స్వైటెక్‌ మెరుపులా..

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసిన ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టాప్‌సీడ్‌ అలవోకగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

Published : 05 Jun 2024 03:09 IST

సెమీస్‌లో ప్రవేశం
గాఫ్‌ ముందంజ
గాయంతో జకో ఔట్‌
ఫ్రెంచ్‌ ఓపెన్‌
పారిస్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌ టైటిల్‌పై కన్నేసిన ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టాప్‌సీడ్‌ అలవోకగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో స్వైటెక్‌ 6-0, 6-2తో అయిదోసీడ్‌ వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో స్వైటెక్‌ దూకుడు ముందు వొండ్రుసోవా తేలిపోయింది. మెరుపు సర్వీసులు.. క్రాస్‌కోర్టు విన్నర్లతో  విజృంభించిన ఈ పోలెండ్‌ అమ్మాయి.. తొలి సెట్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరు గేమ్‌లూ తానే గెలుచుకుని సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో వొండ్రుసోవా కాస్త మెరుగ్గా ఆడినా.. స్వైటెక్‌ మాత్రం దూకుడు తగ్గించలేదు. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె.. అదే జోరుతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన స్వైటెక్‌.. 25 విన్నర్లు కొట్టింది. అమెరికా తార కొకోగాఫ్‌ వరుసగా మూడో ఏడాది రొలాండ్‌ గారోస్‌లో సెమీస్‌ చేరింది. క్వార్టర్స్‌లో గాఫ్‌ 4-6, 6-2, 6-3తో ఎనిమిదో సీడ్‌ జాబెర్‌ (ట్యునీసియా)ను ఇంటిముఖం పట్టించింది. తొలి సెట్‌ కోల్పోయినా గాఫ్‌ రెండో సెట్లో పుంజుకుంది. నాలుగు, ఏడో గేమ్‌లలో జాబెర్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఈ అమెరికా అమ్మాయి 5-2 ఆధిక్యం సాధించింది. అదే జోరుతో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్లో గాఫ్‌-జాబెర్‌ హోరాహోరీగా ఆడారు. కానీ నాలుగో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన గాఫ్‌ ఆ తర్వాత సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలవడానికి పెద్దగా ఇబ్బందిపడలేదు. సెమీస్‌లో గాఫ్‌.. స్వైటెక్‌ను ఢీకొననుంది.

వైదొలగిన జకో

రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై  గురిపెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి అర్థంతరంగా తప్పుకున్నాడు. గాయంతో బాధపడుతూనే అతికష్టంగా నాలుగో రౌండ్‌ దాటిన టాప్‌సీడ్‌ జకో.. కాస్పర్‌ రూడ్‌ (నార్వే)తో క్వార్టర్‌ఫైనల్‌ నుంచి వైదొలిగినట్లు ప్రకటించాడు. అర్జెంటీనా కుర్రాడు సెరున్‌డొలోతో ప్రిక్వార్టర్స్‌లో రెండో సెట్లో జకో మోకాలి గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ గెలిచినా.. తర్వాత వరుసగా రెండు సెట్లు కోల్పోయి మ్యాచ్‌ కూడా చేజార్చుకునే స్థితికి వెళ్లాడు. కానీ అనుభవాన్ని రంగరించి 4, 5 సెట్లు నెగ్గి గట్టెక్కాడు. కానీ గాయం అతడిని టోర్నీకే దూరం చేసింది. దీంతో రూడ్‌ క్వార్టర్స్‌ ఆడకుండానే సెమీస్‌ చేరాడు. మరోవైపు జానెక్‌ సినర్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో రెండోసీడ్‌ సినర్‌ 6-2, 6-4, 7-6 (7-3)తో దిమిత్రోవ్‌ (బల్గేరియా) ఆట కట్టించాడు. ఈ మ్యాచ్‌లో మూడో సెట్లో మాత్రమే సినర్‌కు ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. దిమిత్రోవ్‌పై గెలిచే క్రమంలో పదిసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన సినర్‌.. 8 ఏస్‌లు, 29 విన్నర్లు కూడా కొట్టాడు. నాలుగోసీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ముందంజ వేశాడు. నాలుగో రౌండ్లో అతడు 4-6, 6-1, 5-7, 7-6 (7-2), 6-2తో రూన్‌ (డెన్మార్క్‌)పై కష్టపడి గెలిచాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు