రూడ్‌ శుభారంభం

దిగ్గజ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఓటమితో తొలి రోజు ప్రకంపనలు రేగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో రోజు ఆశ్చర్యకర ఫలితాలేమీ లేకుండా అంతా సాధారణంగా సాగిపోయింది. ఏడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ టోర్నీలో శుభారంభం చేశాడు.

Published : 29 May 2024 01:53 IST

రెండో రౌండ్లో సబలెంక

దిగ్గజ ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఓటమితో తొలి రోజు ప్రకంపనలు రేగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో రోజు ఆశ్చర్యకర ఫలితాలేమీ లేకుండా అంతా సాధారణంగా సాగిపోయింది. ఏడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. మిగతా స్టార్‌ క్రీడాకారులు పెద్దగా ఇబ్బంది లేకుండా రెండో రౌండ్‌ చేరారు.

పారిస్‌: ఏడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో అతడు 6-3, 6-4, 6-3తో అల్వెస్‌ (బ్రెజిల్‌)పై విజయం సాధించాడు. అల్వెస్‌  33 అనవసర తప్పిదాలు చేశాడు. రూడ్‌ నాలుగు సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేశాడు. మరో మ్యాచ్‌లో అయిదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 6-3, 6-4, 5-7, 6-3తో కోయెఫర్‌ (జర్మనీ)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్‌ డిమినార్‌ (ఆస్ట్రేలియా) 6-1, 6-0, 6-2తో మిచెల్సన్‌ (అమెరికా)పై, 14వ సీడ్‌ పాల్‌ (అమెరికా) 6-2, 6-3, 6-1తో కచిన్‌ (అర్జెంటీనా)పై, మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 6-2, 3-6, 6-3, 6-4తో వైల్డ్‌ (బ్రెజిల్‌)పై, ఫ్రిట్జ్‌ (అమెరికా) 2-6, 6-1, 6-2, 6-1తో ఫెడరికో కోరియా (అర్జెంటీనా)పై, అర్నాల్డి (ఇటలీ) 6-3, 4-6, 6-4, 6-2తో ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై, తియోఫె (అమెరికా) 6-3, 3-6, 6-7 (6-8), 6-4, 6-4తోబె బెలుక్కి (ఇటలీ)పై, ఎచెవెరీ (అర్జెంటీనా) 3-6, 6-2, 6-1, 6-4తో కజాక్స్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించారు.

మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌) రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన మొదటి రౌండ్లో ఆమె 6-1, 6-1తో ఆంద్రీవా (రష్యా)ను చిత్తుగా ఓడించింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సబలెంక మ్యాచ్‌లో 27 విన్నర్లు కొట్టింది. ఆంద్రీవా 4 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నాలుగో సీడ్‌ రిబకినా (రష్యా), ఏడో సీడ్‌ జెంగ్‌ (చైనా) కూడా మొదటి రౌండ్‌ను అధిగమించారు. రిబకినా 6-3, 6-3తో మినెన్‌ (జర్మనీ)ని చిత్తు చేయగా.. జెంగ్‌ 6-2, 6-1తో కోర్నెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ కసట్కినా (రష్యా) 7-5, 6-1తో ఫ్రెచ్‌ (పోలెండ్‌)పై, మార్టిచ్‌ (క్రొయేషియా) 6-4, 6-4తో మ్లదనోవిచ్‌ (ఫ్రాన్స్‌)పై, మెర్టెన్స్‌ (జర్మనీ) 6-4, 7-6 (10-6)తో కార్లే (అర్జెంటీనా)పై నెగ్గారు. ఆరో సీడ్‌ సకారి (గ్రీస్‌) 6-3, 4-6, 3-6తో గ్రచేవా (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయింది. మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ) 4-6, 3-6తో అరంటా రస్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో పరాజయంపాలైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని