ఆల్‌రౌండర్లకు దెబ్బ

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ చెప్పినట్లు ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన భారత ఆల్‌రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో తలపడే టీమ్‌ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్‌ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.

Published : 19 Apr 2024 07:23 IST

ఈనాడు క్రీడావిభాగం

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ చెప్పినట్లు ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన భారత ఆల్‌రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో తలపడే టీమ్‌ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్‌ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. కానీ ఎంతో కీలకమైన ఆల్‌రౌండర్‌ను ఏ కొలమానం ప్రకారం ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే టీ20 ప్రపంచకప్‌ జట్టు రేసులో ఉన్న శివమ్‌ దూబె ఐపీఎల్‌లో కేవలం బ్యాటింగ్‌ మాత్రమే చేస్తున్నాడు. సీఎస్కే తరపున ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గానే వెలుగులోకి వచ్చిన దూబె.. ఐపీఎల్‌లో 2022 వరకు బౌలింగ్‌ చేశాడు. కానీ గతేడాది నుంచి కేవలం బ్యాటర్‌గానే ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్‌కు ముందు అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు (124) చేసిన బ్యాటర్‌గా నిలిచిన దూబె 7 ఓవర్లు వేసి రెండు వికెట్లూ తీసుకున్నాడు. భారత జట్టుకు ఆడితే దూబె రెండు మూడు ఓవర్లయినా వేయాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్‌తో చివరి టీ20లో మూడు వికెట్లతో మెరిసిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ బాధితుడే. ఈ సన్‌రైజర్స్‌ ఆటగాడు ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అది కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే. ఒకవేళ ఈ నిబంధన లేకుంటే ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్‌ జట్టులో కొనసాగేవాడేమో! రాహుల్‌ తెవాటియా, రియాన్‌ పరాగ్‌ కూడా ఇప్పుడు బ్యాటర్లుగానే మిగిలిపోతున్నారు. 2023 వరకు 88 మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేసిన తెవాటియా 32 వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా మారిన పరాగ్‌ ఈ సారి 7 మ్యాచ్‌ల్లో 318 పరుగులు చేశాడు. దేశవాళీల్లో వికెట్ల వేటలో సాగుతున్న ఈ స్పిన్నర్‌ను సానబెడితే ఆల్‌రౌండర్‌గా మెరుగవుతాడు. కానీ ఐపీఎల్‌లో మ్యాచ్‌లో పరిస్థితులను బట్టి జట్లు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అదనపు బ్యాటర్‌ లేదా బౌలర్‌ను ఆడిస్తున్నాయి. బ్యాటింగ్‌ పెద్దగా రాని బౌలర్‌ కోటా పూర్తి కాగానే అతని స్థానంలో బ్యాటర్‌ను తీసుకుంటున్నాయి. బ్యాటింగ్‌ ముగియగానే ఓ బౌలర్‌ను రప్పిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆల్‌రౌండర్ల కొరత మరింత పెరగడం ఖాయం.


మానసిక రుగ్మత వల్లే వీడ్కోలు: లానింగ్‌

మెల్‌బోర్న్‌: మానసిక రుగ్మత వల్లే త్వరగా రిటైర్‌మెంట్‌ ప్రకటించానని ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ తెలిపింది. 31 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన ఈ దిగ్గజ క్రీడాకారిణి అందుకు కారణాన్ని చాలారోజుల తర్వాత వెల్లడించింది. ‘‘రిటైర్‌మెంట్‌ ప్రకటించే సమయం ఇంకా రాలేదని చాలామంది అన్నారు. కానీ బరిలో దిగే పరిస్థితుల్లో లేను. యాషెస్‌ సిరీస్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఆడాలంటే ఎంతో అంకితభావం కావాలి. అందుకు మానసికంగా.. శారీరకంగా సిద్ధంగా లేను. శారీరకంగా ఎక్కువ కసరత్తులు చేసినట్లు అనిపించింది. 64 కేజీల నుంచి సుమారు 57 కేజీలకు బరువు తగ్గిపోయా. ఇది ఏకాగ్రతపై దెబ్బ కొడుతుందని ఊహించలేకపోయా. ఎడతెరిపి లేకుండా ఆడడం వల్ల స్నేహితులతో, బంధువులతో సంబంధాలు లేకుండాపోయాయి. ఏదో ఒకరోజు ఆటను ఆపేయాలి కదా అనుకున్నా. అందుకే ముందే ఆపేశాను. టీ20 ప్రపంచకప్‌, తొలి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ మధ్య కాలంలో చాలా ఒంటరిగా అనిపించింది. నాపై నాకే నియంత్రణ లేనట్టుగా తోచింది. రాత్రి వేళల్లో కూడా నిద్ర రాదని ముందే అనుకుని ఉదయంలాగే దుస్తులు ధరించేదాన్ని’’ అని లానింగ్‌ తెలిపింది. 241 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 8 వేలకు పైగా పరుగులు చేసిన లానింగ్‌ గతేడాది నవంబర్‌లో వీడ్కోలు పలికింది.


ఆ రోగులు ప్రత్యేక అతిథులుగా

అహ్మదాబాద్‌: బీసీసీఐ ఓ గొప్ప పని చేసింది. బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌కు 12 వేల మంది క్యాన్సర్‌, తలసేమియా రోగులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి మ్యాచ్‌ చూసే అవకాశం కల్పించింది. క్యాన్సర్‌, తలసేమియాపై అవగాహన కోసం ఈ రోగులతో పాటు రక్తదాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రత్యేక స్వాగతం పలికాడు. ‘‘ఈ అసామాన్య చర్య ద్వారా క్యాన్సర్‌, తలసేమియాపై దీర్ఘకాలం పాటు అవగాహన కలిగే అవకాశముంది. ఈ రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా తెలిసే వీలుంది. వీళ్లకు అత్యవసరమైన ఆనందం కూడా లభించింది. అద్భుత వాతావరణంలో తమ అభిమాన జట్టును ప్రోత్సహించిన వీళ్ల ముఖాల్లో సంతోషం కనిపించింది’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై దిల్లీ 6 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.


ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరం

దిల్లీ: భారత్‌కు నిరాశ! పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధించగల అథ్లెట్‌గా పరిగణించిన లాంగ్‌జంప్‌ స్టార్‌ మురళీ శ్రీశంకర్‌ గాయంతో ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధపడుతున్న శంకర్‌కు శస్త్ర చికిత్స అవసరం కావడంతో 2024 సీజన్‌ మొత్తానికే బరిలో దిగే అవకాశం లేకుండాపోయింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో రజతాలు గెలిచిన శంకర్‌.. 2023 ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 8.37 మీటర్లు దూకి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.


కాన్వే స్థానంలో గ్లీసన్‌

చెన్నై: గాయపడ్డ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే స్థానంలో ఇంగ్లాండ్‌ పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ను చెన్నై జట్టులోకి తీసుకుంది. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా కాన్వే బొటన వేలు విరిగింది. వేలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఐపీఎల్‌కు అతడు దూరం కావడం టోర్నీ ఆరంభానికి ముందే స్పష్టమైంది. 2022లో సీఎస్కేతో చేరిన ఈ కివీస్‌ బ్యాటర్‌.. ఆ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. ఇక గ్లీసన్‌కు ఐపీఎల్‌లో ఆడడం ఇదే తొలిసారి. రూ.50 లక్షల కనీస ధరకు అతడు చెన్నై జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ తరఫున 6 టీ20 మ్యాచ్‌లు ఆడిన గ్లీసన్‌.. 8.90 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు.


క్వార్టర్స్‌లో ఆకాంక్ష

దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత టోర్నీగా జరుగుతున్న ఆసియా స్క్వాష్‌ ఈవెంట్లో ఆకాంక్ష సాలుంఖే క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మలేసియాలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో ఆకాంక్ష 11-7, 8-11, 11-3, 11-3, 7-11, 11-5తో తనుసా ఉత్రియన్‌ (మలేసియా)ను ఓడించింది. క్వార్టర్స్‌లో సెహ్‌విత్రా కుమార్‌ (మలేసియా)తో భారత అమ్మాయి తలపడనుంది. క్వాలిఫయర్స్‌ టోర్నీలో పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలు మేలో ఈజిప్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధిస్తారు.


రెండో స్థానానికి గుకేశ్‌

టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ కరువానా (అమెరికా)తో 11వ రౌండ్‌ను గుకేశ్‌ డ్రాగా ముగించాడు. కానీ రెండో స్థానానికి పడిపోయాడు. మరో ఇద్దరు భారత ఆటగాళ్లు ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతి తమ గేముల్లో పరాజయం పాలయ్యారు. నకముర (అమెరికా) చేతిలో ప్రజ్ఞానంద, నెపోమ్నియాషి (రష్యా) చేతిలో విదిత్‌ ఓడారు. నెపోమ్నియాషి ఇప్పుడు ఏడు పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. కరువానా, నకముర, గుకేశ్‌ 6.5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. టోర్నీలో మరో మూడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మహిళల విభాగంలో టాప్‌ సీడ్‌ గోర్యాచ్కినా (రష్యా)పై వైశాలి (4.5) విజయం సాధించింది. సలిమోవా (బల్గేరియా)పై హంపి (5.5) నెగ్గింది. చైనా అమ్మాయి జ్యోంగి తాన్‌ (7.5) తిరిగి ఒంటరిగా ఆధిక్యంలోకి వెళ్లింది. 11వ రౌండ్లో ఆమె కేథరినా లాగ్నో (రష్యా)ను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని