విశాఖలో దిల్లీ కేక

ఐపీఎల్‌-17లో దిల్లీ క్యాపిటల్స్‌ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకున్న ఆ జట్టు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలిచింది.

Updated : 01 Apr 2024 07:12 IST

ఐపీఎల్‌-17లో బోణీ
సీఎస్కేపై విజయం
మెరిసిన వార్నర్‌, పంత్‌

గత నాలుగు ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో దిల్లీపై సీఎస్కేదే విజయం. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లోనూ విఫలమైన దిల్లీ ఓటములతో ఢీలా పడింది. దీంతో మరోసారి చెన్నై ఫేవరెట్‌గా కనిపించింది. కానీ విశాఖ  వేదికగా దిల్లీ గెలుపు కేక పెట్టింది. పంత్‌ ఒకప్పటిలా మెరుపులు మెరిపించగా.. వార్నర్‌ నిలకడ కొనసాగించాడు. బౌలింగ్‌లో ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌ చెలరేగారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో.. అదిరే ఆటతీరుతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఈ సీజన్లో దిల్లీ తొలి ఓటమి రుచి చూపించింది.


విశాఖపట్నం

ఐపీఎల్‌-17లో దిల్లీ క్యాపిటల్స్‌ బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకున్న ఆ జట్టు ఆదివారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై గెలిచింది. మొదట దిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. వార్నర్‌ (52; 35 బంతుల్లో 5×4, 3×6), పంత్‌ (51; 32 బంతుల్లో 4×4, 3×6), పృథ్వీ షా (43; 27 బంతుల్లో 4×4, 2×6) రాణించారు. చెన్నై బౌలర్లలో పతిరన (3/31) సత్తాచాటాడు. ఛేదనలో ముకేశ్‌ కుమార్‌ (3/21), ఖలీల్‌ అహ్మద్‌ (2/21) ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేయగలిగింది. రహానె (45; 30 బంతుల్లో 5×4, 2×6) పోరాడాడు. ధోని (37 నాటౌట్‌; 16 బంతుల్లో 4×4, 3×6) అభిమానులను అలరించాడు.
పేస్‌ దెబ్బ: భారీ లక్ష్య ఛేదనలో చెన్నైని ఆరంభంలో అహ్మద్‌, ఆఖర్లో ముకేశ్‌ దెబ్బకొట్టారు. అహ్మద్‌ వరుస ఓవర్లలో ఓపెనర్లు రుతురాజ్‌ (1), రచిన్‌ (2)ను ఔట్‌ చేసి షాకిచ్చాడు. వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ కూడా మెరుగ్గా బౌలింగ్‌ వేయడంతో చెన్నైకు పరుగులు రావడం కష్టమైంది. పవర్‌ప్లేలో 32/2తో నిలిచిన జట్టును నడిపించే బాధ్యతను రహానె, డరిల్‌ మిచెల్‌ (34) తీసుకున్నారు. రసిక్‌ బౌలింగ్‌లో చెరో సిక్సర్‌తో ఈ జోడీ వేగం పెంచాలని చూసింది. కానీ మిచెల్‌ను అక్షర్‌ (1/20) బుట్టలో వేసుకున్నాడు. ఓ ఎండ్‌లో పోరాటం కొనసాగించిన రహానెకు శివమ్‌ దూబె (18) తోడవడంతో 13 ఓవర్లలో స్కోరు 100 దాటింది. అప్పుడు బౌలింగ్‌కు వచ్చిన ముకేశ్‌ మ్యాచ్‌ను పూర్తిగా దిల్లీ వైపు తిప్పేశాడు. వరుస బంతుల్లో రహానె, సమీర్‌ రిజ్వీ (0)ను ఔట్‌ చేసిన అతను.. ఆ తర్వాత దూబేను పెవిలియన్‌ చేర్చడంతో చెన్నై పనైపోయింది. జట్టు ఓటమి ఖాయమైనా.. అభిమానులకు ధోని బ్యాటింగ్‌ చూసే అవకాశం రావడంతో స్టేడియం దద్దరిల్లింది. జడేజా (21 నాటౌట్‌)తో కలిసి ధోని ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాడు.
ఆ మెరుపులతో..: విశాఖలో టీ20ల్లో ఛేదన జట్లదే ఆధిపత్యం. కానీ పిచ్‌ చక్కగా సహకరిస్తుందని పంత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే కాస్త పచ్చికతో కూడిన పిచ్‌పై చెన్నై పేసర్లు ఆరంభంలో కట్టడి చేయడంతో 4 ఓవర్లకు దిల్లీ స్కోరు 24. కానీ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్‌తో అంతా మారిపోయింది. ఆ ఓవర్లో వరుసగా 6, 4, 4తో వార్నర్‌ విధ్వంసం మొదలెట్టగా.. ఆ వెంటనే ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న పృథ్వీ జోరందుకున్నాడు. ఈ ఇద్దరు బౌండరీల వేటలో సాగిపోయారు. కానీ పతిరన అద్భుత ఫీల్డింగ్‌, సంచలన బౌలింగ్‌తో దిల్లీకి కళ్లెం వేశాడు. పతిరన పట్టిన సూపర్‌ క్యాచ్‌కు వార్నర్‌ నిష్క్రమించాడు. పృథ్వీ కూడా వెనుదిరడగంతో 11 ఓవర్లకు దిల్లీ 104/2తో నిలిచింది. మిచెల్‌ మార్ష్‌ (18)తో పాటు స్టబ్స్‌ (0)ను ఒకే ఓవర్లో తిరుగులేని యార్కర్లతో పతిరన బౌల్డ్‌ చేయడంతో దిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో పంత్‌ నిలబడ్డాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతను లయ అందుకున్నాక చెలరేగాడు. మొదట 23 బంతుల్లో 23 పరుగులే చేసిన పంత్‌.. ఆ తర్వాత ఆడిన 9 బంతుల్లో ఏకంగా 28 పరుగులు చేశాడు. పతిరన బౌలింగ్‌లో క్రీజులో బలంగా నిలబడి, భుజాల బలాన్ని ఉపయోగించి అతను కొట్టిన సిక్సర్‌ ఆకట్టుకుంది. ఆ వెంటనే మరో రెండు ఫోర్లతో పంత్‌ అర్ధశతకం అందుకున్నాడు. కానీ వెంటనే ఔటైపోవడంతో దిల్లీ 200లోపే ఆగిపోయింది.


దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ (సి) ధోని (బి) జడేజా 43; వార్నర్‌ (సి) పతిరన (బి) ముస్తాఫిజుర్‌ 52; పంత్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరన 51; మార్ష్‌ (బి) పతిరన 18; స్టబ్స్‌ (బి) పతిరన 0; అక్షర్‌ నాటౌట్‌ 7; అభిషేక్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191; వికెట్ల పతనం: 1-93, 2-103, 3-134, 4-134, 5-178; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-42-0; తుషార్‌ 4-0-24-0; ముస్తాఫిజుర్‌ 4-0-47-1; జడేజా 4-0-43-1; పతిరన 4-0-31-3

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) పంత్‌ (బి) ఖలీల్‌ 1; రచిన్‌ (సి) స్టబ్స్‌ (బి) ఖలీల్‌ 2; రహానె (సి) వార్నర్‌ (బి) ముకేశ్‌ 45; మిచెల్‌ (సి) అండ్‌ (బి) అక్షర్‌ 34; దూబె (సి) స్టబ్స్‌ (బి) ముకేశ్‌ 18; సమీర్‌ (సి) ఖలీల్‌ (బి) ముకేశ్‌ 0; జడేజా నాటౌట్‌ 21; ధోని నాటౌట్‌ 37; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-3, 2-7, 3-75, 4-102, 5-102, 6-120; బౌలింగ్‌: ఖలీల్‌ 4-1-21-2; ఇషాంత్‌ 3-0-23-0; నోకియా 4-0-43-0; అక్షర్‌ 3-0-20-1; రసిక్‌ 2-0-25-0; మార్ష్‌ 1-0-14-0; ముకేశ్‌ 3-0-21-3

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని