ఇవేం పిచ్‌లు?

క్రికెట్‌ను విస్తరించాలనే ఉద్దేశంతో.. కొత్త అభిమానులను సంపాదించుకోవాలనే లక్ష్యంతో తొలిసారి అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ఐసీసీ నిర్వహిస్తోంది.

Published : 07 Jun 2024 04:19 IST

న్యూయార్క్‌

క్రికెట్‌ను విస్తరించాలనే ఉద్దేశంతో.. కొత్త అభిమానులను సంపాదించుకోవాలనే లక్ష్యంతో తొలిసారి అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ఐసీసీ నిర్వహిస్తోంది. అయితే అమెరికా అభిమానుల మాటేమో కానీ న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యాచ్‌లు ఇతర క్రికెట్‌ ప్రధాన దేశాల్లోని జనాలకూ నిరాశ కలిగిస్తున్నాయి. భారత్‌లోని అభిమానులకూ తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తున్నాయి. అందుకు కారణం ఈ పొట్టి కప్‌ మ్యాచ్‌ల కోసం కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలోని పిచ్‌లే. ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై అస్థిర బౌన్స్, అనూహ్యమైన స్వింగ్‌ లభిస్తోంది. పగుళ్ల కారణంగా బంతి ఎక్కడ పడి ఎటు వెళ్తుందో, ఎంత ఎత్తులో వస్తుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఈ మందకొడి పిచ్‌లు బౌలర్లకు అనుకూలంగా, బ్యాటర్లకు కఠినంగా మారాయి. బ్యాటర్లు ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడితేనే టీ20 మజా దక్కేది. ఇప్పుడు న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యాచ్‌ల్లో ఆ మెరుపులే లేవు.  

బ్యాటర్లకు గాయాలు: అస్థిర బౌన్స్, స్వింగ్‌ కారణంగా ఈ పిచ్‌లు బ్యాటర్లకు ప్రమాదకరంగా మారాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా దూసుకొచ్చిన బంతుల వల్ల రోహిత్‌ శర్మ, పంత్‌కు గాయాలయ్యాయి. పేసర్‌ జోష్‌ లిటిల్‌ బౌలింగ్‌లో అస్థిర బౌన్స్‌ కారణంగా రోహిత్‌ భుజానికి దిగువన గాయమైంది. దీంతో అతను రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. గాయం తీవ్రత మరీ ఎక్కువేమీ కాదు కాబట్టి జట్టుకు ఉపశమనం దక్కింది. మరోవైపు పంత్‌ మోచేతికీ బంతి బలంగా తాకింది. అంతకంటే ముందు ఐర్లాండ్‌ బ్యాటర్‌ టెక్టార్‌ హెల్మెట్‌కు బూమ్రా బౌన్సర్‌ తగిలింది. అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడేందుకు ఈ ప్రమాదకరమైన పిచ్‌ సరైందే కాదని జింబాబ్వే మాజీ కెప్టెన్‌ ఆండీ ఫ్లవర్‌ అభిప్రాయపడ్డాడు. బంతిపై నియంత్రణ కష్టంగా మారిందని, ఎక్కువగా స్వింగ్‌ అయిందని పేసర్‌ అర్ష్‌దీప్‌ అన్నాడు. 

ఆలస్యమే కారణమా?: వంద రోజుల్లోనే నిర్మించిన ఈ స్టేడియంలో ఆలస్యంగా పిచ్‌లను అమర్చడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌లో ఆస్ట్రేలియా నుంచి ఈ డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను తీసుకొచ్చారు. అప్పుడు న్యూయార్క్‌లో వర్షం, మంచు వల్ల చల్లటి వాతావరణం కారణంగా ఫ్లోరిడాలో ఉంచి సిద్ధం చేశారు. ఫిబ్రవరిలో వీటిలో నాలుగు పిచ్‌లను మైదానంలో అమర్చారు. ఓ కొత్త పిచ్‌పై జూనియర్‌ స్థాయిలో ఓ 10 మ్యాచ్‌లు, ఆ తర్వాత సీనియర్‌ దేశవాళీ మ్యాచ్‌లు, అనంతరం అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ బంగ్లాదేశ్‌తో భారత్‌ వార్మప్‌ మ్యాచ్‌కు ముందు మాత్రమే ఐసీసీకి అప్పగించిన ఈ మైదానంలోని ఒకటవ పిచ్‌పై శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచే మొదటిది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకే ఆలౌటైంది. ఛేదనలోనూ దక్షిణాఫ్రికా కష్టపడింది. నాలుగో పిచ్‌పై ఓ వార్మప్‌తో పాటు భారత్, ఐర్లాండ్‌ మ్యాచ్‌ జరిగింది. ఐర్లాండ్‌ 96కే కుప్పకూలింది. ఇంకా 2వ, 3వ పిచ్‌లు కొత్తవే. ఇలాంటి పిచ్‌పైనే క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో రెండు జట్లలోని పేసర్లు చెలరేగితే మరోసారి స్వల్ప స్కోర్ల పోరు తప్పదు. పాక్‌తో పోరులో ఈ పిచ్‌ నుంచి ఏం ఆశించాలో అర్థం కావడం లేదని రోహిత్‌ అన్నాడు. ‘‘ఇది పేలవమైన పిచ్‌. డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు మూడు నెలల ముందుగానే మైదానంలో అమర్చాల్సింది. సాంద్రత ఏర్పడాలంటే దీనిపై ఆడాలి. విభిన్నమైన రోలర్లను వాడాలి. టీ20 క్రికెట్‌కు నప్పని పిచ్‌ ఇది’’ అని బీసీసీఐ మాజీ ప్రధాన క్యూరేటర్‌ దల్జీత్‌ సింగ్‌ పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని