంచాడు

ధోని ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని సీఎస్కే ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ నిరాశ తప్పలేదు.

Updated : 01 Apr 2024 11:02 IST

ధోని ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని సీఎస్కే ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ నిరాశ తప్పలేదు. ఇప్పుడు దిల్లీతో మ్యాచ్‌లో అభిమానులను ఉర్రూతలూగించేందుకు ధోని క్రీజులోకి వచ్చాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమే కాదు ధనాధన్‌ షాట్లతో అలరించాడు. 16 బంతులాడిన అతను 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతను బౌండరీ కొట్టినప్పుడల్లా స్టేడియం దద్దరిల్లింది. జడేజాతో కలిసి దిల్లీ బౌలర్లను అతను భయపెట్టాడు. ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన వెంటనే ధోని ఇచ్చిన క్యాచ్‌ను అహ్మద్‌ పట్టలేకపోయాడు. ఆ తర్వాత ధోని ఆగలేదు. అహ్మద్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టాడు. నోకియా వేసిన చివరి ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లు కొట్టాడు. సిక్సర్‌తోనే ఇన్నింగ్స్‌ ముగించాడు. ధోని జోరు చూశాక.. అతను ఒక ఓవర్‌ ముందే బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేదేమో అనిపిస్తోంది. కానీ ధోనీకి చివరి సీజన్‌ అనే ప్రచారం నేపథ్యంలో ఆఖరి సారిగా అతని మెరుపులు చూడాలన్న అభిమానుల కోరిక ఇప్పటికైతే ఇలా నెరవేరింది. ధోనీ ఇన్నింగ్స్‌పై సాక్షి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. అత్యుత్తమ స్ట్రైకింగ్‌ రేట్‌తో ఆడిన ధోనీకి అవార్డు వచ్చింది. దానిని స్వీకరించేటప్పుడు నవ్వుతూ ఉండటంతో.. ధోనీకి మనం ఇంకా ఓడిపోయామని తెలిసినట్లు లేదని సాక్షి సింగ్‌ సరదాగా పోస్టు పెట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని