T20 World Cup 2024: ఉగాండాకో విజయం

ఉగాండా అదరగొట్టింది.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న ఈ జట్టు టోర్నీలో ఖాతా తెరిచింది.

Updated : 07 Jun 2024 05:07 IST

పాపువా న్యూగినీపై గెలుపు

పావిడెన్స్‌: ఉగాండా అదరగొట్టింది.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్న ఈ జట్టు టోర్నీలో ఖాతా తెరిచింది. గ్రూప్‌-సి పోరులో ఉగాండా 3 వికెట్ల తేడాతో పాపువా న్యూగినీని ఓడించింది. మొదట పాపువా 19.1 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. 15 పరుగులు చేసిని హిరిహిరి టాప్‌స్కోరర్‌. ఛేదనలో తడబడినా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రియాజత్‌ అలీ (33) నిలవడంతో ఉగాండా 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 

నిలిచిన రియాజాత్‌: స్పల్ప ఛేదనలో ఉగాండా 3 ఓవర్లకు 8/3తో కష్టాల్లో చిక్కుంది. రోజర్‌ (0), సిమోన్‌ (1), రాబిన్సన్‌ (1) వెనుదిరిగారు. 7 ఓవర్లలో 30 పరుగులకే సగం ఉగాండా వికెట్లు పడగొట్టిన పాపువానే విజయం సాధించేలా కనిపించింది. కానీ రియాజత్‌ అలీ పట్టుదలగా నిలిచాడు. మియాగి (13) తోడుగా ఉగాండాను గెలుపు దిశగా నడిపించాడు. విజయానికి చేరువగా ఉన్నప్పుడు మియాగి, రియాజత్‌ వెనుదిరిగినా.. కెన్నిత్‌ (7 నాటౌట్‌) పని పూర్తి చేశాడు. అంతకుముందు తొలి ఓవర్లో కెప్టెన్‌ అసద్‌ వలా (0)ను ఔట్‌ చేసిన రంజానీ (2/17).. పాపువా పతనాన్ని మొదలుపెట్టాడు. అక్కడ నుంచి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. 12 ఓవర్లకు 51/5తో నిలిచిన పాపువా.. మరో 26 పరుగులే జత చేసి 77కే ఆలౌటైంది. రంజానీతో పాటు కాస్మాస్‌ (2/17), మియాగి (2/10), సుబుగా (2/4) ప్రత్యర్థి కట్టడిలో కీలకమయ్యారు.

సంక్షిప్త స్కోర్లు..

పాపువా న్యూగినీ: 19.1 ఓవర్లలో 77 ఆలౌట్‌ (హిరిహిరి 15, సైకా 12, కిప్లిన్‌ 12; రంజానీ 2/17, కాస్మాస్‌ 2/17, మియాగి 2/10, సుబుగా 2/4); ఉగాండా: 18.2 ఓవర్లలో 78/7 (రియాజత్‌ అలీ 33, మియాగి 13; అలైనవూ 2/16, నార్మన్‌ 2/19)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని