నరైన్‌ కోసం..

టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్‌ వీడాలని సునీల్‌ నరైన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోమన్‌ పావెల్‌ అన్నాడు. నరైన్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే.

Published : 18 Apr 2024 02:27 IST

కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్‌ వీడాలని సునీల్‌ నరైన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోమన్‌ పావెల్‌ అన్నాడు. నరైన్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. అతడు వెస్టిండీస్‌ తరఫున చివరిసారి 2019 ఆగస్టులో టీ20 మ్యాచ్‌ ఆడాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగుల్లో ఆడేందుకు నరైన్‌ నిరుడు నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. ‘‘గత 12 నెలలుగా అతణ్ని అడుగుతూనే ఉన్నా. మిగతా వాళ్లందరినీ అతడు దూరం పెట్టాడు. నరైన్‌తో మాట్లాడమని పొలార్డ్‌, బ్రావో, పూరన్‌లనూ కోరాను. వెస్టిండీస్‌ జట్టును ఎంపిక చేసేలోపు వాళ్లు అతడిని ఒప్పిస్తారని ఆశిస్తున్నా’’ అని పావెల్‌ చెప్పాడు. నరైన్‌ మంగళవారం రాజస్థాన్‌పై 56 బంతుల్లోనే 109 పరుగులు సాధించాడు. అతడు కేకేఆర్‌కు ప్రధాన స్పిన్నర్‌ కూడా. ఇప్పటివరకు 6.87 ఎకానమీ రేట్‌తో ఏడు వికెట్లు పడగొట్టాడు. ‘‘నరైన్‌ బ్యాటుతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరఫున అతడు బ్యాటుతో బాగా రాణిస్తున్నాడు. అతడు మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తాడని ఆశిస్తున్నా’’ అని పావెల్‌ అన్నాడు. సహచర వెస్టిండీస్‌ ఆటగాడు బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.

ఆ ఆలోచన గంభీర్‌దే!: నరైన్‌ టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌గా రూపాంతరం చెందడంలో మాజీ కెప్టెన్‌, ప్రస్తుత జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ పాత్ర కీలకమని కోల్‌కతా మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకు సింగ్‌. ‘‘ఈసారి నరైన్‌ ఎలా ఆడుతున్నాడో అందరూ చూస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లో పరుగులు సాధిస్తున్నాడు. నరైన్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించాలన్నది గంభీర్‌ ఆలోచన. నెట్స్‌లో తన శ్రమ ఫలితమే ఈ ఇన్నింగ్స్‌లు’’ అని రింకు అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని