బాలికల శక్తి ఒకరి నుంచి ఒకరికి పాకుతోంది: సచిన్‌

అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కోరాడు.

Updated : 21 Apr 2024 09:44 IST

రాంచి: అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కోరాడు. అమ్మానాన్న ముఖాలపై ఈ అమ్మాయిలు చిరునవ్వులు తీసుకొస్తారని అతను తెలిపాడు. ఫుట్‌బాల్‌లో అమ్మాయిలకు చేయూతగా నిలిచేందుకు యువ సంస్థతో కలిసి సచిన్‌ తెందుల్కర్‌ ఫౌండేషన్‌ పనిచేస్తోంది. ఈ అమ్మాయిలను ప్రోత్సహించేందుకు భార్య అంజలితో కలిసి సచిన్‌ శనివారం రాంచీకి వచ్చాడు. యువ ఫాండేషన్‌కు చెందిన ఫుట్‌బాల్‌ అమ్మాయిలతో ఈ దంపతులు ముచ్చటించారు.

‘‘ఈ బాలికల శక్తి ఒకరి నుంచి ఒకరికి పాకుతోంది. వీళ్లు ఎంతో కష్టపడటంతో పాటు ఆస్వాదించడం చూశా. నా బాల్యాన్ని గుర్తుచేసుకున్నా. ఎంతో మంది చిన్నారుల నుంచి స్ఫూర్తి పొందా. ఎందుకంటే వాళ్ల ప్రయాణం అంత సులువుగా ఉండదు. ఫుట్‌బాల్‌ ఆడతానంటే వద్దనే తల్లిదండ్రులుంటారు. అలాంటివాళ్లకు చెప్తున్నా.. అమ్మాయిలను ప్రోత్సహించాలి. మీ ముఖాలపై వీళ్లు చిరునవ్వులు తీసుకొస్తారు. ఈ అమ్మాయిల నైపుణ్యాలను యువ ఫౌండేషన్‌ సానబెడుతోంది. వాళ్ల జీవితాలను మారుస్తోంది. వీళ్లు కచ్చితంగా మెరుస్తారు. ఈ చిన్నారుల కారణంగానే ఇక్కడికి వచ్చా. వీళ్ల వల్ల నవ్వే అవకాశం వచ్చిందంటే అంతకుమించి ఇంకేం ఉండదు’’ అని సచిన్‌ తెలిపాడు. విద్య, క్రీడలు, ఆరోగ్యం రంగాల్లో సచిన్‌ తెందుల్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామని సచిన్‌ వెల్లడించాడు. ‘‘మా నాన్న ప్రొఫెసర్‌ కాబట్టి విద్య, నా భార్య వైద్యురాలు కావడంతో ఆరోగ్యం, నేను క్రీడాకారుణ్ని కాబట్టి క్రీడలు ఎంచుకున్నాం. ఈ మూడు రంగాలు కలిస్తే దేశం భవిష్యత్‌ను మార్చొచ్చు’’ అని సచిన్‌ పేర్కొన్నాడు. ఓటింగ్‌ అవగాహన జాతీయ ఐకాన్‌గా ఉన్న సచిన్‌.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అందరూ ఓటుహక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని