పర్వీన్‌పై నిషేధం.. చేజారిన ఒలింపిక్‌ బెర్తు

బాక్సింగ్‌లో భారత్‌ ఓ ఒలింపిక్‌ బెర్తు కోల్పోయింది.

Published : 18 May 2024 03:34 IST

దిల్లీ: బాక్సింగ్‌లో భారత్‌ ఓ ఒలింపిక్‌ బెర్తు కోల్పోయింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత బాక్సర్‌ పర్వీన్‌ హుడాపై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించడమే కారణం. డోపింగ్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పర్వీన్‌పై వాడా 22 నెలల నిషేధం విధించింది. దీంతో మహిళల 57 కేజీల విభాగంలో ఆమె సాధించిన బెర్తును భారత్‌ కోల్పోవాల్సి వచ్చింది. వాడా నిబంధనల ప్రకారం నడుచుకోకపోవడం ఆమెకు చేటు చేసింది. తమ నివాస, శిక్షణకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అథ్లెట్లు వాడాకు తెలియజేయాలి. పరీక్షలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. 2022 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి మధ్యలో పర్వీన్‌ మూడు సార్లు ఈ నిబంధన ఉల్లంఘించడంతో వాడా ఆమెపై చర్యలు తీసుకుంది. వాడా హెచ్చరించినా బాక్సర్‌ గానీ భారత బాక్సింగ్‌ సమాఖ్య గానీ పట్టించుకోకపోవడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నిషేధాన్ని తొలగించాలని పర్వీన్‌ విజ్ఞప్తి చేసుకున్నా ఫలితం లేకపోయింది. శిక్ష అమలును ఎనిమిది నెలలు ముందుకు జరిపింది. ఇంకో 14 నెలల ఆమె పోటీల్లో పాల్గొనడానికి వీల్లేదు. పర్వీన్‌పై నిషేధం నేపథ్యంలో బ్యాంకాక్‌లో ఈ నెల 24న ఆరంభమయ్యే ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ 57 కేజీల విభాగంలో మరో బాక్సర్‌ను పోటీలో నిలపాలని బాక్సింగ్‌ సమాఖ్య ఆలోచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని