ఈ కుర్రాడికి దూకుడెక్కువ

ప్రతిష్ఠాత్మక ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ అంటే ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. పైగా బౌలింగ్‌తో హడలెత్తించే ప్రత్యర్థి. 160కి పైగా లక్ష్యాలను కాపాడుకోవడంలో ఆ జట్టుకు తిరుగులేదు. కానీ గురువారమే 22వ పడిలోకి అడుగుపెట్టిన ఆ కుర్రాడు బెదరలేదు.

Updated : 14 Apr 2024 07:46 IST

ప్రతిష్ఠాత్మక ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ అంటే ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. పైగా బౌలింగ్‌తో హడలెత్తించే ప్రత్యర్థి. 160కి పైగా లక్ష్యాలను కాపాడుకోవడంలో ఆ జట్టుకు తిరుగులేదు. కానీ గురువారమే 22వ పడిలోకి అడుగుపెట్టిన ఆ కుర్రాడు బెదరలేదు. దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అర్ధసెంచరీతో జట్టుకు అత్యంత అవసరమైన విజయాన్ని అందించాడు. అతనే.. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌. లఖ్‌నవూపై చెలరేగిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాడు.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 55 పరుగులు చేసిన ఫ్రేజర్‌.. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ రెండో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. వార్నర్‌ ఔట్‌ కాగానే క్రీజులోకి అడుగుపెట్టిన అతను.. రెండో బంతికే సిక్సర్‌ కొట్టి దూకుడు ప్రదర్శించాడు. కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లతో హడలెత్తించాడు. మొత్తం మీద 2 ఫోర్లు, 5 సిక్సర్లతో సత్తాచాటాడు. జట్టు గెలుపు ఖాయం చేసి పెవిలియన్‌ చేరాడు. ఐపీఎల్‌ అరంగేట్రంలోనే ఇలాంటి ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. నిజానికి ఐపీఎల్‌ వేలంలో ఫ్రేజర్‌ అమ్ముడుపోలేదు. లుంగి ఎంగిడి గాయం అతనికి వరంగా మారింది. అతని స్థానంలో దిల్లీ జట్టులోకి వచ్చిన అతనికి వెంటనే మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. వరుస పరాజయాల నుంచి బయటపడేందుకు బ్యాటింగ్‌ బలోపేతంపై దృష్టిసారించిన దిల్లీ.. ఈ సీజన్‌లో తన ఆరో మ్యాచ్‌లో జేక్‌కు ఛాన్స్‌ ఇచ్చింది. దీన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్న అతను ఉత్తమ బ్యాటింగ్‌ నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ సూచనలతో ఫ్రేజర్‌ సత్తాచాటాడు.

ఆ రికార్డుతో: విక్టోరియాకు చెందిన జేక్‌ ఫ్రేజర్‌ తొమ్మిదేళ్ల వయసులోనే క్రికెట్‌ కెరీర్‌ మొదలెట్టాడు. అలవోకగా భారీ షాట్లు ఆడే ఆటగాడిగా ఎదిగాడు. 17 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌- ఎ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతను.. ఈ రెండు ఫార్మాట్లోనూ తొలి మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో మెరిశాడు. 2020 అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో తలపడ్డ ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. కానీ జట్టుతో కలిసి విహారానికి వెళ్లినప్పుడు కోతి గీరడంతో అతను దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం వెళ్లాల్సి వచ్చింది. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌కు ఆడుతున్న అతను.. ఇప్పటివరకూ 32 ఇన్నింగ్స్‌ల్లో 536 పరుగులు చేశాడు. 2023 అక్టోబర్‌లో మార్ష్‌కప్‌లో దక్షిణ ఆస్ట్రేలియాకు ఆడిన అతను టాస్మేనియాపై 29 బంతుల్లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో లిస్ట్‌-ఎ క్రికెట్లో శతకం చేసిన ఆటగాడిగా ఏబీ డివిలియర్స్‌ (31 బంతులు) రికార్డును ఫ్రేజర్‌ తిరగరాశాడు. దీంతో అతని పేరు మార్మోగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌తో అతను ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్‌ కంటే ముందు ఐఎల్‌టీ20 లీగ్‌లో ఆడిన ఫ్రేసర్‌ 3 ఇన్నింగ్స్‌ల్లో 213.72 స్ట్రైక్‌రేట్‌తో 109 పరుగులు చేశాడు.

ఈనాడు, క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు