ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు ఉంటారా?

మరో వంద రోజుల్లోనే పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్‌ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.

Published : 18 Apr 2024 02:28 IST

మాస్కో: మరో వంద రోజుల్లోనే పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్‌ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యా, దాని మిత్ర దేశం బెలారస్‌పై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. టీమ్‌ విభాగాల్లో ఈ దేశాలు పాల్గొనకుండా ఐఓసీ నిషేధం విధించింది. ఇక వ్యక్తిగత క్రీడాంశాల్లో ఈ రెండు దేశాల అథ్లెట్లు తమ జాతీయ జెండాలను ప్రదర్శించకుండా కేవలం తటస్థ అథ్లెట్లుగానే పోటీపడాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రష్యా, బెలారస్‌ అథ్లెట్లలో ఎవరైనా యుద్ధానికి అనుకూలంగా ఉంటే పోటీపడకుండా వాళ్లపై ఐఓసీ వేటు వేస్తుంది. ఈ క్రీడల ఆరంభోత్సవ వేడుకలకూ వీళ్లకు ప్రవేశం లేదు. ఈ ఒలింపిక్స్‌కు 36 నుంచి 54 మంది రష్యా అథ్లెట్లు అర్హత సాధిస్తారని భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీసుకునే నిర్ణయంపైనే వీళ్లు పోటీలో పాల్గొనడం ఆధారపడి ఉంది. ఐఓసీ పక్షపాత ధోరణిని ప్రశ్నించిన పుతిన్‌.. రష్యా అథ్లెట్లు పారిస్‌కు వెళ్లాలా? వద్దా? అనే విషయంలో సూచనలు పంపించాల్సిందిగా రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ), ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఆర్‌ఓసీ అధ్యక్షుడు స్టానిస్లేవ్‌ ఏమో.. తమ నిర్ణయాలపై ఐఓసీ పునరాలోచించాలని, క్రీడల్లో రష్యాను ఒంటరి చేసే ప్రయత్నాలను మానుకోవాలన్నాడు. క్రీడా మంత్రి ఓలెగ్‌ మాత్రం ఒలింపిక్స్‌ను రష్యా బహిష్కరించకూడదని తెలిపారు. డోపింగ్‌ వేటు కారణంగా గత రెండు ఒలింపిక్స్‌లోనూ జాతీయ చిహ్నాలు లేకుండానే రష్యా అథ్లెట్లు పోటీపడ్డారు. టోక్యోలో ఆ దేశం నుంచి 335 మంది అథ్లెట్లు పాల్గొని 20 స్వర్ణాలు సహా 71 పతకాలు గెలిచారు. జూడో, రెజ్లింగ్‌, టెన్నిస్‌ తదితర క్రీడల్లో రష్యా అథ్లెట్లు పోటీపడే అవకాశం ఉంది.  

మళ్లీ అమెరికానే: ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో మరోసారి అమెరికానే అగ్రస్థానంలో నిలుస్తుందని క్రీడల గణాంకాలను విశ్లేషించే నీల్సన్‌ గ్రేస్‌నోట్‌ స్పోర్ట్స్‌ సంస్థ అంచనా వేసింది. పారిస్‌లో అమెరికా అథ్లెట్లు 39 స్వర్ణాలు సహా 123 పతకాలు గెలుస్తారని ఈ సంస్థ పేర్కొంది. 35 పసిడి పతకాలు సహా 89 పతకాలతో చైనా రెండో స్థానాన్ని సొంతం చేసుకుంటుందని తెలిపింది. టోక్యోలోనూ అమెరికా, చైనా దేశాలే వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గత ఏడు ఒలింపిక్స్‌లోనూ అమెరికానే అత్యధిక పతకాలు నెగ్గింది. ఈ సారి ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌ 55 (28 స్వర్ణాలు) కైవసం చేసుకుంటుందని ఆ సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని