అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు

చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.

Updated : 24 Apr 2024 08:54 IST

దిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 16 సీజన్‌లు ముగియగా.. ముంబయి, చెన్నై అయిదేసి మార్లు విజేతగా నిలిచాయి. రోహిత్‌శర్మ అత్యధికంగా ఆరు సార్లు ఐపీఎల్‌ టైటిళ్లు గెలవగా.. ఆ రికార్డును నిరుడు రాయుడు సమం చేశాడు. ‘‘ఫలితాల్ని చెన్నై ఎక్కువగా విశ్లేషించదు. ప్రక్రియపై దృష్టిసారిస్తుంది. ఫలితాలపై మానసికంగా ఆందోళన చెందదు. ముంబయి పూర్తిగా భిన్నం. గెలుపే ఆ జట్టు లక్ష్యం. ముంబయి సంస్కృతి విజయాలపైనే ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా గెలవాల్సిందే.. ఆ విషయంలో రాజీపడొద్దని అనుకుంటుంది. చెన్నై, ముంబయి జట్ల సంస్కృతి పూర్తిగా భిన్నం. కానీ రెండు జట్లు బాగా కష్టపడతాయి. చెన్నై జట్టులో కాస్త మెరుగైన వాతావరణం ఉంటుందన్నది నా అభిప్రాయం. అక్కడ సుదీర్ఘ కాలం ఆడొచ్చు. ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది’’ అని రాయుడు పేర్కొన్నాడు.


తొలి సెమీస్‌లో ఒడిశా గెలుపు

ముంబయి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో  సెమీఫైనల్‌ తొలి అంచెలో ఒడిశా ఎఫ్‌సీ విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఈ పోరులో ఒడిశా 2-1 గోల్స్‌తో మోహన్‌బగాన్‌కు షాకిచ్చింది. లీగ్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన మోహన్‌బగాన్‌ (48 పాయింట్లు) సెమీస్‌నూ మెరుగ్గానే ఆరంభించింది. 3వ నిమిషంలో మన్వీర్‌ సింగ్‌ గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలోకి నిలిపాడు. కానీ ఒడిశా దీటుగా స్పందించింది. డెల్గాడో (11వ) చేసిన గోల్‌తో స్కోరు  సమం చేసింది. ఆ తర్వాత రాయ్‌ కృష్ణ (39వ) బంతిని నెట్‌లోకి కొట్టడంతో 2-1తో నిలిచింది. చివరిదాకా ఆధిక్యాన్ని కాపాడుకుని విజయాన్ని అందుకుంది. తొలి అంచె సెమీస్‌లో భాగంగా బుధవారం ముంబయితో గోవా తలపడనుంది. రెండో అంచె సెమీస్‌లో 28న మోహన్‌బగాన్‌-ఒడిశా, 29న ముంబయి-గోవా పోటీపడతాయి. మే 4న జరిగే తుదిపోరుకు చేరే జట్లలో లీగ్‌ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు సొంత మైదానంలో ఫైనల్‌ జరగనుంది.


శ్రీలంక లెజెండ్స్‌ ట్రోఫీలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌!

కొలంబో: గుర్తింపు లేని శ్రీలంక లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీలో ఇద్దరు భారతీయులపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అభియోగాలు నమోదయ్యాయి. క్యాండీ స్వాంప్‌ ఆర్మీ జట్టు యజమాని యోని పటేల్‌, పంజాబ్‌ రాయల్స్‌ మేనేజర్‌ ఆకాశ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు కొలంబో మేజిస్ట్రేట్‌ కోర్టు అధికారి తెలిపాడు. గత శుక్రవారం బెయిల్‌ కోసం పటేల్‌ చేసుకున్న దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించిందని.. వారిద్దరిపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఒక నెల పాటు పొడిగించిందని సదరు అధికారి చెప్పాడు. ఈ ఏడాది మార్చి 8 నుంచి 19 వరకు శ్రీలంకలో ఈ లీగ్‌ జరిగింది. ఈ లీగ్‌కు ఐసీసీ, శ్రీలంక క్రికెట్‌ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు.


ఐపీఎల్‌ అత్యుత్తమ టీ20 టోర్నీ: పాంటింగ్‌

దిల్లీ: ఐపీఎల్‌ అత్యుత్తమ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ అని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. జేక్‌ ఫ్రేజర్‌ లాంటి ప్రతిభావంతులకు సత్తా చాటేందుకు ఈ టోర్నీ మంచి వేదికని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచ స్థాయిలో ఐపీఎల్‌ అత్యుత్తమ దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌. జేక్‌ ఫ్రేజర్‌ లాంటి యువ ఆటగాళ్లు ఈ టోర్నీతో వెలుగులోకి వస్తున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఫ్రేజర్‌ 18 బంతుల్లోనే 65 పరుగులతో అదరగొట్టాడు. నిజానికి ఆ రోజు అతడు సెంచరీ సాధించాల్సింది. టాప్‌ఆర్డర్‌లో వచ్చిన బ్యాటర్‌కు పెద్ద స్కోరు చేసే అవకాశం వస్తే వదలకూడదు. మ్యాచ్‌ల్లో జయాపజయాలను నిర్ణయించేది ఇలాంటి ఇన్నింగ్స్‌లే. జేక్‌ ఫ్రేజర్‌తో కలిసి పని చేయాలని ఉంది. అతడు రెండేళ్లలో కచ్చితంగా పెద్ద స్టార్‌ అవుతాడు’’ అని రికీ చెప్పాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తమ బౌలర్లు పవర్‌ప్లేలో ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోయారని.. ఆ తర్వాత కోలుకుని ప్రత్యర్థిని నిలువరించారని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని