రోహిత్‌ శతక్కొట్టినా.. ముంబయిపై చెన్నైదే విజయం

124/2.. 207  పరుగుల ఛేదనలో 13 ఓవర్లకు ముంబయి స్కోరిది. 7 ఓవర్లలో 83 పరుగులు చేస్తే ఆ జట్టుదే విజయం. రోహిత్‌ జోరుమీదున్నాడు.

Updated : 15 Apr 2024 06:56 IST

విజృంభించిన పతిరన
మెరిసిన రుతురాజ్‌, దూబె

 124/2.. 207  పరుగుల ఛేదనలో 13 ఓవర్లకు ముంబయి స్కోరిది. 7 ఓవర్లలో 83 పరుగులు చేస్తే ఆ జట్టుదే విజయం. రోహిత్‌ జోరుమీదున్నాడు. తిలక్‌ కూడా చక్కగా ఆడుతున్నాడు. ఇంకా హార్దిక్‌, డేవిడ్‌, షెఫర్డ్‌, నబి రావాల్సి ఉంది. ముంబయిదే గెలుపు అనే అంచనాలు. కానీ చెన్నై మాయ చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సత్తాచాటింది. ముఖ్యంగా పతిరన అదరగొట్టాడు. రోహిత్‌ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య పోరులో చెన్నైదే పైచేయి. హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబయి మళ్లీ ఓడింది.

ముంబయి

ఐపీఎల్‌-17లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు నాలుగో విజయం. ఆదివారం ఆ జట్టు 20 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై గెలిచింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (69; 40 బంతుల్లో 5×4, 5×6), శివమ్‌ దూబె (66 నాటౌట్‌; 38 బంతుల్లో 10×4, 2×6) అదరగొట్టారు. ధోని (20 నాటౌట్‌; 4 బంతుల్లో 3×6) సిక్సర్లతో చెలరేగాడు. హార్దిక్‌ రెండు వికెట్లు తీశాడు. బుమ్రా (0/27), నబి (0/19) పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసింది. రోహిత్‌ శర్మ (105 నాటౌట్‌; 63 బంతుల్లో 11×4, 5×6) వీరోచిత పోరాటం వృథా అయింది. పతిరన (4/28) ముంబయిని దెబ్బకొట్టాడు.

రోహిత్‌ పోరాడినా..: భారీ లక్ష్య ఛేదనలో ముంబయికి కావాల్సిన ఆరంభమే దక్కింది. ఓపెనర్లు రోహిత్‌, ఇషాన్‌ (23) మొదటి నుంచే ఎదురు దాడికి దిగారు. ముఖ్యంగా రోహిత్‌ అసలు తగ్గలేదు. 7 ఓవర్లకు స్కోరు 70/0. కానీ ముంబయిని దెబ్బకొట్టేందుకు వచ్చిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పతిరన.. ఒకే ఓవర్లో ఇషాన్‌, సూర్యకుమార్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. సూర్య క్యాచ్‌ను పట్టిన ముస్తాఫిజుర్‌ నియంత్రణ కోల్పోతున్నానని తెలిసి బంతిని గాల్లోకి విసిరి, బౌండరీ బయటికి వెళ్లి వచ్చి మళ్లీ అందుకున్నాడు. వికెట్లు పడ్డా రోహిత్‌ నెమ్మదించలేదు. తిలక్‌తో కలిసి వేగాన్ని కొనసాగించాడు. జడేజా బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌తో రోహిత్‌ కొట్టిన ఫోర్‌ ఆకట్టుకుంది. ఆ వెంటనే అతను గాల్లోకి లేపిన బంతి తుషార్‌ చేతుల్లో నుంచి ఎగిరి బౌండరీ బయట పడింది. రోహిత్‌, తిలక్‌ చక్కగా ఆడుతుండటంతో ముంబయికి ఇబ్బంది లేదనిపించింది. కానీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన పతిరన.. 14వ ఓవర్లో తిలక్‌ను ఔట్‌ చేశాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. 18వ ఓవర్లో పతిరన 6 పరుగులే ఇచ్చి షెఫర్డ్‌ (1)ను బౌల్డ్‌ చేశాడు. 6 బంతుల్లో 34 పరుగులు కావాల్సి ఉండగా.. చివరి ఓవర్లో పతిరన తొలి బంతికి పరుగులేమీ ఇవ్వకపోవడంతో ముంబయి పనైపోయింది. రోహిత్‌ సెంచరీతో ముంబయి అభిమానులు కాస్త ఊరట పొందారు.

ఆ ఇద్దరు నిలబెడితే.. ధోని ముగించాడు: 24/1.. నాలుగు ఓవర్లకు సీఎస్కే స్కోరు. రుతురాజ్‌ పవర్‌ప్లేలో నెమ్మదిగా ఆడుతున్నాడని రహానె (5)ను ఓపెనర్‌గా పంపించగా.. ఈ ప్రయోగం బెడిసికొట్టింది. మూడో స్థానంలో వచ్చిన రుతురాజ్‌ ఈ సారి దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లేను సీఎస్కే 48/1తో ముగించింది. రచిన్‌ (21) ఔటైనా.. దూబె సూపర్‌ ఫామ్‌ కొనసాగించడం, రుతురాజ్‌ జోరందుకోవడంతో ముంబయికి ఆనందం లేకుండాపోయింది. బుమ్రాను జాగ్రత్తగా ఆడిన వీళ్లు మిగతా బౌలర్లను లెక్కచేయలేదు. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూబె చెలరేగుతాడని పేసర్లతోనే బౌలింగ్‌ కొనసాగించినా అతను ఆగలేదు. రుతురాజ్‌ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను రోహిత్‌ పట్టలేకపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రుతురాజ్‌ లాఫ్టెడ్‌ షాట్‌ సిక్సర్‌తో అర్ధశతకం అందుకున్నాడు. ఇక దూబె షెఫర్డ్‌ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదేశాడు. మూడో వికెట్‌కు 90 పరుగులు జతచేసిన ఈ జోడీని హార్దిక్‌ విడదీశాడు. దూబె బాదుడు కొనసాగించినా.. మిచెల్‌ (17) వేగం అందుకోకపోవడంతో 19 ఓవర్లకు 180/3తో నిలిచిన చెన్నై 200 పరుగులు చేస్తుందా అనిపించింది. కానీ హార్దిక్‌ వేసిన ఆఖరి ఓవర్‌ రెండో బంతికి మిచెల్‌ ఔటవడంతో.. కేరింతలతో హోరెత్తిన స్టేడియంలో క్రీజులోకి వచ్చిన ధోని అదరగొట్టాడు. వరుసగా లాంగాఫ్‌, లాంగాన్‌, స్క్వేర్‌లెగ్‌ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి పంపించిన అతను స్కోరును 200 దాటించాడు.

చెన్నై ఇన్నింగ్స్‌: రహానె (సి) హార్దిక్‌ (బి) కొయెట్జీ 5; రచిన్‌ (సి) ఇషాన్‌ (బి) గోపాల్‌ 21; రుతురాజ్‌ (సి) నబి (బి) హార్దిక్‌ 69; దూబె నాటౌట్‌ 66; మిచెల్‌ (సి) నబి (బి) హార్దిక్‌ 17; ధోని నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206; వికెట్ల పతనం: 1-8, 2-60, 3-150, 4-186; బౌలింగ్‌: నబి 3-0-19-0; కొయెట్జీ 4-0-35-1; బుమ్రా 4-0-27-0; ఆకాశ్‌ 3-0-37-0; గోపాల్‌ 1-0-9-1; హార్దిక్‌ 3-0-43-2; షెఫర్డ్‌ 2-0-33-0

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ నాటౌట్‌ 105; ఇషాన్‌ (సి) శార్దూల్‌ (బి) పతిరన 23; సూర్యకుమార్‌ (సి) ముస్తాఫిజుర్‌ (బి) పతిరన 0; తిలక్‌ (సి) శార్దూల్‌ (బి) పతిరన 31; హార్దిక్‌ (సి) జడేజా (బి) తుషార్‌ 2; డేవిడ్‌ (సి) రచిన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 13; షెఫర్డ్‌ (బి) పతిరన 1; నబి నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 186; వికెట్ల పతనం: 1-70, 2-70, 3-130, 4-134, 5-148, 6-157; బౌలింగ్‌: తుషార్‌ దేశ్‌పాండే 4-0-29-1; ముస్తాఫిజుర్‌ 4-0-55-1; శార్దూల్‌ 4-0-35-0; జడేజా 4-0-37-0; పతిరన 4-0-28-4


3 బంతుల్లో 3 సిక్సర్లు

ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎక్కడ మ్యాచ్‌ ఆడినా పసుపు రంగు జెర్సీలతో స్టాండ్స్‌ నిండిపోతున్నాయి. ధోని కూడా ఆడిన కాసేపూ అభిమానులను అలరిస్తున్నాడు. ఆదివారం కూడా అతను వాంఖడె స్టేడియాన్ని హోరెత్తించాడు. ముంబయితో మ్యాచ్‌ ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన మహి.. వరుసగా మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టడంతో స్టేడియం ఊగిపోయింది. కాలి నొప్పితోనే బ్యాటింగ్‌ చేసిన ధోని.. ఫినిషర్‌ పాత్రకు ఎప్పటిలాగే న్యాయం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని