రాయల్స్‌.. తగ్గేదేలే

ఐపీఎల్‌-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌.. మ్యాచ్‌ మ్యాచ్‌కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్‌.. ఏడో విజయాన్ని నమోదు చేసింది.

Updated : 23 Apr 2024 06:46 IST

ఐపీఎల్‌-17లో ఏడో విజయం
యశస్వి సూపర్‌ సెంచరీ
ముంబయికి మరో ఓటమి

ఐపీఎల్‌-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌.. మ్యాచ్‌ మ్యాచ్‌కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్‌.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ముంబయి ఇండియన్స్‌ను అలవోకగా ఓడించిన రాజస్థాన్‌.. హ్యాట్రిక్‌ విజయం సాధించింది. తిలక్‌ వర్మ మెరుపులతో ముంబయి 180 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా.. రాయల్స్‌ దూకుడు ముందు అది నిలవలేదు. ఒక్క వికెట్టే కోల్పోయి రాజస్థాన్‌ విజయాన్నందుకుంది. శతకంతో యశస్వి జైస్వాల్‌, 5 వికెట్లతో సందీప్‌ శర్మ రాయల్స్‌ హీరోలుగా నిలిచారు.

జైపుర్‌

పీఎల్‌-17 ప్లేఆఫ్స్‌ దిశగా రాజస్థాన్‌ దూసుకెళ్తోంది. ఆ జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. సోమవారం రాయల్స్‌ 9 వికెట్ల తేడాతో ముంబయిని చిత్తుచేసింది. యశస్వి జైస్వాల్‌ (104 నాటౌట్‌; 60 బంతుల్లో 9×4, 7×6) మెరుపు శతకం సాధించడంతో 180 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్టే కోల్పోయి 18.4 ఓవర్లలోనే అందుకుంది. బట్లర్‌ (35; 25 బంతుల్లో 6×4), శాంసన్‌ (38 నాటౌట్‌; 28 బంతుల్లో 2×4, 2×6) కూడా రాణించారు. మొదట ముంబయి 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (65; 45 బంతుల్లో 5×4, 3×6), నేహాల్‌ వధేరా (49; 24 బంతుల్లో 3×4, 4×6) రాణించారు. సందీప్‌ శర్మ (5/18) అద్భుత బౌలింగ్‌తో ముంబయికి బ్రేకులేశాడు. బౌల్ట్‌ (2/32) కూడా ఆకట్టుకున్నాడు.

యశస్వి దంచేశాడు: ఛేదనలో రాజస్థాన్‌ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. 3 ఓవర్లలో 19/0తో ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించినప్పటికీ.. తర్వాత రాయల్స్‌ దూకుడు పెంచింది. సీజన్‌ ఆరంభంలో తేలిపోయి తర్వాత నెమ్మదిగా ఫామ్‌ అందుకుంటున్న యశస్వి.. ఈ మ్యాచ్‌లో పతాక స్థాయినందుకుని ముంబయి బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. బట్లర్‌ సైతం ధాటిగా ఆడడంతో పవర్‌ ప్లేలో 61/0తో రాయల్స్‌ పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ దశలో వర్షం వల్ల 40 నిమిషాల పాటు ఆట ఆగిపోయింది. మ్యాచ్‌ పునఃప్రారంభమయ్యాక బట్లర్‌ను చావ్లా బౌల్డ్‌ చేసినా.. యశస్వికి సంజు తోడవడంతో రాయల్స్‌కు ఇబ్బంది లేకపోయింది. అర్ధశతకం పూర్తి కాగానే యశస్వి ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద వధేరా వదిలేయగా.. తర్వాత సంజు క్యాచ్‌ కూడా నేలపాలైంది. ఈ అవకాశాల్ని ఇద్దరూ పూర్తిగా ఉపయోగించుకుని జట్టుకు ఘనవిజయాన్నందించారు. యశస్వి ధాటికి బుమ్రా సైతం 4 ఓవర్లలో వికెట్‌ లేకుండా 37 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

సందీప్‌ అద్భుతం.. తిలక్‌ అదరహో: మొదట ముంబయి ఇన్నింగ్స్‌ పేలవంగా ఆరంభమై ఆ జట్టు 150 అయినా చేస్తుందా అన్న సందేహాలు నెలకొనగా.. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌, కీలక భాగస్వామ్యాలతో జట్టును నిలబెట్టాడు. వధేరాతో తిలక్‌ భాగస్వామ్యం చూస్తే.. ముంబయి సులువుగా 200 దాటేస్తుందనిపించింది. కానీ చివరి ఓవర్లలో ఆ జట్టు ఆశించిన మెరుపులు లేక రాయల్స్‌ ముందు 180 లక్ష్యమే నిలిచింది. సందీప్‌, బౌల్ట్‌ ధాటికి ఆరంభంలో 20/3తో ముంబయి కష్టాల్లో పడింది. అయితే దూకుడుగా ఆడిన తిలక్‌.. నబి (23), వధేరాలతో కలిసి ముంబయిని పటిష్ఠ స్థితికి చేర్చాడు. 16 ఓవర్లకు స్కోరు 151/4. ముంబయి సులువుగా 200 చేస్తుందనిపించింది. కానీ వధేరా ఔటయ్యాక ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. హార్దిక్‌ (10) మరోసారి నిరాశపరచగా.. డేవిడ్‌ (3), కొయెట్జీ (0)లతో పాటు తిలక్‌ను సందీప్‌ ఔట్‌ చేసి ముంబయి ఇన్నింగ్స్‌కు పేలవ ముగింపునిచ్చాడు. చివరి 4 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 28 పరుగులే చేసింది.

ముంబయి: రోహిత్‌ (సి) శాంసన్‌ (బి) బౌల్ట్‌ 6; ఇషాన్‌ (సి) శాంసన్‌ (బి) సందీప్‌ 0; సూర్యకుమార్‌ (సి) రోమన్‌ పావెల్‌ (బి) సందీప్‌ 10; తిలక్‌ (సి) రోమన్‌ పావెల్‌ (బి) సందీప్‌ 65; నబి (సి) అండ్‌ (బి) చాహల్‌ 23; వధేరా (సి) సందీప్‌ (బి) బౌల్ట్‌ 49; హార్దిక్‌ ఎల్బీ (బి) అవేష్‌ 10; డేవిడ్‌ (సి) పరాగ్‌ (బి) సందీప్‌ 3; కొయెట్జీ (సి) హెట్‌మయర్‌ (బి) సందీప్‌ 0; చావ్లా నాటౌట్‌ 1; బుమ్రా నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 179; వికెట్ల పతనం: 1-6, 2-6, 3-20, 4-52, 5-151, 6-170, 7-176, 8-176, 9-177; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-32-2; సందీప్‌ 4-0-18-5; అవేష్‌ 4-0-49-1; అశ్విన్‌ 4-0-31-0; చాహల్‌ 4-0-48-1

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్‌ 104 నాటౌట్‌; బట్లర్‌ (బి) చావ్లా 35; శాంసన్‌ నాటౌట్‌ 38; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (18.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 183; వికెట్ల పతనం: 1-74; బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్య 2-0-21-0; బుమ్రా 4-0-37-0; తుషార 3-0-28-0; కొయెట్జీ 2-0-25-0; నబి 3-0-30-0; పియూష్‌ చావ్లా 4-0-33-1; తిలక్‌వర్మ 0.4-0-8-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని