క్రీడా పెన్నిధి

అక్షరమే ఆయుధంగా.. ప్రజా సంక్షేమమే పరమావధిగా.. ప్రజల గొంతుకై ‘ఈనాడు’ రూపంలో నినదించిన రామోజీ రావు క్రీడా పెన్నిధిగానూ నిలిచారు. ఎంతో మంది అథ్లెట్ల సత్తాను పత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో కొత్త ఒరవడిని సృష్టించారు.

Published : 09 Jun 2024 04:09 IST

అక్షరమే ఆయుధంగా.. ప్రజా సంక్షేమమే పరమావధిగా.. ప్రజల గొంతుకై ‘ఈనాడు’ రూపంలో నినదించిన రామోజీ రావు క్రీడా పెన్నిధిగానూ నిలిచారు. ఎంతో మంది అథ్లెట్ల సత్తాను పత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో కొత్త ఒరవడిని సృష్టించారు. ‘లక్ష్య’ కార్యక్రమం ద్వారా అథ్లెటిక్స్, ఫుట్‌బాల్‌లో తెలుగు రాష్ట్రాల్లోని 1200 మందికి శిక్షణ అందుతుందంటే అది ఆయన చొరవే. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలిగే క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలిచి అద్భుత ఫలితాలు సాధించేలా దారిచూపారు. 

ఈనాడు - హైదరాబాద్‌

ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన రామోజీ రావు క్రీడా ప్రేమికుడు కూడా. క్రీడలకు ప్రత్యేక పేజీ ఉండాలనే లక్ష్యంతో ‘ఛాంపియన్‌’ను తీసుకొచ్చారు. తెలుగు పత్రికా రంగంలో ఇలాంటి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆయనే. ఈ పేజీ ద్వారా ఎంతోమంది అథ్లెట్ల విజయ గాథలను వెలుగులోకి తెచ్చి, మరెంతో మంది ఆటల వైపు నడిచేలా స్ఫూర్తి నింపారు. క్రీడాకారుల కష్టాలను ప్రపంచానికి తెలియజేసి అండ దొరికేలా చూశారు. చాలా మంది ప్లేయర్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. 2002లో ఫిడే నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌కు ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ ఆతిథ్యం ఇవ్వడం ఆయనకు ఆటలపై ఉన్న మక్కువను చాటుతోంది. ఆ టోర్నీలో వాసిలీ ఇవాంచుక్‌ (ఉక్రెయిన్‌), అలెగ్జాండర్‌ మొరోజెవిచ్‌ (రష్యా), రుస్తమ్‌ ఖాసీమ్‌జనోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) లాంటి స్టార్లతో తలపడి దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ విజేతగా నిలిచాడు.  

ఆ లక్ష్యంతో: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులను వెలికి తీయాలనే లక్ష్యంతో.. మట్టిలోని మాణిక్యాలను సానబెట్టాలనే ఉద్దేశంతో 2019లో ‘ఈనాడు’ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ‘లక్ష్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 20 కేంద్రాలతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రధాన, ఉప కేంద్రాలు కలిపి 50కి చేరుకుంది. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ‘లక్ష్య’ కార్యక్రమంలో భాగంగా శిక్షణ అందిస్తున్నారు. ఇందు కోసం 50 మంది కోచ్‌లను నియమించారు. దీని ద్వారా ప్రతిభావంతులైన వర్థమాన అథ్లెట్లకు అన్ని రకాలుగా అండగా నిలవాలన్నదే రామోజీ ఆకాంక్ష. క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు కోచింగ్, వసతి తదితర సౌకర్యాలూ కల్పిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను సానబెట్టి ప్రపంచ స్థాయి అథ్లెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల వారీగా అథ్లెట్లకు ప్రత్యేకంగా శిక్షణ సౌకర్యాలు కల్పిస్తున్నారు. 46 మంది ఉత్తమ అథ్లెట్లకు ప్రతి నెల స్కాలర్‌షిప్‌ ఇస్తున్నారు. పుల్లెల గోపీచంద్‌ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో మెరిసే అథ్లెట్లకు శిక్షణతో పాటు వసతి కూడా కల్పిస్తున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దండి జ్యోతికశ్రీ, ప్రపంచ పారా ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించడంతో పాటు పారిస్‌ పారాలింపిక్స్‌ బెర్తు దక్కించుకున్న జీవాంజి దీప్తి ‘లక్ష్య’ అథ్లెట్లే. నిరుడు ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన అగసర నందిని, నిలకడగా రాణిస్తున్న మల్లాల అనూష, షణ్ముగ శ్రీనివాస్, రజిత కుంజ, ఇంజమూరి శ్యామ్‌ కూడా ‘లక్ష్య’ గొడుగు కింద ఉన్నవాళ్లే. అంతే కాకుండా చినజీయర్‌ అంధుల పాఠశాల, హీల్‌ ఫౌండేషన్‌ (విజయవాడ)తోనూ కలిసి అక్కడివాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. వీల్‌చెయిర్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పడాల రూపకు అండగా నిలిచారు. మరోవైపు టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా, చెస్‌ అగ్రశ్రేణి ఆటగాడు పెంటేల హరికృష్ణ ఎదుగుతున్న దశలోనూ రామోజీ సాయం చేశారు.

రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న కోచ్‌లు గోపీచంద్, రమేశ్, అథ్లెట్లు దీప్తి, నందిని


‘‘దేశ ప్రజలకు ముఖ్యంగా తెలుగు జనాలకు రామోజీ మరణం తీరని లోటు. ఆయన లాంటి స్ఫూర్తి ప్రదాతలు మరొకరు ఉండరు. సమాజ సేవలో ఎవరూ ఆయనకు సరిరారు. వ్యక్తిగతంగా అకాడమీ ద్వారా ఎలాంటి హడావుడి లేకుండా రామోజీ రావు ఎంతోమంది అథ్లెట్లకు అండగా నిలిచారు. క్రీడల్లో అలాంటి దూరదృష్టి కలిగిన వ్యక్తిని చూడలేదు’’ 

బ్యాడ్మింటన్‌ జాతీయ ప్రధాన కోచ్‌ పుల్లెల గోపీచంద్‌


‘‘రామోజీ రావు మరణ వార్త విని తీవ్రమైన బాధకు గురయ్యా. నా జీవితాన్ని ఆయన ఎంతలా ప్రభావితం చేశారో చెప్పాలనుకుంటున్నా. ఆయన అద్భుతమైన కృషి, నాయకత్వం చూస్తూ పెరిగా. ఆయన నా ఆరాధ్య వ్యక్తుల్లో ఒకరిగా మారారు. ఆయన నిబద్ధత, ముందు చూపు, సేవ నాపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. ఆయన కలిగించిన ప్రేరణ పట్ల ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటా’’

మాజీ క్రికెటర్, బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని