ఆ ఓటమి కసిని పెంచింది

భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు,   అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్‌ యవనికపై విషీ ముద్ర అలాంటిది.

Published : 23 Apr 2024 03:31 IST

‘ఈనాడు’తో గుకేశ్‌

భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు,   అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్‌ యవనికపై విషీ ముద్ర అలాంటిది. ఇప్పుడు ఆనంద్‌నే ఆరాధిస్తూ.. ఆయన బాటలో సాగుతూ.. యువ సంచలనం గుకేశ్‌ అదరగొడుతున్నాడు. క్యాండిడేట్స్‌ టోర్నీ విశేషాలు, టైటిల్‌ ఆనందాన్ని అతను ‘ఈనాడు’ పంచుకున్నాడు.

ఈనాడు - హైదరాబాద్‌

క్యాండిడేట్స్‌ టోర్నీలో గెలుపు ఎలాంటి అనుభూతినిస్తోంది?

చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉత్తేజితంగానూ ఉంది. ఇది సాధారణ విజయం కాదు. ఈ టోర్నీలో గెలిచి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలవడం ఇంకా ఆనందాన్ని కలిగిస్తోంది.

 ఆఖరి గేమ్‌ డ్రా కావడంతో ఏమనిపించింది? ఒత్తిడి ఎదుర్కొన్నారా?

13 రౌండ్లు ముగిసేసరికి 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నా. చివరి రౌండ్లో గెలుపే లక్ష్యంగా ఆడా. కానీ ప్రత్యర్థి కూడా తగ్గకపోవడంతో డ్రా అయినా ఫర్వాలేదనిపించింది. ఇక కరువాన, నెపోమ్నియాషి గేమ్‌ చూస్తుంటే ఒత్తిడిగా అనిపించింది. ఇందులో ఎవరైనా గెలిస్తే.. అప్పుడు టైటిల్‌ కోసం వాళ్లతో టైబ్రేకర్‌లో తలపడాల్సి వచ్చేది. అందుకే ఈ గేమ్‌లో ఏమవుతుందో అని చూశా. కానీ కాసేపటి తర్వాత కోచ్‌తో కలిసి హోటల్‌ గదికి వెళ్లిపోయా. టైబ్రేకర్‌ గురించి ఆలోచించా. అందులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించా. ఇంతలో నాన్న పరుగెత్తుకుంటూ వచ్చి ఆ గేమ్‌ డ్రా అయిందని, టైటిల్‌ మనదేనని అన్నారు.

 ఈ టోర్నీలో మీకు కఠిన సవాలు విసిరిన గేమ్‌ ఏది?

క్యాండిడేట్స్‌ టోర్నీ అంటే ప్రతి గేమ్‌ కూడా కష్టంగానే ఉంటుంది. అయినా వందశాతం ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో ఆడా. అయితే ఏడో రౌండ్‌లో అలీరెజా చేతిలో ఓటమి ఎదురైంది. బాగానే ఆడినా గెలవలేకపోయా. ఆ ఓటమే నాలో ఇంకా కసిని పెంచింది. ఎక్కడ తప్పు చేశానో తెలుసుకున్నా. 13వ రౌండ్లో అలీరెజాను ఓడించా.

 మీ ప్రయాణంలో తల్లిదండ్రుల పాత్ర?

చిన్నప్పటి నుంచి అమ్మానాన్న నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 2018 ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అయిదు స్వర్ణాలు గెలవడంతో వాళ్లకు నాపై పూర్తి నమ్మకం వచ్చింది. ఈఎన్‌టీ సర్జన్‌ అయిన నాన్న నా కోసం ప్రాక్టీస్‌ ఆపేశారు. అప్పుడు అమ్మ సంపాదనతోనే ఇల్లు గడిచేది. రెండేళ్ల పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ నాన్న ఏ కష్టాన్ని నా వరకూ రానివ్వలేదు. నేను గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాక పరిస్థితి మెరుగైంది. కరోనా సమయంలో బయట టోర్నీలు లేకపోవడంతో నాన్న వైద్యుడిగా పనిచేశారు.

మార్గనిర్దేశకుడిగా విశ్వనాథన్‌ ఆనంద్‌ గురించి ఏం చెబుతారు?

ఆనంద్‌ సర్‌ను ఆరాధిస్తూ పెరిగా. ఆయన అకాడమీలో శిక్షణ పొందడం గొప్ప అవకాశం. ఆయన సూచనలతో నా ఆట ఇంకా మెరుగైంది. ఇప్పుడు ఆయన బాటలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడం ఆనందంగా ఉంది.

ఈ క్యాండిడేట్స్‌ టోర్నీకి ముందు, ఇప్పుడు ఏం మారింది?

ఈ టోర్నీ ఆరంభానికి ముందు మాపై పెద్దగా అంచనాల్లేవు. నాతో పాటు ప్రజ్ఞానంద, విదిత్‌ మెరుగైన ప్రదర్శన చేస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు నా విజయంతో అందరూ గర్వపడుతున్నారు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సన్నాహకాలు మొదలుపెడతా.

మేం తెలుగువాళ్లమే..

మేం చెన్నైలో స్థిరపడ్డా మా కుటుంబంలో తెలుగు మూలాలున్నాయి. మా ముత్తాతలు పుత్తూరు సమీపంలోని సత్యవేడు దగ్గర గ్రామంలో ఉండేవాళ్లు. ఇప్పటికీ అక్కడ మాకు బంధువులున్నారు. చిన్నప్పుడు అమ్మానాన్నతో కలిసి అక్కడికి వెళ్లేవాణ్ని. కానీ చెస్‌ కెరీర్‌ కారణంగా ఇప్పుడు కుదరడం లేదు.  

‘‘అతి పిన్న వయసు ఛాలెంజర్‌ (ప్రపంచ ఛాంపియన్‌తో పోటీపడే వ్యక్తి)గా నిలిచిన గుకేశ్‌కు అభినందనలు.  నువ్వు సాధించిన దాని పట్ల వాకా (వెస్ట్‌బ్రిడ్జ్‌ ఆనంద్‌ చెస్‌ అకాడమీ) కుటుంబం గర్వపడుతోంది. నువ్వు ఆడిన తీరు, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న విధానం పట్ల వ్యక్తిగతంగా ఎంతో గర్వపడుతున్నా. ఈ క్షణాన్ని ఆస్వాదించు’’

 విశ్వనాథన్‌ ఆనంద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని