కుల్‌దీప్‌ మాయ.. కుర్రాడి మెరుపులు

మొదట 160కి పైగా పరుగులు చేస్తే చాలు.. ఐపీఎల్‌లో ఓడిపోని చరిత్ర లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ది. దిల్లీతో పోరులో ఆయుష్‌ బదోని అద్భుత పోరాటంతో ఆ జట్టు 167 పరుగులు చేసింది.

Updated : 13 Apr 2024 04:25 IST

దిల్లీకి రెండో విజయం
సొంతగడ్డపై లఖ్‌నవూకు చెక్‌
బదోని పోరాటం వృథా

మొదట 160కి పైగా పరుగులు చేస్తే చాలు.. ఐపీఎల్‌లో ఓడిపోని చరిత్ర లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ది. దిల్లీతో పోరులో ఆయుష్‌ బదోని అద్భుత పోరాటంతో ఆ జట్టు 167 పరుగులు చేసింది. ఇంకేముంది.. బలమైన బౌలింగ్‌ దళంతో మరోసారి ప్రత్యర్థిని చుట్టేస్తుందనే అంచనా కలిగింది. కానీ దిల్లీ అదరగొట్టింది. లఖ్‌నవూ జోరుకు కళ్లెం వేసింది. అరంగేట్ర ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌తో పాటు కెప్టెన్‌ పంత్‌ కూడా చెలరేగడంతో లఖ్‌నవూను ఓడించిన డీసీ.. రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

లఖ్‌నవూ

ఐపీఎల్‌- 17లో వరుస ఓటముల నుంచి దిల్లీ క్యాపిటల్స్‌ బయటపడింది. శుక్రవారం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. మొదట లఖ్‌నవూ 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (3/20) స్పిన్‌ వలలో చిక్కుకున్న ఆ జట్టును ఆయుష్‌ బదోని (55 నాటౌట్‌; 35 బంతుల్లో 5×4, 1×6) ఆదుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌ (39; 22 బంతుల్లో 5×4, 1×6) కూడా రాణించాడు. తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా కుర్రాడు జేక్‌ ఫ్రేజర్‌ (55; 35 బంతుల్లో 2×4, 5×6), పంత్‌ (41; 24 బంతుల్లో 4×4, 2×6) చెలరేగడంతో దిల్లీ 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (2/25) ఆకట్టుకున్నాడు.

కొత్త కుర్రాడి మెరుపులు: ఛేదనలో దిల్లీకి కావాల్సిన ఆరంభం దొరికింది. వార్నర్‌ (8) బంతిని వికెట్ల మీదకు ఆడి నిష్క్రమించినా.. ఫ్రేజర్‌తో కలిసి పృథ్వీ (32) జట్టును నడిపించాడు. ఫ్రేజర్‌ సిక్సర్లతో చెలరేగగా.. పృథ్వీ చూడముచ్చటైన షాట్లతో ఫోర్లు రాబట్టాడు. దీంతో ఆరు ఓవర్లకు 62/1తో దిల్లీ మెరుగ్గా కనిపించింది. కానీ తర్వాతి ఓవర్లోనే బంతి అందుకున్న బిష్ణోయ్‌.. పృథ్వీని బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని పృథ్వీ స్లాగ్‌స్వీప్‌ ఆడగా డీప్‌ మిడ్‌వికెట్‌లో ముందుకు డైవ్‌ చేస్తూ పూరన్‌ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. దీని తర్వాత పరుగుల వేగం పడిపోయింది. బౌండరీల సంగతి పక్కనపెడితే సింగిల్సూ కష్టంగా వచ్చాయి. టైమింగ్‌ కుదరక పంత్‌ ఇబ్బంది పడ్డాడు. ఒత్తిడి పెరగడంతో ఫ్రేజర్‌ కూడా బంతులను వృథా చేశాడు. 29 బంతుల పాటు ఒక్క బౌండరీ రాలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పంత్‌ గేరు మార్చాడు. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4తో ఇన్నింగ్స్‌కు తిరిగి ఊపు తెచ్చాడు. స్టాయినిస్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌తో పంత్‌ కొట్టిన ఫోర్‌ ఆకట్టుకుంది. 12 ఓవర్లకు స్కోరు 100కు చేరింది. తానేం తక్కువ కాదన్నట్లు కృనాల్‌కు వరుసగా మూడు సిక్సర్లతో ఫ్రేజర్‌ చుక్కలు చూపించడంతో మ్యాచ్‌ దిల్లీ వైపు మొగ్గింది. 21 పరుగుల ఈ ఓవరే కీలక మలుపు. దీంతో సాధించాల్సిన రన్‌రేట్‌ అందుబాటులోకి వచ్చింది. ఫ్రేజర్‌ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. పంత్‌ తనదైన శైలిలో సిక్సర్లతో సాగిపోయాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 77 పరుగులు జతచేసింది. కానీ వరుస ఓవర్లలో ఫ్రేజర్‌, పంత్‌ ఔట్‌ కావడంతో ఆఖర్లో ఉత్కంఠ తప్పదేమో అనిపించింది. కానీ ఎలాంటి నాటకీయతకు తావులేకుండా స్టబ్స్‌ (15 నాటౌట్‌), హోప్‌ (11 నాటౌట్‌) పని పూర్తిచేశారు. స్టబ్స్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించాడు.

ఆదుకున్న ఆయుష్‌: 57/2.. పవర్‌ప్లేలో లఖ్‌నవూ స్కోరిది. ఆ జట్టు అలవోకగా 180కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ కుల్‌దీప్‌ దెబ్బకు 13 ఓవర్లలో 94/7తో కష్టాల్లో జట్టు. అప్పుడు 120 చేసినా గొప్పే అనిపించింది. కానీ చివరకు 160కి పైగా పరుగులతో ముగించింది. అందుకు కారణం ఆయుష్‌ పోరాటం. మొదట కేఎల్‌ రాహుల్‌ దూకుడు ప్రదర్శించాడు. సాధారణంగా నెమ్మదిగా బ్యాటింగ్‌ ప్రారంభించి, క్రమంగా జోరందుకునే అతను.. ఈ మ్యాచ్‌లో మాత్రం మొదటి నుంచే ఎదురుదాడికి దిగాడు. ఖలీల్‌ (2/41) తన వరుస ఓవర్లలో డికాక్‌ (19), దేవ్‌దత్‌ (3)ను వెనక్కిపంపినా.. కేఎల్‌ మెరుపులతో లఖ్‌నవూ సాగిపోయింది. కానీ ఎప్పుడైతే కుల్‌దీప్‌ బంతి అందుకున్నాడో అప్పుడే లఖ్‌నవూ పరిస్థితి తలకిందులైంది. గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఈ మణికట్టు మాంత్రికుడు తిరిగి వస్తూనే ప్రత్యర్థికి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ప్రమాదకర స్టాయినిస్‌ (8), పూరన్‌ (0)ను వరుస బంతుల్లో ఔట్‌ చేసి లఖ్‌నవూ నడ్డివిరిచాడు. మిడిల్‌ స్టంప్‌పై పడ్డ బంతి అవతలకు తిరుగుతుందేమో అనుకుని పూరన్‌ బయటకు ఆడాడు. కానీ అది నేరుగా వెళ్లి స్టంప్స్‌ను ఎగరేసింది. తన తర్వాతి ఓవర్లో రాహుల్‌నూ కుల్‌దీప్‌ బుట్టలో వేసుకున్నాడు. వికెట్ల పతనం కొనసాగడంతో లఖ్‌నవూకు కష్టమే అనిపించింది. కానీ ఆయుష్‌ అనూహ్యంగా చెలరేగాడు. వరుసగా విఫలమవుతున్నా అవకాశాలిస్తూ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ గొప్పగా పోరాడాడు. ఈ దశలో బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో వైఫల్యంతో దిల్లీ పట్టు విడవడమూ ఆయుష్‌కు కలిసొచ్చింది. ఈ కుర్రాడు క్రీజులో సౌకర్యంగా కదులుతూ షాట్లు కొట్టాడు. పుల్‌ షాట్‌ను ఉత్తమంగా ఆడాడు. పేసర్లు ఖలీల్‌, ముకేశ్‌ (1/41)ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 31 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. పేసర్‌ అర్షద్‌ ఖాన్‌ (20 నాటౌట్‌) కూడా క్రీజులో పట్టుదలతో నిలిచాడు. ఈ జోడీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 42 బంతుల్లోనే 73 పరుగులు జతచేసింది. చివరి 3 ఓవర్లలో లఖ్‌నవూ 39 పరుగులు పిండుకోవడంతో స్కోరు 170కి చేరువైంది.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: డికాక్‌ ఎల్బీ (బి) ఖలీల్‌ 19; కేఎల్‌ రాహుల్‌ (సి) పంత్‌ (బి) కుల్‌దీప్‌ 39; పడిక్కల్‌ ఎల్బీ (బి) ఖలీల్‌ 3; స్టాయినిస్‌ (సి) ఇషాంత్‌ (బి) కుల్‌దీప్‌ 8; పూరన్‌ (బి) కుల్‌దీప్‌ 0; దీపక్‌ హుడా (సి) వార్నర్‌ (బి) ఇషాంత్‌ 10; బదోని నాటౌట్‌ 55; కృనాల్‌ (సి) పంత్‌ (బి) ముకేశ్‌ 3; అర్షద్‌ నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167  
వికెట్ల పతనం: 1-28, 2-41, 3-66, 4-66, 5-77, 6-89, 7-94; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-41-2; ఇషాంత్‌ 4-0-36-1; ముకేశ్‌ కుమార్‌ 4-0-41-1; అక్షర్‌ 4-0-26-0; కుల్‌దీప్‌ 4-0-20-3
దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) పూరన్‌ (బి) బిష్ణోయ్‌ 32; వార్నర్‌ (బి) యశ్‌ ఠాకూర్‌ 8; జేక్‌ ఫ్రేజర్‌ (సి) అర్షద్‌ (బి) నవీనుల్‌ 55; పంత్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 41; స్టబ్స్‌ నాటౌట్‌ 15; హోప్‌ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 170  
వికెట్ల పతనం: 1-24, 2-63, 3-140, 4-146; బౌలింగ్‌: అర్షద్‌ ఖాన్‌ 3.1-0-34-0; నవీనుల్‌ హక్‌ 3-0-24-1; యశ్‌ ఠాకూర్‌ 4-0-31-1; కృనాల్‌ 3-0-45-0; రవి బిష్ణోయ్‌ 4-0-25-2; స్టాయినిస్‌ 1-0-10-0

73  

ఈ మ్యాచ్‌లో బదోని, అర్షద్‌ జతచేసిన పరుగులు. ఐపీఎల్‌ చరిత్రలో ఎనిమిదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. గత రికార్డు (2014లో రాజస్థాన్‌ తరపున బ్రాడ్‌హాడ్జ్‌, ఫాల్క్‌నర్‌ కలిసి 69) బద్దలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని