బెల్జియంతో అబ్బాయిలు.. అర్జెంటీనాతో అమ్మాయిలు

ప్రొ హాకీ లీగ్‌ ఐరోపా అంచెలో తలపడటానికి భారత హాకీ జట్లు సిద్ధమయ్యాయి. బుధవారం ఆతిథ్య బెల్జియంతో పురుషుల జట్టు.. అర్జెంటీనాతో మహిళల బృందం ఆడతాయి.  ఈ లీగ్‌లో ప్రస్తుతం భారత్‌ (8 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది.

Published : 22 May 2024 03:25 IST

ప్రొ హాకీ లీగ్‌  

ఆంట్వెర్ప్‌ (బెల్జియం): ప్రొ హాకీ లీగ్‌ ఐరోపా అంచెలో తలపడటానికి భారత హాకీ జట్లు సిద్ధమయ్యాయి. బుధవారం ఆతిథ్య బెల్జియంతో పురుషుల జట్టు.. అర్జెంటీనాతో మహిళల బృందం ఆడతాయి.  ఈ లీగ్‌లో ప్రస్తుతం భారత్‌ (8 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌ (12 మ్యాచ్‌ల్లో 20)  అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు అర్జెంటీనాతో   తలపడుతున్న మహిళల జట్టుకు కూడా శుభారంభం చేయడం కీలకం. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన భారత్‌.. కొత్త కెప్టెన్‌ సలీమా సారథ్యంలో బరిలో దిగుతోంది. భారత్‌ 8 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. నెదర్లాండ్‌ (12 మ్యాచ్‌ల్లో 36) అగ్రస్థానంలో కొనసాగుతోంది. 


అర్జున్‌ గేమ్‌ డ్రా 

షార్జా: షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు అర్జున్‌ ఇరిగేశికి వరుసగా రెండో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్లో ఫర్హమ్‌ (ఇరాన్‌)తో.. ఎనిమిదో రౌండ్లో సరానా (సెర్బియా)తో అతడు డ్రా చేసుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న అరవింద్‌ వరుసగా రెండు ఓటములతో టైటిల్‌ రేసులో వెనుకబడిపోయాడు. ఏడో రౌండ్లో జహంగీర్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో డ్రా చేసుకున్న రాజా రిత్విక్‌.. ఎనిమిదో రౌండ్లో సహచర ఆటగాడు ఆదిత్యపై నెగ్గాడు. అర్జున్‌ (5.5 పాయింట్లు) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉండగా.. అరవింద్‌ (5) మూడు, రిత్విక్‌ (3.5) ఆరో స్థానంలో నిలిచారు. 


ఫ్లెమింగ్‌ని ఒప్పించడానికి.. 

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ అన్వేషణ ఇప్పటికే మొదలైంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో మరొకరిని నియమించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అయితే కొందరితో బీసీసీఐ నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చాలా ఏళ్ల నుంచి కోచ్‌గా పని చేస్తున్న ఫ్లెమింగ్‌ను ప్రధాన కోచ్‌ పదవి  చేపట్టేలా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అవసరమైతే చెన్నై మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని రంగంలోకి దింపి ఫ్లెమింగ్‌ను ఒప్పించాలని బోర్డు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 3 ఏళ్ల పాటు కోచ్‌ పదవిలో ఉండటానికి ఈ న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ సుముఖంగా లేడట. అతడు ఐపీఎల్‌తో పాటు టెక్సాస్‌ సూపర్‌కింగ్స్, మేజర్‌ లీగ్‌ క్రికెట్, ద హండ్రెడ్‌ లీగ్స్‌లో కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ బీసీసీఐ ప్రతిపాదనను ఫ్లెమింగ్‌ అంగీకరిస్తే ఈ ఫ్రాంఛైజీలకు దూరం కావాల్సి ఉంటుంది. ‘‘భారత కోచ్‌ పదవిని చేపట్టను అని ఫ్లెమింగ్‌ చెప్పలేదు. తన టీ20 కాంట్రాక్ట్‌ల విషయాన్ని తెలిపాడు. ఆరంభంలో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఇలాగే అన్నాడు. ఫ్లెమింగ్‌ను ఒప్పించాలంటే ధోనిని మించినవాళ్లు ఇంకెవరుంటారు?’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 


బెర్తు సాధించిన వాళ్లే ఒలింపిక్స్‌కు

భారత రెజ్లింగ్‌ సమాఖ్య నిర్ణయం

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్‌ కోటా బెర్తులు సంపాదించిన ఆరుగురు క్రీడాకారులకు సెలెక్షన్‌ ట్రయల్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్ణయించింది. ఒలింపిక్స్‌కు వారినే పంపనుంది. అయితే రెజ్లర్ల ఫామ్, ఫిట్‌నెస్‌ రానున్న ర్యాంకింగ్‌ టోర్నీతో పాటు హాంగేరీలో జరిగే శిక్షణ శిబిరంలో అంచనా వేస్తామని స్పష్టంచేసింది. ఒకవేళ రెజ్లర్లు ఫిట్‌నెస్‌లో విఫలమైతే జులై 8లోపు సెలక్షన్స్‌ నిర్వహించి కోటాను భర్తీ చేస్తామని పేర్కొంది. ఒలింపిక్స్‌కు ముందు ట్రయల్స్‌ నిర్వహిస్తే గాయాలయ్యే ప్రమాదముందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తంజేయడంతో డబ్ల్యూఎఫ్‌ఐ ఈ నిర్ణయం తీసుకుంది. అమన్‌ శెరావత్‌ (57 కేజీలు).. వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీలు), అంతిమ్‌ ఫంగాల్‌ (53 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు)లకు భారత్‌ తరఫున ఒలింపిక్‌ కోటా బెర్తులు దక్కాయి. 


భారత రిలే జట్లకు రజతాలు 

బ్యాంకాక్‌: ఆసియా అథ్లెటిక్స్‌ రిలే ఛాంపియన్‌షిప్‌లో 4×400 మీటర్ల రేసులో భారత జట్లు రజత పతకాలు సాధించాయి. పూవమ్మ, ప్రాచి చౌదరి, రూపల్‌ చౌదరి, విత్య రామ్‌రాజ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 3 నిమిషాల 33.55 సెకన్లలో రేసు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. వియత్నాం (3 నిమిషాల 30.81 సె) పసిడి.. జపాన్‌ (3 నిమిషాల 35.45 సె) కాంస్యం అందుకున్నాయి. పురుషుల 4×400 మీటర్ల రిలేలో మహ్మద్‌ అనాస్, సంతోష్‌ కుమార్, మిజో, రాజీవ్‌ అరోకియాలతో కూడిన బృందం 3 నిమిషాల 5.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక (3 నిమిషాల 4.48 సె), వియత్నాం (3 నిమిషాల 7.37 సె) వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలిచాయి. 4×400 మీ. రిలేలో ఇప్పటికే భారత జట్లు పారిస్‌ కోటా స్థానం సాధించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని