ముంబయి యాజమాన్యం అలా చెప్పాల్సింది

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ను మార్చడం యాజమాన్యం ఇష్టమని, ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి అన్నాడు.

Published : 04 Apr 2024 02:44 IST

దిల్లీ: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ను మార్చడం యాజమాన్యం ఇష్టమని, ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి అన్నాడు. అయితే ఈ వ్యవహారంలో ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం ఇంకొంచెం సమన్వయంతో వ్యవహరించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘‘ఇక్కడ ఆడుతోంది భారత జట్టు కాదు. ఇది ఫ్రాంఛైజీ  క్రికెట్‌. వాళ్లు ఆటగాళ్లకు కోట్లు ఇస్తారు. వాళ్లే   యజమానులు. ఎవరిని కెప్టెన్‌గా నియమించుకోవాలో వాళ్లిష్టం. కాకపోతే కెప్టెన్‌ను మార్చే విషయంలో ఇంకొంత సమన్వయంతో వ్యవహరించాల్సింది. హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌ను చేయాలనుకున్నపుడు భవిష్యత్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, జట్టును   పునర్నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పాల్సింది. అలాగే రోహిత్‌ నాయకుడిగా గొప్ప పనితనం చూపించాడని చెబుతూ, రాబోయే మూడేళ్లలో జట్టు పురోగతి కోసం కెప్టెన్‌గా హార్దిక్‌ను నియమిస్తున్నామని అనాల్సింది. ఇలా చెప్పి ఉంటే ఇంత రభస జరిగేది కాదు. రోహిత్‌ పట్ల అన్యాయంగా వ్యవహరించారనే భావన సామాజిక మాధ్యమల్లో వ్యక్తమయ్యేది కాదు’’ అని రవిశాస్త్రి చెప్పాడు. ముంబయి గెలుపు బాటలో సాగితే.. కెప్టెన్సీ గొడవ పక్కకు వెళ్లిపోతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘‘హార్దిక్‌కు నేనిచ్చే సలహా ఏంటంటే.. అతను ప్రశాంతంగా, ఓపికగా సాగిపోవాలి. వేరే విషయాలు పట్టించుకోకుండా ఆట మీద దృష్టిసారించాలి. ముంబయి బలమైన జట్టు. వాళ్లు ఒక్కసారి గాడిన పడి మూణ్నాలుగు మ్యాచ్‌లు గెలిచారంటే అంతా సద్దుమణుగుతుంది’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని