Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌ గెలవాలనుంది

ఆటకు ఇప్పుడే వీడ్కోలు పలికే ఆలోచన లేదని, వన్డే ప్రపంచకప్‌ గెలవాలని కోరుకుంటున్నానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుందని అతను చెప్పకనే చెప్పాడు.

Updated : 13 Apr 2024 09:44 IST

రిటైర్మెంట్‌ ఆలోచన లేదన్న రోహిత్‌

దిల్లీ: ఆటకు ఇప్పుడే వీడ్కోలు పలికే ఆలోచన లేదని, వన్డే ప్రపంచకప్‌ గెలవాలని కోరుకుంటున్నానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుందని అతను చెప్పకనే చెప్పాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోహిత్‌.. వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేకపోయాడు. ‘‘రిటైర్మెంట్‌ గురించి ఆలోచించడం లేదు. కానీ జీవితం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ప్రస్తుతం ఉత్తమంగానే ఆడుతున్నా. మరి కొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగాలనుకుంటున్నా. ఆ ప్రపంచకప్‌ గెలవాలనుంది. 50 ఓవర్లదే అసలైన ప్రపంచకప్‌. ఈ ప్రపంచకప్‌నే చూస్తూ పెరిగాం. 2025లో లార్డ్స్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరుగుతుంది. అక్కడి వరకూ వెళ్తామనే నమ్మకంతో ఉన్నా’’ అని ఓ యూట్యూబ్ షోలో రోహిత్‌ తెలిపాడు. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ సారథ్యంలోని భారత్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.

‘‘అది (వన్డే ప్రపంచకప్‌) భారత్‌లో జరిగింది. ఆ ఫైనల్‌ వరకూ మేం మెరుగ్గా ఆడాం. సెమీస్‌ గెలిచినప్పుడు కప్‌నకు మరో అడుగు దూరంలోనే ఉన్నామని అనుకున్నా. నిజంగా చెప్పాలంటే ఆ ఫైనల్లో మా ఓటమికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. అందరికీ ఓ చెడు రోజంటూ ఉంటుంది. మంచి క్రికెట్‌ ఆడినా, ఆత్మవిశ్వాసంతోనే ఉన్నా ఆ ఫైనల్‌ మనది కాని ఓ రోజుగా మిగిలిపోయింది. ఆసీస్‌కు మంచి రోజుగా నిలిచిపోయింది’’ అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు. ఈ ఏడాది సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను రోహిత్‌ సేన 4-1తో సొంతం చేసుకున్న విషయం విదితమే. ‘‘ఇటీవల ఇంగ్లాండ్‌తో ఆడినప్పుడు విభిన్నమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్నాం. వాళ్లు క్రికెట్‌ను భిన్నంగా ఆడారు. ప్రతి బ్యాటర్‌ మాకు సవాలు విసిరాడు. అందుకు తగ్గట్లుగా మా మానసిక దృక్పథాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. విదేశాల్లో గెలవడం కష్టమే. అలాగే విదేశీ జట్లకూ భారత్‌లో అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. సొంతగడ్డ ప్రయోజనాన్ని పొందాల్సిందే’’ అని రోహిత్‌ వివరించాడు. కోల్‌కతాలో వెస్టిండీస్‌పై ఆరో స్థానంలో వచ్చి చేసిన సెంచరీ (177) టెస్టులో తనకిష్టమైన సందర్భమని అతను పేర్కొన్నాడు. తన వీడ్కోలు సిరీస్‌లో సచిన్‌కు అది 199వ టెస్టు.

ప్రతి జట్టు బలమైందే: ఐపీఎల్‌లో ప్రతి జట్టు బలమైందేనని ముంబయి ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘గత దశాబ్దంలో ఐపీఎల్‌ ఎంతో పురోగతి సాధించింది. ప్రతి జట్టు తీవ్రమైన పోటీనిస్తోంది. ఐపీఎల్‌లో బలహీనమైన జట్టేది లేదనే అనుకుంటున్నా. ఏ జట్టు దేన్నైనా ఓడించే ఈపీఎల్‌ (ఇంగ్లిష్‌ ప్రిమియర్‌ లీగ్‌- ఫుట్‌బాల్‌) ఫస్ట్‌ డివిజన్‌ టోర్నీలా ఐపీఎల్‌ మారింది. కానీ ఆరంభంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి సరైన ఆటగాళ్లను జట్లు తీసుకుంటున్నాయి’’ అని రోహిత్‌ చెప్పాడు. ‘‘నేను డెక్కన్‌ ఛార్జర్స్‌కు ఆడుతూ రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా అప్పుడు ఉన్న దివంగత షేన్‌వార్న్‌ను ఎదుర్కొన్నా. ఆయనది అద్భుతమైన క్రికెట్‌ బుర్ర. క్రికెట్‌ గురించి విభిన్న కోణాల్లో ఆలోచించేవాడు. అప్పటి సహచరుడైన గిల్‌క్రిస్ట్‌.. వార్న్‌ ఎంతటి ఉత్తమ ఆటగాడో నాకు చెప్పేవాడు. వ్యాఖ్యతగా వార్న్‌ ఉన్నప్పుడు తర్వాతి రెండు లేదా మూడు బంతుల్లో ఏం జరుగుతుందో అంచనా వేసేవాడు’’ అని రోహిత్‌ గుర్తు చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని