పొట్టి కప్పుకి నేను రెడీ: దినేశ్‌ కార్తీక్‌

ఈ ఐపీఎల్‌ ఆరంభం ముందు వరకు టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎవరంటే.. రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, జితేశ్‌ శర్మల పేర్లు వినిపించేవి.

Published : 21 Apr 2024 02:59 IST

కోల్‌కతా: ఈ ఐపీఎల్‌ ఆరంభం ముందు వరకు టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎవరంటే.. రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, జితేశ్‌ శర్మల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు వీరితో పాటు దినేశ్‌ కార్తీక్‌ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. పునరాగమనంలో చక్కటి ప్రదర్శనతో పంత్‌ రేసులో ముందుండగా, అతడితో పాటు కార్తీక్‌ను ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేయాలన్న డిమాండ్‌ బలపడుతోంది. ఈ సీజన్లో అంతగా రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేస్తున్నాడీ బెంగళూరు బ్యాటర్‌. సీజన్‌ ఆరంభంలో చెన్నై, పంజాబ్‌లపై వరుసగా 38, 28 పరుగులతో అజేయంగా నిలిచిన కార్తీక్‌.. ఇటీవల ముంబయిపై 23 బంతుల్లోనే 53, హైదరాబాద్‌పై 35 బంతుల్లోనే 83 పరుగులతో ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా సన్‌రైజర్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ తర్వాత ప్రపంచకప్‌ జట్టులోకి కార్తీక్‌ను ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొట్టి కప్పుకి తాను సిద్ధంగా ఉన్నట్లు 39 ఏళ్ల కార్తీక్‌ చెప్పాడు. ‘‘నా జీవితంలో ఈ దశలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమంటే గొప్పగా అనిపిస్తుంది. అందుకు నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఆడడం కంటే నా జీవితంలో పెద్ద విషయం ఏమీ ఉండదు. ప్రపంచకప్‌ కోసం జట్టును ఎంపిక చేసే ముగ్గురు.. ద్రవిడ్‌, రోహిత్‌, అగార్కర్‌ ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తులు. ప్రపంచకప్‌ కోసం అత్యుత్తమ జట్టునే ఎంపిక చేస్తారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తా’’ అని కార్తీక్‌ అన్నాడు.


నరైన్‌ దిగ్గజం అవుతాడనుకున్నా: గంభీర్‌

 కోల్‌కతా: వెస్టిండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ టీ20ల్లో దిగ్గజ ఆటగాడు అవుతాడని ముందే అనుకున్నానని భారత క్రికెట్‌ మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ‘‘2011 వెస్టిండీస్‌ సిరీస్‌లో నరైన్‌ వేసిన ఏడెనిమిది బంతులను ఎదుర్కొన్నాక అతడు కచ్చితంగా గొప్ప బౌలర్‌ అవుతాడని ఊహించా. ముఖ్యంగా టీ20ల్లో దిగ్గజంగా మారతాడని అనుకున్నా. ఇన్నాళ్ల తర్వాత చూస్తే ఐపీఎల్‌ చరిత్రలోనే నరైన్‌ ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు’’ అని గౌతి గుర్తు చేసుకున్నాడు. 2011లో భారత్‌పైనే వన్డేల్లో నరైన్‌ అరంగ్రేటం చేశాడు. ఇండోర్‌లో జరిగిన నాలుగో వన్డేలో తొలిసారి నరైన్‌ను గంభీర్‌ ఎదుర్కొన్నాడు. 2012 ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున నరైన్‌ అడుగుపెట్టాడు. మిస్టరీ స్పిన్నర్‌గా పేరు పొందిన అతడు ఈ ఏడాది 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 2014లో 21 వికెట్లు పడగొట్టి కోల్‌కతా టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నరైన్‌లోని బ్యాటింగ్‌ సత్తాను గుర్తించిన కెప్టెన్‌ గౌతి.. అతడిని ఓపెనర్‌గా ప్రోత్సహించాడు. ఆ తర్వాత నరైన్‌ పెద్దగా రాణించపోయినా కేకేఆర్‌ అతడిని కొనసాగించిందంటే అందుకు గంభీర్‌ అప్పట్లో ఇచ్చిన మద్దతే కారణం. కోల్‌కతా నుంచి లఖ్‌నవూకు వెళ్లిపోయిన గంభీర్‌.. మళ్లీ ఇప్పుడు మార్గనిర్దేశకుడి పాత్రలో పాత గూటికి చేరడంతో నరైన్‌కు ఇంకా బలమొచ్చింది. బంతితోనే కాదు బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో ఓ సెంచరీతో సహా 276 పరుగులు చేసిన అతడు.. 7 వికెట్లు కూడా తీశాడు. ప్రతి మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్‌ పడగొట్టాడు. మొత్తం మీద ఐపీఎల్‌ కెరీర్‌లో 168 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీసిన నరైన్‌.. 1322 పరుగులు సాధించాడు.


అలీ రెజాతో గుకేశ్‌ ఢీ

టొరంటో: క్యాండిడేట్స్‌ టోర్నీ టైటిల్‌ రేసులో ఉన్న గ్రాండ్‌మాస్టర్‌ గుకేశ్‌ కీలక పోరుకు సిద్ధమయ్యాడు. 13వ రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన ఫిరౌజా అలీరెజాతో అతడు తలపడతాడు. తెల్లపావులతో ఆడనున్న గుకేశ్‌.. ఈ గేమ్‌లో గెలిస్తే తన అవకాశాలను గొప్పగా మెరుగుపర్చుకుంటాడు. అలీరెజా అంతగా ఫామ్‌లో లేడు. గుకేశ్‌ ప్రస్తుతం 7.5 పాయింట్లతో నకముర (అమెరికా), నెపోమ్నియాషి (రష్యా)తో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు. మరో గేమ్‌లో నకముర, నెపోమ్నియాషి తలపడతారు. ఫాబియానో కరువానా (అమెరికా) కూడా టైటిల్‌ రేసులో ఉన్నాడు. ఏడు పాయింట్లతో ఉన్న అతడు 13వ రౌండ్లో ప్రజ్ఞానంద (6)తో తలపడతాడు. గుకేశ్‌ ఆఖరిదైన 14వ రౌండ్లో కఠిన ప్రత్యర్థి నకముర (అమెరికా)తో ఆడతాడు. నకమురను విదిత్‌ గుజరాతి (5) రెండు సార్లు ఓడించడం విశేషం. విదిత్‌ తన చివరి రెండు రౌండ్లలో నిజత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌), అలీరెజాలతో ఆడతాడు


డేవిడ్‌, పొలార్డ్‌లకు జరిమానా

ముల్లాన్‌పుర్‌: పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ జరిమానాకు గురయ్యారు. మ్యాచ్‌ ఫీజులో వారికి 20 శాతం కోత పెట్టారు. ఐపీఎల్‌ వివరాలు వెల్లడించలేదు కానీ.. వైడ్‌ కోసం డీఆర్‌ఎస్‌ తీసుకోవాలని వాళ్లు బ్యాటర్లకు సైగలు చేయడమే జరిమానాకు కారణమని సమాచారం. గురువారం జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతిని సూర్యకుమార్‌ కనెక్ట్‌ చేయలేకపోయాడు. మొదట సూర్య వైడ్‌ కోసం సమీక్ష కోరలేదు. ఆలస్యంగా అడిగాడు. డేవిడ్‌, పొలార్డ్‌లు.. వైడ్‌ కోసం సమీక్ష కోరాల్సిందిగా సైగలు చేసినట్లు స్పష్టంగా కనిపించింది.


ప్రపంచకప్‌ జట్టు ప్రకటన ఆ రోజే!

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌ ఇంకో 40 రోజుల్లోనే మొదలు కాబోతోంది. ఆ మెగా టోర్నీకి జట్టును ప్రకటించడానికి ఇంకో పది రోజుల గడువే ఉంది. పొట్టి కప్పు కోసం భారత జట్టును ఈ నెల చివరి వారంలో ప్రకటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జట్టు ప్రకటనకు తేదీ ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 27న దిల్లీలో సెలక్షన్‌ కమిటీ సమావేశం జరగనుందట. ఆ రోజు ముంబయి ఇండియన్స్‌.. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ జరిగే దిల్లీలో అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సమావేశం కానుండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా అందులో పాల్గొనబోతున్నారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని