అమ్మాయిల పట్టు అదుర్స్‌

భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌లో సత్తాచాటిన వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), రీతిక (76 కేజీలు) పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్ధానాలు సొంతం చేసుకున్నారు.

Published : 21 Apr 2024 03:07 IST

వినేశ్‌, అన్షు, రీతికకు ఒలింపిక్స్‌ కోటా 

బిష్కెక్‌: భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌లో సత్తాచాటిన వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), రీతిక (76 కేజీలు) పారిస్‌ ఒలింపిక్స్‌ కోటా స్ధానాలు సొంతం చేసుకున్నారు. ఈ పోటీల్లో ఆయా బరువు విభాగాల్లో ఫైనల్‌ చేరిన రెజ్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. వినేశ్‌ ఒక్క పాయింట్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ చేరింది. సెమీస్‌లో 29 ఏళ్ల వినేశ్‌ 10-0 తేడాతో లారా గనికిజీ (కజకిస్థాన్‌)ని చిత్తుచేసింది. వరుసగా 10 పాయింట్లు గెలిచిన వినేశ్‌.. సాంకేతిక ఆధిపత్యంతో విజేతగా నిలిచింది. 4 నిమిషాల 18 సెకన్లలో ఈ బౌట్‌ను ముగించింది. తొలి రౌండ్‌ను 99 సెకన్లలో, రెండో రౌండ్‌ను 67 సెకన్లలోనే ముగించిన వినేశ్‌కు.. సెమీస్‌లో 19 ఏళ్ల ప్రత్యర్థి నుంచి కాస్త పోటీ ఎదురైంది. అయినా అనుభవం ఉపయోగించిన వినేశ్‌ జోరు కొనసాగించింది. 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు చేతులతో ప్రత్యర్థిని కదలకుండా పట్టేసి గెలుపు సొంతం చేసుకుంది. వినేశ్‌ వరుసగా మూడో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషం. మరోవైపు 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రజత విజేత అన్షు మలిక్‌ కూడా సాంకేతిక ఆధిపత్యంతోనే సెమీస్‌లో 11-0తో లేలోకోన్‌ సోబిరోవా (ఉజ్బెకిస్థాన్‌)ను ఓడించింది. కేవలం 2 నిమిషాల 48 సెకన్లలోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌ రీతిక కూడా మెరిసింది. సెమీస్‌లో ఆమె 7-0తో చాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. ఇప్పటివరకూ మహిళల రెజ్లర్లు నాలుగు కోటా స్థానాలు గెలిచినట్లయింది.

ఆ పోరాటం.. ఈ గాయం

వినేశ్‌ ఫాగాట్‌ పనైపోయింది. ఆమె ఇంకేం పోటీపడుతుంది? ఇలాంటి సందేహాలు, విమర్శలు చాలానే వినిపించాయి. కానీ ఆటతోనే వినేశ్‌ వీటికి సమాధానమిచ్చింది. మూడు సార్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి గెలిచిన తర్వాత మ్యాట్‌పై, బయట వినేశ్‌ ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో వినేశ్‌ కీలక పాత్ర పోషించింది. ప్రాక్టీస్‌కు దూరమైంది. రోడ్డుపై నిద్రించింది. మానసికంగా ఎంతో వేదన అనుభవించింది. మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది. ఈ సమయంలోనే వినేశ్‌ పోటీపడే 53 కేజీల విభాగంలో అంతిమ్‌ ఒలింపిక్స్‌ కోటా గెలిచింది. దీంతో వినేశ్‌ బరువు విభాగం మారక తప్పలేదు. 57 కేజీలకు మారాలని వైద్యులు సూచించినా, బరువు తగ్గడం ప్రమాదమని హెచ్చరించినా వినేశ్‌ వినలేదు. 50 కేజీలకు తగ్గి జాతీయ సెలక్షన్‌ ట్రయల్స్‌లో గెలిచి ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. కానీ ఈ పోటీల్లో బరువు కచ్చితంగా 50 కేజీలు లేదా అంతకంటే తక్కువే ఉండాలి. కానీ పోటీలకు రెండు రోజుల ముందు ఆమె 51.4 కేజీలుంది. పరీక్షించే సమయానికి బరువు తగ్గి 49.90 కేజీలకు చేరుకుంది. ఇక ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆమె ఏ బరువు విభాగంలో పోటీపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 53 కేజీల్లో అవకాశం దక్కుతుందేమో చూడాలి. ‘‘బరువుపై నియంత్రణ పరంగా మెరుగ్గా ఉండాలి. ప్రతి రోజు ముఖ్యమైందే. సహజంగానే నేను బరువు పెరుగుతుంటా. 20 ఏళ్లుగా రెజ్లింగ్‌ చేస్తున్నా. నాకు ఒలింపిక్‌ పతకం కావాలి’’ అని వినేశ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని