ఛెత్రి.. చివరిసారిగా

భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో ఓ శకానికి నేడే ముగింపు. దాదాపు రెండు దశాబ్దాలుగా జాతీయ జట్టు భారాన్ని మోసిన దిగ్గజం సునీల్‌ ఛెత్రి ఇక విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో భాగంగా కువైట్‌తో మ్యాచే తనకు చివరిదని ఛెత్రి గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Published : 06 Jun 2024 03:50 IST

నేడు సునీల్‌ ఆఖరి మ్యాచ్‌
ఫుట్‌బాల్‌ కెరీర్‌కు దిగ్గజం వీడ్కోలు
రాత్రి 7 నుంచి

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో ఓ శకానికి నేడే ముగింపు. దాదాపు రెండు దశాబ్దాలుగా జాతీయ జట్టు భారాన్ని మోసిన దిగ్గజం సునీల్‌ ఛెత్రి ఇక విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో భాగంగా కువైట్‌తో మ్యాచే తనకు చివరిదని ఛెత్రి గత నెలలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారంతో ఛెత్రి ఫుట్‌బాల్‌ మైదానానికి గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ తొలిసారి ప్రపంచకప్‌ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మరి చివరి మ్యాచ్‌లో చరిత్ర సృష్టించి ఛెత్రి నిష్క్రమిస్తాడేమో చూడాలి. ‘‘20 రోజుల క్రితమే నా చివరి మ్యాచ్‌ గురించి మాట్లాడుకున్నాం. ఆ విషయం ముగిసింది. ఇప్పుడు కేవలం భారత్, కువైట్‌ మ్యాచ్‌ గురించే ఆలోచిస్తున్నా. ఇది కేవలం నా చివరి మ్యాచ్‌ మాత్రమే కాదు కువైట్‌తో కీలక పోరు. నా వీడ్కోలు గురించి పదేపదే అడగొద్దు. డ్రెస్సింగ్‌ గదిలో ఆ విషయమే మాట్లాడటం లేదు. ఈ మ్యాచ్‌లో మేం గెలవాల్సిన అవసరం ఉంది. నెగ్గితే మూడో రౌండ్‌కు వెళ్లే గొప్ప అవకాశం దక్కుతుంది. అభిమానుల నుంచి గొప్ప ఆదరణ లభించే కోల్‌కతాలో ఆడబోతుండటం సంతోషంగా ఉంది. జట్టు మూడో రౌండ్‌కు చేరినా ఆటలో కొనసాగే ఆలోచన లేదు. నా వీడ్కోలుకు ఇంతకంటే ఉత్తమ మ్యాచ్‌ దొరకదు. మన్వీర్, శివశక్తి నారాయణన్, రహీమ్‌ తదితర యువ ఆటగాళ్లు జట్టులో చోటు కోసం చూస్తున్నారు. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు కదా అని నన్ను అడుగుతున్నారు. కోచ్‌గానూ మారే ప్రసక్తే లేదు. ఇకపై నా గురించి తప్పా మ్యాచ్, ఆట గురించి ఆలోచించాలనుకోవడం లేదు’’ అని ఛెత్రి పేర్కొన్నాడు. కువైట్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే ఆసియాలోని టాప్‌-18 జట్లతో ప్రపంచకప్‌ బెర్తు కోసం తలపడనుంది. ఈ విజయంతో పరిస్థితులు మారే అవకాశముందని భారత కెప్టెన్‌ ఛెత్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. 39 ఏళ్ల ఛెత్రి భారత్‌ తరపున 150 మ్యాచ్‌లాడి 94 గోల్స్‌ కొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు