విజేతలుగా మను, అనీశ్‌

ఒలింపిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ (ఓఎస్‌టీ)- 1 పోటీల్లో మను బాకర్‌, అనీశ్‌ భన్వాల విజేతలుగా నిలిచారు. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు.

Published : 21 Apr 2024 03:05 IST

దిల్లీ: ఒలింపిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ (ఓఎస్‌టీ)- 1 పోటీల్లో మను బాకర్‌, అనీశ్‌ భన్వాల విజేతలుగా నిలిచారు. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. శనివారం మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో మను 50కి గాను 47 పాయింట్లతో ప్రపంచ రికార్డు (కొరియా షూటర్‌ యాంగ్‌ జిన్‌-41)ను అధిగమించింది. అయిదు ర్యాపిడ్‌ ఫైర్‌ షాట్ల 10 సిరీస్‌లుకు గాను మను వరుసగా 4, 4, 5, 5, 5, 5, 4, 5, 5, 5 చొప్పున స్కోరు చేసింది. అర్హత రౌండ్లో 585 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ ఫైనల్లో ముందుగానే నిష్క్రమించింది. ఏడు సిరీస్‌లు ముగిసే సరికి 23 స్కోరు మాత్రమే చేసిన ఇషా పోరు నుంచి వైదొలిగింది. అయినా అర్హత రౌండ్లో మెరుగైన ప్రదర్శన కారణంగా ఓఎస్‌టీ పాయింట్ల జాబితాలో ఇషానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. మను, సిమ్రన్‌జీత్‌, అభిజ్ఞ, రిథమ్‌ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పురుషుల 25మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఫైనల్లో అనీశ్‌ (33), విజయ్‌వీర్‌ (27), ఆదర్శ్‌ (23) వరుసగా తొలి మూడు స్థానాలను సొంతం చేసుకున్నారు. క్వాలిఫికేషన్లో అగ్రస్థానంలో నిలిచిన భవేశ్‌ తుదిపోరులో మాత్రం నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని