ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్‌

భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ ఆడలేకపోయిన బట్లర్‌..

Published : 18 Apr 2024 02:16 IST

కోల్‌కతా: భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ ఆడలేకపోయిన బట్లర్‌.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోరులో నొప్పిని భరిస్తూనే అద్భుతంగా పోరాడి రికార్డు లక్ష్య ఛేదనతో అదరగొట్టాడు. ‘‘నమ్మకంతో ఉండాలి. ప్రస్తుత క్రికెట్లో అదే అత్యంత కీలకం. లయ కోసం కొంచెం ఇబ్బందిపడ్డా. అలాంటి సమయంలో నిరాశకు గురవుతాం. మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. ఏం ఫర్వాలేదు.. ప్రశాంతంగా ఉంటే లయను అందుకోవచ్చని నాకు నేను చెప్పుకుంటా. ఐపీఎల్‌లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ధోని, కోహ్లి లాంటి ఆటగాళ్లు ఎంతో నమ్మకంతో చివరి వరకు క్రీజులో ఉంటారు. వారినే అనుకరించేందుకు ప్రయత్నించా. ఇప్పటి వరకు నేను ఆడిన ఇన్నింగ్స్‌లలో ఇదే అత్యుత్తమం’’ అని బట్లర్‌ తెలిపాడు.


ఒలింపిక్స్‌ దిశగా సిద్ధమవుతోన్న భారత అథ్లెట్లు

దిల్లీ: మరో వంద రోజుల్లో ప్రతిష్ఠాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభం కానున్నాయి. ఈ మెగా క్రీడల్లో మెరుగైన ప్రదర్శనపై కన్నేసిన భారత్‌ ఆ దిశగా సన్నద్ధమవుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మన అథ్లెట్లు.. ఈ సారి ఆ రికార్డును తిరగరాయాలనే లక్ష్యంతో ఉన్నారు. గత ఒలింపిక్స్‌లో 18 క్రీడాంశాల్లో 126 మంది భారత అథ్లెట్లు పోటీపడ్డారు. ఈ సారి ఇప్పటికే 10 క్రీడాంశాల్లో 42 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్‌ బెర్తులు సాధించారు. కోటా స్థానాలు ఇంకా ఎక్కువే. అత్యధికంగా షూటింగ్‌లో 20 కోటా స్థానాలు గెలిచారు. అథ్లెటిక్స్‌లో 9, టేబుల్‌ టెన్నిస్‌లో 6, బ్యాడ్మింటన్‌లో 4, బాక్సింగ్‌లో 4 చొప్పున సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చాలా విభాగాల్లో ఒలింపిక్‌ అర్హత ప్రక్రియ చివరి దశలో ఉండటంతో రాబోయే కొన్ని వారాల్లో మరింత మంది భారత అథ్లెట్లు ఆ మెగా క్రీడల పోటీపడే అవకాశం పట్టేయనున్నారు.


అందుకు బట్లర్‌ సెంచరీ సంకేతం

కోల్‌కతా: ప్రొఫెషనల్‌ క్రికెటర్లకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌ అవసరమనడానికి జోస్‌ బట్లర్‌ శతకం సంకేతమని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్‌ మూడీ అన్నాడు. ‘‘బట్లర్‌ అత్యుత్తమ ఫిట్‌నెస్‌ కలిగిన ఆటగాడు కాబట్టి ఇన్నింగ్స్‌ కొనసాగించగలిగాడు. ప్రస్తుత టీ20 క్రికెట్‌ ప్రపంచం లేదా మరో ఫార్మాట్‌ అయినా అత్యుత్తమ ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఆటగాళ్లకు కేవలం నైఫుణ్యముంటే సరిపోదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. బట్లర్‌ అగ్రశ్రేణి అథ్లెట్‌. అందుకే చివరి బంతి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయం అందించాడు. శారీరకంగా మెరుగైన స్థితిలో ఉండబట్టే గాయం నుంచి తిరిగొచ్చాక కూడా బట్లర్‌ బలంగా నిలిచాడు. మానసికంగానూ అతను దృఢంగా ఉన్నాడు’’ అని మూడీ తెలిపాడు.


నాదల్‌ పరాజయం

బార్సిలోనా: బార్సిలోనా ఓపెన్‌తో పునరాగమనం చేసిన టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌.. రెండో రౌండ్‌ దాటలేకపోయాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అతడు 5-7, 1-6తో డిమాన్వర్‌ చేతిలో ఓడిపోయాడు. గాయంతో మూడు నెలల ఆటకు దూరమయ్యాక నాదల్‌ ఆడిన తొలి టోర్నీ ఇదే. బార్సిలోనా ఓపెన్‌లో మొత్తంగా నాదల్‌కు ఇది అయిదో ఓటమి. ఇక్కడ అతడు 12 సార్లు విజేతగా నిలిచాడు. వచ్చే వారం మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఆడడానికి ప్రయత్నిస్తానని 37 ఏళ్ల నాదల్‌ చెప్పాడు. వచ్చే నెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆరంభం కానుంది.


కరువానాతో గుకేశ్‌ ఢీ

టొరంటో: క్యాండిడేట్స్‌ టోర్నీలో అంచనాలకు మించి రాణిస్తోన్న గుకేశ్‌ కీలక పోరుకు సిద్ధమయ్యాడు. ఆరు పాయింట్లతో నెపోమ్నియాషి (రష్యా)తో కలిసి అగ్రస్థానంలో ఉన్న అతడు.. 11వ రౌండ్లో టాప్‌ సీడ్‌ కరువానాతో తలపడనున్నాడు. ఈ గేమ్‌లో గుకేశ్‌ తెల్లపావులతో ఆడతాడు. స్ఫూర్తిదాయక ప్రదర్శనను కొనసాగిస్తూ 14వ రౌండ్ల టోర్నీలో అతడు టైటిల్‌ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రజ్ఞానంద కూడా మరీ వెనుకబడేమీ లేడు. 5.5 పాయింట్లతో రేసులో ఉన్న అతడు.. 11వ రౌండ్లో హికరు నకముర (అమెరికా)ను ఢీకొంటాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని