T20 World Cup: పాక్‌ పనిపట్టింది మనోళ్లే?

ప్రపంచకప్‌ ఏదైనా పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం. టీ20 ప్రపంచకప్‌లోనూ మనదే మెరుగైన రికార్డు. చిరకాల ప్రత్యర్థిపై పోరులో టీమ్‌ఇండియాదే జోరు.

Updated : 08 Jun 2024 07:00 IST

ప్రపంచకప్‌ ఏదైనా పాకిస్థాన్‌పై భారత్‌దే ఆధిపత్యం. టీ20 ప్రపంచకప్‌లోనూ మనదే మెరుగైన రికార్డు. చిరకాల ప్రత్యర్థిపై పోరులో టీమ్‌ఇండియాదే జోరు. ఇప్పుడు పొట్టికప్‌లోనూ దాయాదిపై మరోసారి మన విజయం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ అంతకంటే ముందే పాక్‌కు మనోళ్లు షాకిచ్చారు. పాక్‌పై సంచలన విజయాన్ని సాధించింది అమెరికానే కానీ.. ఆ జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువ. ఈ చరిత్రాత్మక గెలుపు వెనుక ఉన్నది మనోళ్లే! 


డల్లాస్‌

ఆతిథ్య హోదాలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న పసికూన అమెరికా అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో నిలకడైన జట్టుగా పేరొందిన మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడే సత్తా తమకూ ఉందని చాటింది. ఈ గెలుపులో జట్టులోని భారత సంతతి ఆటగాళ్లు ప్రధాన పాత్ర పోషించారు. యుఎస్‌ఏ జట్టులో అక్కడి వాళ్లకంటే మన దేశ మూలాలు ఉన్న ఆటగాళ్లే ఎక్కువ. ఇక్కడ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడి, అవకాశాలు రాక కొంతమంది.. ఇక్కడి పోటీని తట్టుకోలేక మరికొంతమంది అమెరికా వెళ్లిపోయారు. పాక్‌పై కీలకమైన అర్ధసెంచరీతో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచిన కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌ పుట్టింది అహ్మదాబాద్‌లోనే. గుజరాత్‌ అండర్‌-16, 19కు ఆడిన ఈ గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో క్రికెట్‌ కెరీర్‌ కోసం అమెరికా వెళ్లాడు. 2010లో గ్రీన్‌కార్డు పొందిన అతను జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇన్నింగ్స్‌ నిర్మించడంలోనూ, అవసరమైన గేర్లు మార్చడంలోనూ పట్టు సాధించాడు. మ్యాచ్‌లు లేనప్పుడు పిల్లలకు క్రికెట్‌ పాఠాలూ చెబుతాడు. న్యూజెర్సీలో స్థిరపడ్డ 31 ఏళ్ల మోనాంక్‌ ఇప్పటివరకూ 47 వన్డేలు, 27 టీ20లు ఆడాడు. 


సూపర్‌ ఓవర్‌ హీరో

మొదట మ్యాచ్‌లో, ఆ తర్వాత సూపర్‌ ఓవర్లో అద్భుతమైన బౌలింగ్‌తో జట్టును గెలిపించిన 32 ఏళ్ల సౌరభ్‌ నేత్రావల్కర్‌ది విభిన్నమైన ప్రస్థానం. ముంబయిలో పుట్టిన ఈ ఎడమచేతి వాటం పేసర్‌ భారత్‌ తరపున 2010 అండర్‌-19 ప్రపంచకప్‌లో కేఎల్‌ రాహుల్, మయాంక్, హర్షల్‌ పటేల్, జైదేవ్‌ ఉనద్కత్, సందీప్‌ శర్మ తదితర ఆటగాళ్లతో కలిసి ఆడాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు (6 మ్యాచ్‌ల్లో 9) తీసిన భారత బౌలర్‌గానూ నిలిచాడు. ఆ టోర్నీలో బాబర్‌ అజాం ఆటగాడిగా ఉన్న పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ సౌరభ్‌ ఆడాడు. అనంతరం దేశవాళీల్లో ముంబయికి ప్రాతినిథ్యం వహించాడు. ఓ రంజీ మ్యాచ్‌ కూడా ఆడాడు. కానీ టీమ్‌ఇండియాలోకి రావాలంటే మెరుగ్గా ఆడితే సరిపోదు, అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. అందుకే సౌరభ్‌కు ఆ అవకాశం రాలేదు. దీంతో చదువుపై ధ్యాస మళ్లించిన అతనికి కార్నెల్‌ విశ్వవిద్యాయంలో ఎమ్మెస్‌ చేసేందుకు స్కాలర్‌షిప్‌ వచ్చింది. అక్కడి కళాశాలలో అతని క్రికెట్‌ ప్రతిభ వెలుగులోకి రావడంతో మళ్లీ ఆట వైపు మళ్లాడు. ఒరాకిల్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే జాతీయ జట్టుకూ ఆడుతున్నాడు. 48 వన్డేలు, 29 టీ20లు ఆడిన సౌరభ్‌ గతంలో యుఎస్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 


కెనడా నుంచి

పాక్‌తో మ్యాచ్‌లో చివరి బంతికి ఫోర్‌ కొట్టి పోరును సూపర్‌ ఓవర్‌కు మళ్లించడంతో నితీశ్‌ కుమార్‌ పేరు మార్మోగుతోంది. ఈ 30 ఏళ్ల స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కెనడా తరపున కూడా అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిథ్యం వహించడం విశేషం. 2011 ప్రపంచకప్‌లో ఆడిన కెనడా జట్టులో ఉన్న నితీశ్‌.. అతిపిన్న వయస్సు (16 ఏళ్ల 283 రోజులు)లో వన్డే ప్రపంచకప్‌ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో కెనడా తరపున రాణించాడు కూడా. కానీ కరోనా కారణంగా టొరొంటోలో సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ విధించడంతో క్రికెట్‌ కోసం అతను అమెరికాకు మకాం మార్చాడు. ఇక మూడు వికెట్లతో పాక్‌ను దెబ్బకొట్టిన నొస్తుష్‌ కంజిగేది మరో కథ. అలబామలో పుట్టినా తమిళ్‌- అమెరికన్‌గా కంజిగె ప్రయాణం సాగింది. అతని చిన్నప్పుడు కుటుంబం తిరిగి భారత్‌ (ఊటి)కు వచ్చేసింది. పేసర్‌ నుంచి స్పిన్నర్‌గా మారిన అతను 18 ఏళ్లకు బెంగళూరు వెళ్లాడు. అక్కడ కర్ణాటక క్రికెట్‌ సంఘం ఫస్ట్‌ డివిజన్‌ లీగ్‌లో ఆడాడు. కానీ కర్ణాటక రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని తెలుసుకున్న అతను మెరుగైన జీవితం కోసం అమెరికా తిరిగెళ్లాడు. యుఎస్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడ తిరిగి క్రికెట్‌ కెరీర్‌ మొదలెట్టిన అతను ఉద్యోగాన్ని వదిలేసి ఆటపైనే ధ్యాస పెట్టాడు. 


ఆ ఘటనతో

2010, 2012 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌కు ఆడిన స్పిన్నర్‌ హర్మీత్‌ సింగ్‌ సీనియర్‌ జట్టుకు ఆడతాడనే అంచనాలు నెలకొన్నాయి. రంజీల్లో ముంబయి తరపునా నిలకడగా రాణించాడు. కానీ ఓ రైల్వే స్టేషన్‌ లోపల కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో అతని కెరీర్‌ తలకిందులైంది. క్రమశిక్షణ చర్యల కారణంగా అతను ముంబయి జట్టుకు దూరమయ్యాడు. త్రిపుర వెళ్లి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడినా విజయవంతం కాలేకపోయాడు. అప్పుడే అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ తన స్పిన్‌తో, హిట్టింగ్‌ నైపుణ్యాలతో మెప్పించి యుఎస్‌ జాతీయ జట్టులో ఈ ఏడాదే అడుగుపెట్టాడు. మరోవైపు ఇక్కడ రంజీల్లో దిల్లీ, సిక్కిం తరపున ఆడి 1300కు పైగా పరుగులు చేసిన మిలింద్‌ కుమార్‌ కూడా అవకాశాలు దక్కక కరోనా తర్వాత అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడి దేశవాళీ టోర్నీల్లో రాణించి ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. సూపర్‌ ఓవర్లో  ఇఫ్తికార్‌ అహ్మద్‌ క్యాచ్‌ను ముందుకు డైవ్‌ చేసి అద్భుతంగా అందుకున్నాడు. మరోవైపు న్యూజెర్సీలో పుట్టి, పంజాబ్‌లో పెరిగి.. తిరిగి అమెరికా వెళ్లిన జస్‌దీప్‌ సింగ్‌ ఆ జట్టులో ప్రధాన పేసర్లలో ఒకడిగా ఎదిగాడు. మంచి పేస్‌తో ఆకట్టుకుంటున్న అతను.. పాక్‌తో మ్యాచ్‌లో కీలకమైన బాబర్‌ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని