జ్యోతి వెలిగింది.. పారిస్‌ మురిసింది

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్‌కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్‌లో ఈ మెగా ఈవెంట్‌ జరగబోతోంది.

Updated : 17 Apr 2024 04:06 IST

ఇంకో వంద రోజులో ఒలింపిక్స్‌
గ్రీస్‌ 

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్‌కు సమయం దగ్గర పడుతోంది. సరిగ్గా ఇంకో వంద రోజుల్లోనే పారిస్‌లో ఈ మెగా ఈవెంట్‌ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ పుట్టిల్లు గ్రీస్‌లో మంగళవారం ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి వచ్చిన వేలమంది క్రీడాభిమానుల సమక్షంలో పురాతన ఒలింపియా ప్రాంతంలో ఈ వేడుక జరిగింది. అయితే జ్యోతి ప్రజ్వలన సంప్రదాయ రీతిలో మాత్రం నిర్వహించడానికి అవకాశం లేకపోయింది. గ్రీకు ప్రజలు దేవుడిగా ఆరాధించే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల సాయంతో జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. కిరణాలు ఓ అద్దం మీద పడితే దాని ద్వారా జ్యోతి అంటుకుంటుంది. అయితే మంగళవారం వాతావరణం మబ్బులు కమ్మి ఉండడంతో జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన సమయానికి సూర్య కిరణాలు పడలేదు. దీంతో ముందు రోజు రిహార్సల్స్‌ భాగంగా సూర్య కిరణాల సాయంతోనే వెలిగించిన మరో జ్యోతి సాయంతో ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఫ్రెంచ్‌ నటి మేరి మిన జ్యోతిని వెలిగించి టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత అయిన గ్రీస్‌ రోయర్‌ స్టెఫనోస్‌ డౌస్కోస్‌కు అందించింది. అతను కౌబెర్టిన్‌ ప్రాంతానికి చేరుకోగా.. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన స్విమ్మర్‌ లారి మనౌదౌ జ్యోతిని అందుకుంది. ఆమె తర్వాత యూరోపియన్‌ యూనియన్‌ అధికారి మార్గరిటిస్‌ షినాస్‌కు జ్యోతిని అందించింది. ఒలింపిక్‌ జ్యోతి గ్రీస్‌లో 5 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మంగళవారం మొదలైన ఈ యాత్ర ఈ నెల 26న ఏథెన్స్‌కు చేరుకుంటుంది. అక్కడ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు జ్యోతిని అందజేస్తారు.


ఈసారి సందడే సందడి

టోక్యో క్రీడలు అభిమానుల కోణంలో అత్యంత నిరాశాజనక ఒలింపిక్స్‌గా నిలిచాయి. కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్‌ను ఏడాది వాయిదా వేసి 2021లో నిర్వహించారు. అప్పుడు కూడా అనేక ఆంక్షలు తప్పలేదు. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించలేదు. అథ్లెట్లకు తోడుగా వచ్చే కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది విషయంలోనూ పరిమితి విధించారు. దీంతో అభిమానులు, సన్నిహితుల ప్రోత్సాహం లేకుండా నిరాశాజనక వాతావరణంలో పోటీ పడ్డ అథ్లెట్లు కూడా పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. గతంతో పోలిస్తే బద్దలైన రికార్డులు తక్కువే. మొత్తంగా కరోనా కారణంగా ఒలింపిక్స్‌ చాలా స్తబ్దుగా సాగిపోయాయి. ఈసారి ఆ మహమ్మారి ఊసే లేదు. ఎప్పట్లా ఒలింపిక్స్‌ అభిమానుల కోలాహలం మధ్య సాగబోతున్నాయి. అథ్లెట్లకు ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి స్వేచ్ఛగా క్రీడల్లో పోటీ పడబోతున్నారు.


ఈ జ్యోతి ప్రత్యేకం

ఈసారి వినియోగిస్తున్న ఒలింపిక్‌ జ్యోతి చాలా భిన్నమైంది. ఆకృతి సహా అన్ని విషయాల్లోనూ ఇది ప్రత్యేకమే. పారిస్‌కు తలమానికమైన ఈఫిల్‌ టవర్‌ నీటి ప్రతిబింబం ఆకృతిలో దీన్ని తయారు చేయడం విశేషం. సెన్‌ నదిలో టవర్‌ ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అదే తరహాలో దీన్ని రూపొందించారు. ఫ్రెంచ్‌ డిజైనర్‌ మాథ్యూస్‌ లెహన్యూర్‌ దీని సృష్టికర్త. జ్యోతి ఇతివృత్తం.. ప్రపంచ శాంతి. గత జ్యోతులతో పోలిస్తే దీని పరిమాణం తక్కువ. ఆకృతి కూడా భిన్నమే. మామూలుగా జ్యోతి ‘వి’ ఆకృతిలో కింద సన్నగా ఉండి, పైకి వెళ్లే కొద్దీ వెడల్పుగా మారుతుంది. కానీ ఈసారి మాత్రం జ్యోతి మధ్యలో వెడల్పుగా ఉండి.. ఇరు వైపులా వెడల్పు తగ్గుతూ వెళ్తుంది. రెండు విడి ముక్కల్ని అతికించినట్లు దీన్ని రూపొందించారు. జ్యోతి పొడవు 70 సెంటీమీటర్లు, బరువు 1.5 కేజీలు.


డీజే సంగీతానికి బ్రేక్‌ డ్యాన్స్‌ చేస్తూ..

ఈసారి ఒలింపిక్స్‌లో ఓ కొత్త క్రీడను చూడబోతున్నాం. అదే.. బ్రేకింగ్‌. ఇది బ్రేక్‌ డ్యాన్స్‌తో ముడిపడ్డ క్రీడ కావడం విశేషం. డీజే మ్యూజిక్‌ వినిపిస్తుంటే.. చిత్రమైన నృత్య విన్యాసాలు చేస్తారు క్రీడాకారులు. చేతులు కింద పెట్టి కాళ్లు పైకి లేపి సంగీతానికి తగ్గట్లు ఒంటిని రకరకాలుగా వంచడం.. మధ్య మధ్యలో నిశ్చలంగా ఉండడం లాంటి విన్యాసాలు చేస్తారు ఈ క్రీడలో. బృందాలుగా తలపడే ఈ క్రీడలో పురుషులకు, మహిళలకు ఒక్కో ఈవెంట్‌ ఉంటుంది. ఇది ఒలింపిక్స్‌లో తొలిసారి చూడబోయే క్రీడ కాగా.. సర్ఫింగ్‌, స్పోర్ట్‌ క్లైంబింగ్‌, స్కేట్‌ బోర్డింగ్‌ మెగా ఈవెంట్లోకి పునరాగమనం చేస్తున్నాయి. టోక్యోలో పునరాగమనం చేసిన కరాటె క్రీడను ఈసారి ఒలింపిక్స్‌ నుంచి తప్పించారు. ఇక ఎప్పటికీ ఈ మెగా క్రీడల్లో కరాటె ఉండదు.

3 ఒలింపిక్స్‌కు మూడు పర్యాయాలు ఆతిథ్యమిస్తున్న రెండో నగరంగా పారిస్‌ నిలవనుంది. ఇంతకుముందు 1900లో, 1924లో ఇక్కడ ఒలింపిక్స్‌ జరిగాయి. లండన్‌ సైతం మూడుసార్లు (1908, 1948, 2012) ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు